ఎందుకో గుండె లయతప్పినట్టు ఓ క్షణంపాటు స్థబ్ధంగా నిలబడిపోయాడు.

 

    అప్పటికి మిగిలింది మరో పావుగంట.

 

    ఒక ప్రముఖ రచయిత అయినంతమాత్రాన భాష మొత్తాన్ని ఔపోసన పట్టివుండాలన్న రూలేం లేదు.

 

    అలాంటప్పుడు ఇంత క్లిష్టమైన సమస్య తనకెందుకు యిచ్చింది!

 

    నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చిన మన్మథరావుని చూసిన నానీ "ఏంటంకుల్ నీకేమైంది?"

 

    బయట అరుగుపై నిస్త్రాణగా చతికిలబడుతూ ఓ మంత్రంలా పైకే అనేశాడు "అప్రశిఖ."

 

భగ్నమైపోతున్న దశాబ్దాల తపస్సుకి ప్రతీకగా ఒక నీటిబొట్టు అతడి నేత్రాంచలాలలోనుంచి జారిపడటాన్ని గమనించిన నానీ "నీకు అర్థం తెలీదా" అన్నాడు మెల్లగా.

 

    జవాబులేదు.

 

    "అసలు దానికి అర్థమే లేదుగా."

 

    "అంటే" ఈ పసివాడికి ఇదంతా ఎలా తెలుసన్న ఉద్విగ్నత మన్మథరావు కళ్ళలో...

 

    "ఒక శ్లోకంలోని నాలుగుపదాలలో మొదటి అక్షరాలు కలిపితే అప్రశిఖ వస్తుందని తాతయ్య చెప్పాడు."  

 

    "నానీ" దేవుడు కరుణించి పంపిన దూతలా అనిపించిన పసికందును అమాంతం దగ్గరకు లాక్కున్నాడు. "నీకు... శ్లోకం తెలుసా?"

 

    "ఓ!" జవాబు చెప్పాడు నాని.

 

    అప్పటికి మన్మథరావుకి మిగిలిన గడువు అయిదు నిముషాలు మాత్రమే వుంది.

 

                                    *    *    *

 

    కోర్టుహాల్లోంచి బయటకు వచ్చాడు యశస్వి.

 

    అతి ముఖ్యమైన సాక్షి అందుబాటులో లేనికారణంగా ఒక పదిరోజులు గడువు కోరిన ప్రాసిక్యూటర్ అభ్యర్థన్ని అంగీకరించిన మేజిస్ట్రేట్ కేసు వాయిదా వేశాడు.

 

    దీన్ని విజయంగా భావించలేదు యశస్వి.

 

    తన ఓటమికి తొలిమెట్టుగా అనిపించి ఉక్రోషంగా కణతలు నొక్కుకున్నాడు.

 

    ఒకవేళ నానీ బ్రతికివుంటే పదిరోజుల గడువులో రేయింబవళ్ళు శ్రమించయినా నానీని తీసుకురాగలడన్నా నమ్మకం వుంది.

 

    లేకపోతే...

 

    బ్రతికి లేకపోయినా కీలకమైన సాక్ష్యాన్ని పరిమార్చిన నేరస్థుల్ని పట్టుకోగలడు.

 

    అదికాదు ఆ క్షణంలో అతడ్ని అంతగా బాధిస్తున్నది.

 

    మరికొన్ని గంటల్లో తను ట్రాన్స్ ఫర్ ఆర్డర్ అందుకోబోతున్నాడు.

 

    దీనివెనుక వున్న బలమైన శక్తి ఏదన్నాగానీ తను డీల్ చేస్తున్న "కేసు ఫైలు" మరొకరికి అందజేయబడుతుంది.

 

    పర్యవసానం ఎలావున్నా కేవలం తన నిజాయితీ మూలంగా ఓ పసికందు ఆపదలో చిక్కుకున్నాడు.

 

    జీవితంలో తొలిసారి ఇలాంటి అనుభవానికి గురి కావడంతో సరాసరి స్టేషన్ కి వెళ్ళలేకపోయాడు.

 

    మనసును కమ్మేస్తున్న ఆలోచనలు మెదడుని దొలిచేసే సంఘర్షణ తన మామూలు శక్తిని హరించేస్తున్నట్లనిపిస్తుంటే తిన్నగా హరిత దగ్గరకు బయలు దేరాడు.

 

    "వాట్ సర్ ప్రయిజ్ ఇటీజ్" అటూ హుషారుగా రిసీవ్ చేసుకుంది.

 

    "ఆ నడకేంటి?" నిస్త్రాణగా నడుస్తున్న యశస్విని అలా చూడడం తొలిసారి "నడుస్తున్నట్టు లేదు, ప్రాకుతున్నట్టుంది."

 

    "అయామ్ నాటె స్నేక్" నోఫాలో కూర్చున్నాడు బడలికగా.

 

    "అసలు పాముకీ, మగాడికీ తేడా ఏమిటో తెలుసా" అడిగింది అల్లరిగా.

 

    "ఏంటది."

 

    "A snake crawls on its belly while a man crawls on any belly he finds vacount"

 

    యశస్విలో చలనంలేదు.

 

    "ఏమైంది నీకు? ఆరోజు సెక్షన్ 375 విషయంలో రెచ్చిపోయి చివరికి ఎదీకాక ఆనక నిద్రపట్టడం మానేసిందా? చూడు యశస్వీ! ఆడపిల్ల "లిబరల్" గా ఉన్నట్టు అనిపించగానే మగాడు 'ప్రోగ్రెసివ్'గా దూసుకుపోవాలి. అప్పుడుకాని అది ఐడియల్ లౌ అనిపించుకోదు. అసలు టెన్ సింగ్ ఎవరెస్టుకూడా జండా పాతేశాడా అంటే ఎంత శ్రమపడ్డాడని! ఆఫ్ కోర్స్ ఎవరెస్టుకూడా చాలా సహకరించిందనుకో."

 

    "హరితా! ఏ జోక్ నీ ఎంజాయ్ చేసే స్థితిలోలేను. చాలా స్వల్పకాలంలో నీకు దూరం కాబోతున్నాను."

 

    "వ్వాట్?" విడ్డూరంగా చూసింది. "ఏం జరిగింది?" ఒక్కసారిగా సీరియసైపోయి అతడితల తనవైపు తిప్పుకున్నది.

 

    అంతేకాదు... క్లుప్తంగా చెప్పేశాడు. ఓ కేసులో తలదూర్చిన తను లోతుగా వెళుతూంటే ట్రాన్స్ ఫర్ చేయబడుతున్నట్టు.

 

    "ఋతర్షివే" ఆవేశంగా లేచింది. ఫ్యాక్టరీకి ఫోన్ చేసి అర్జంటుగా రమ్మని పాండురంగారావుగారిని పిలిచింది.

 

    సామాన్యంగా ఫ్యాక్టరీకి ఏనాడూ ఫోన్ చేయని కూతురు ఎందుకింత హడావుడి చేస్తుందీ అర్థం కాని పాండురంగారావుగారు పదినిముషాలలో ఇంటికొచ్చేశాడు.

 

    యశస్వి నిశ్శబ్దంగానే వున్నాడు.

 

    హరిత అంతా చెప్పింది. డాడీ ! మనిషికి ఆపదొస్తే రక్షించాల్సిన పోలీస్ డిపార్టుమెంటులోని ఓ నిజాయితీగల పోలీసాఫీసర్ ఇలాంటి స్థితికి చేరుకున్నందుకు నేను ఆశ్చర్యపోవడంలేదు ఈ దేశం ఏంకావాలీ అని ప్రశ్నించడమూ లేదు. క్రూరమృగాలను వేటాడి ఈ జనారణ్యాన్ని కాపాడాలనుకునే ఒక్కమనిషికి న్యాయం జరిగినా చాలు. అది మా వ్యవస్థ చేసుకున్న అదృష్టంగా భావించిన నేను మిమ్మల్ని అర్థిస్తున్నదొక్కటే. ఏ పలుకుబడితో యశస్విని ఇక్కడనుంచి లేపేయాలని చూస్తున్నారో అలాంటి ఇన్ ఫ్లూయెన్స్ మీరుపయోగించాలి. ఒక చిన్నచేపను మింగాలనుకున్న పెద్దచేప మరో పెద్ద చేపను మింగడమే ఆటవిక న్యాయమైతే దాన్ని మీరు ఆసరాగా తీసుకుని ట్రాన్స్ ఫర్ ఆపాలి అంతే...!"

 

    ఎప్పుడూ ఆకతాయిగా మాట్లాడే హరితలోని ఆవేశం, యశస్విని దూరం చేసుకోలేని ఉక్రోషాన్ని గమనించిన పాండురంగారావు వ్యక్తిగతంగా తానూ పలుకుబడిగల వ్యక్తి కాబట్టి వెంటనే వైజాగ్ ఫోన్ చేశాడు.