నల్లటి వలయాలు ఇలా పోతాయి

 

ఆడవాళ్లు ముఖం విషయంలో ఎంత శ్రద్ద తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అందాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక చిట్కా పాటిస్తూనే ఉంటారు. కానీ కొన్ని సమస్యలు మాత్రం ఎక్కువగా బాధిస్తుంటాయి. అందులో ఒకటి కళ్ల కింద బ్లాక్ మార్క్స్ (నల్లటి వలయాలు). ఈ నల్లటి వలయాలు రాకముందు వరకూ బాగానే ఉంటుంది. కానీ.. ఒక్కసారి వచ్చాయా.. ఇంక అంతే వాటిని పోగొట్టుకోవాలంటే కొంచం కష్టంతో కూడుకున్న పనే. పని ఒత్తిడి కావచ్చు, నిద్రలేమీ ఇంకా ఇతరత్ర కారణాలు కావచ్చు ఈ నల్లటి వలయాలు వస్తుంటాయి. మరి వాటిని ముందునుండే తగ్గించే ప్రయత్నం చేస్తే అదుపు చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఓ సారి చూద్దాం... 

 

* కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకొని వాటిని రసం చేసుకోవాలి. ఇప్పుడు ఆ రసంలో నాలుగు చుక్కల నిమ్మరసం పిండి అందులో దూదిని ముంచి కళ్ల కింద పెట్టుకోవాలి. అలా ఓ పావుగంట సేపు ఉంచి ఆతరువాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 

* బంగాళదుంప ముక్కలు.. రసం కూడా మంచి ఫలితాల్ని ఇస్తాయి. బంగాళదుంప ముక్కల్ని కళ్లపై పెట్టుకొని కొంచెం సేపు అలా కళ్లపై ఉంచుకోవాలి. ఒకవేళ రసం అయితే నల్లటి వలయాలపై రాసి కొద్ది సేపటి తరువాత కడగాలి. ఇలా రోజూ చేస్తే మంచిది. 
 

* ఇంకా అనాస రసంలో కొన్ని చుక్కల గులాబీ నీళ్లు కలిపి.. అందులో మెత్తని వస్త్రాన్ని ముంచి కళ్లపై ఉంచుకోవాలి. పావుగంట తరవాత ఏదైనా నూనెతో మర్దన చేసుకుని కడిగేస్తే సరి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 

* రెండు చెంచాల పెరుగులో కొన్ని చుక్కల ఆముదం చేర్చి కళ్ల అడుగున పూతలా వేసుకోవాలి. కాసేపయ్యాక మర్దన చేసుకుని పదినిమిషాల తరవాత చల్లటి నీళ్లతో ముఖం శుభ్రం చేసుకుంటే నల్లని వలయాలు తగ్గుతాయి. 
 

* రోజ్ వాటర్ (గులాబీ నీళ్లు) కూడా చాలా మంచిది. రోజ్ వాటర్ ను తీసుకొని అందులో కాటన్ ప్యాడ్స్ ముండి వాటిని కళ్లపై పెట్టుకుంటే కళ్లు ఫ్రెష్ గా ఉంటాయి. అంతేకాదు నల్లటి వలయాలు కూడా తగ్గుతాయి. ఇంకా పచ్చిపాలలో కొన్ని చుక్కల గులాబీ నీళ్లని కలిపి అందులో దూదిని ముంచి కళ్ల కింద తుడుచుకోవాలి. పావుగంట తరవాత కడిగేసుకుంటే చాలు.