"లైసెన్సు లేకుండా అమ్మే డీలర్లు లేరా?" అంది అప్సర.

 

    "ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర కొనొద్దు మనం.... అలాంటి వాళ్ళ దగ్గర కొన్న ఆయుధాలు దగ్గర వుంటే, అవి ఎవరన్నా చెక్ చేసినప్పుడు బయటపడిపోతే చాలా కష్టమయిపోతుంది. కోర్టులు - శిక్షలు - జైళ్ళూ తప్పవు మన  'ఆపరేషన్' గంగలో కలిసిపోతుంది.   

 

    కానీ ఒక పని చెయ్యొచ్చు మనం. ఇలా లైసెన్సు లేకుండా ఆయుధాలు అమ్మే డీలర్ల దగ్గరకు వెళ్ళి, ఫోర్జరీ చేసిన ఎండ్ యూసర్ సర్టిఫికేట్ ఒకటి సాధించి, దాన్ని తీసుకుని, లైసెన్సు ఉన్న డీలర్ దగ్గరకి వెళ్ళాలి అప్పుడా లైసెన్స్ డ్ డీలర్ తన దగ్గర వున్న లీగల్ స్టాక్స్ లో నుంచి ఆయుధాలు ఇచ్చి వాటికీ ఎక్స్ పోర్టు లైసెన్సు సంపాదించగలడు సులభంగా.

 

    "దట్ సెటిల్స్ ఇట్:" అంది అప్సర.

 

    "అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ వుంది." అన్నాడు రుద్ర ప్రసాద్. "ఇప్పుడు మనం కొనదలుచుకున్న ఆయుధాలేమిటంటే, ఆటోమాటిక్ పిస్టల్సూ, సబ్ మెషిన్ కార్బెన్స్ లో పట్టే ఓ నాలుగైదు లక్షల రౌండ్ల స్టాండర్డ్ నైన్ ఎమ్, ఎమ్. అమ్యునిషన్, కొన్ని 60 ఎమ్. ఎమ్. మోర్టార్ ట్యూబులూ, ఓ వందా రెండొందల బాంబులూ, నాలుగయిదు బజూకా రాకెట్ల ట్యూబులూ, యాభై రాకెట్లూ.  

 

    ఇవన్నీ కూడా ఒకే డీలర్ దగ్గర కొనం. ఎందుకంటే వీటిని చూడగానే మన ప్లాను ఏమిటో, ఆ ఆయుధాలు ఎందుకు కొంతున్నామో అర్థమయి పోయే ప్రమాదం వుంది.

 

    అందుకని వీటిని విడివిడిగా యిద్దరు ముగ్గురు దగ్గర కొంటాం."

 

    ఆ విధంగా దాదాపు గంటన్నరసేపు తన ప్లాను కూలంకషంగా అప్సరకి వివరించాడు రుద్రప్రసాద్.

 

    వద్దనుకున్నా ఇప్పుడు ఎగ్జయిట్ మెంట్ కనబడుతోంది అప్సర మొహంలో.

 

    "సరే: నీ ప్లానులన్నీ దాచకుండా నాతో చెప్పేశావ్. అందుకని నేను నీతోబాటు దీనిలో యాక్టివ్ గా ఇన్ వాల్వ్ అవుతాను" అని ఆగి, తర్జనితో అతన్ని బెదిరిస్తున్నట్లు అంది అప్సర.... "కానీ మళ్ళీ చెబుతున్నాను. గుర్తుంచుకో: ఇది చివరి అసైన్ మెంటు. దీని తర్వాత నువ్వు రిటరయిపోవాలి. మనిద్దరం..."

 

    "ఒక తోటలో పొదరిల్లు కట్టుకొని..."

 

    నవ్వింది అప్సర.

 

    తర్వాత సీరియస్ గా అన్నాడు రుద్రప్రసాద్.

 

    "అయితే ఒక విషయంలో నాకు బాధగా వుంది."

 

    "ఏమిటది?" అంది అప్సర ఆదుర్ధాగా.

 

    "నేను ఏదీ దాచకుండా ఉన్నది వున్నట్లు నీకు చెప్పేశాను. కానీ నువ్వే ఏదో దాస్తున్నావు."

 

    "నేనా? దాస్తున్నానా?" అంది అప్సర కలవరంగా.

 

    "అవును. జనరల్ భోజాని చంపాలనే ఈ ఆపరేషన్ మీ నాన్న దుష్టశిక్షణా, శిష్ట రక్షణా జరపడానికి చేస్తున్నాడనుకోను. ఇంకేదో పెద్ద ఎత్తులోనే ఉన్నాడు ముసలాయన. ఆ ఎత్తేదో నీకూ తెలిసే వుండాలి. కానీ నువ్వు నాకు చెప్పడం లేదు."  

 

    దోషిలా తలవంచుకుంది అప్సర.

 

    సిగరెట్ అంటించి, ఆమెవైపే చూస్తూ కూర్చున్నాడు రుద్రప్రసాద్.

 

    సులభంగా చెబుతుందా ఈ పిల్ల?

 

    లేకపోతే తను తనకు అలవాటయిన మోటు పద్ధతులతో దీనిచేత నిజం కక్కించవలసి వస్తుందా?   

 

    'ప్రేమ' అనే ట్రంప్ కార్డుతో చాలా పనులు సాధించగలడు తను. అది సాధారణంగా తిరుగులేని ఆయుధం.

 

    ఒక్కసారి అది ఫెయిలయిపోతే, వెల్ - ఇంక తక్కిన పద్ధతులు ఉండనే వున్నాయి.

 

    ఆ తర్వాత రక్తం అదీ కడిగేసి రూము శుభ్రం చెయ్యడానికి బాత్ రూంలో నీళ్ళు వస్తున్నాయా?

 

    "రుద్రా: నువ్వంటే నాకు పంచప్రాణాలు. నీ దగ్గర నా వళ్ళే దాచుకోలేకపోయాను. ఇంక రహస్యాలేం దాచగలను ." అని ఆగి, "చిత్రద్వీప్ లో ఊహించలేనంత పరిమాణంలో యురేనియం వుంది. దాదాపు లక్ష కోట్లరూపాయల విలువచేసే యురేనియం" అంది అప్సర.

 

    చిన్నగా విజిల్ వేశాడు రుద్రప్రసాద్.

 

    యురేనియం:

 

    లక్షకోట్ల రూపాయలు:

 

    పైగా...

 

    దానికి మిలటరీ వుపయోగం ఎంత వుంది:

 

    ప్రపంచాన్ని ఏలెయ్యవచ్చు అది దొరికితే:

 

    అంత యురేనియం సాధించినందుకు తనకో కోటిపారేస్తాడా బాబూజీ:

 

    వెల్: ముసలాడి గుట్టు తెలిసింది.

 

    ఇంక జనరల్ భోజాని చంపుతాడు తను.

 

    చంపి, తనే చిత్రద్వీప్ కి చీఫ్ అయిపోతాడు.

 

    దేశాలన్నిటినీ గడగడ లాడించేస్తాడు.

 

    "రుద్రా:" అంది అప్సర అతడివైపు నిశితంగా చూస్తూ.

 

    తనని తాను కంట్రోల్ లోకి తెచ్చుకుంటూ, ఆమెని కౌగిట్లోకి తీసుకున్నాడు రుద్రప్రసాద్.

 

    ఇంతకుముందు ముసలాడి దగ్గర డబ్బు చేజిక్కించుకుని ఇక్కడ నుంచి పారిపోదామా అన్న ఆలోచనకూడా ఉండేది.

 

    ఇప్పుడా ఆలోచన లేదు.

 

    జనరల్ భోజాని చంపి తీరతాడు తను.

 

    అందుకోసం ఆయుధాల కోసం సిన్సియర్ గా ప్రయత్నిస్తాడు.

 

    హఠాత్తుగా అతనికి ఆయుధాల వ్యాపారి అమీర్ గుర్తువచ్చాడు.

 

    అమీర్ ఇబ్బందుల్లో ఉన్నాడని విన్నాడు తను.