పురోహితుడు షాక్ తిన్నాడు ఒక్కసారి.

 

    "నోట్ దిస్ పాయింట్ యువరానర్..." న్యాయమూర్తిని ఉద్దేశించి అని, పురోహితుడి వేపు తిరిగి-

 

    "మీకు పెళ్లి జరిపించటం వచ్చా?" అనడిగాడు.

 

    "ఓ... భేషుగ్గా వచ్చు. లేకపోతే మోహనాకి, కాశీబాంబుకి పెళ్లి ఎలా జరిపిస్తాను...?"

 

    "రాకపోయినా జరిపించవచ్చు..."

 

    "అసంభవం..."

 

    "ఏం... ఎందుకని?"

 

    "మంత్రాలవీ రావాలిగా?"

 

    "మీకొచ్చా...?" రెచ్చగొడుతున్నట్లుగా అన్నాడు గురుమూర్తి.

 

    "మీరు నన్ను అవమానిస్తున్నారు" పురోహితుడు కోపగించుకున్నాడు.

 

    "లేదు. అనుమానిస్తున్నాను..." అని గురుమూర్తి నవ్వాడు.

 

    "అబ్జెక్షన్ యువరానర్... డిఫెన్స్ లాయర్ గారు కేసుని ఎటో తీసుకెళ్తున్నారు. పురోహితుల్ని అడగవలసింది పెళ్లి చేశారా లేదా అనే, మంత్రాలొచ్చా అని కాదు" శ్రీనివాసరావు లాయర్ కి అడ్డు తగిలాడు.

 

    "నో... యువరానర్... పెళ్లి జరిగిందే అని అనుకున్నా, అది హడావుడిగా బలవంతంగా చేసిందా, అందరికి నచ్చి సంతోషంగా, తాపీగా చేసిందా అన్నది తేలాలి. అందరికీ నచ్చి, ఇష్టమైతే సావధానంగా పెళ్లిని జరిపిస్తారు. అప్పుడు మంచి పురోహితుడ్ని ఎన్నుకుంటారు. హడావిడిగా, బలవంతంగా చేసేదయితే, ఎవరు దొరికితే వారితో జరిపిస్తారు. వారికి శాస్త్ర ప్రకారం పెళ్లి జరిపించటం చేతకాకపోయినా ఈ కేసులో ఈ వివరాలు చాలా ముఖ్యం యువరానర్..." ఆవేశంగా అన్నాడు గురుమూర్తి.

 

    "అబ్జెక్షన్ ఓవర్ రూల్... యూ కెన్ ప్రొసీడ్" అన్నాడు న్యాయమూర్తి.

 

    "మంత్రాలు చదవండి" అని గురుమూర్తి అనటంతో పురోహితుడు కలవరపడ్డాడు.

 

    "మాంగల్యం తంతునా... మమజీవన హేతునాం..." పురోహితుడు చదువుతుండగానే గురుమూర్తి అడ్డుపడిపోయాడు.

 

    "గణపతి పూజ జరిపించకుండానే హిందూ వివాహం జరపటం అన్నది శాస్త్ర విరుద్ధం. పెళ్లితంతు మధ్యలో వచ్చే మంత్రాలతో ఈ పురోహితులు ప్రారంభించాడు. దీన్ని బట్టి ఈ పురోహితుడికి పెళ్లిని శాస్త్ర బద్ధముగా జరిపించటం రాదన్నది రుజువైంది యువరానర్..." అని పురోహితుడి వేపు తిరిగి-

 

    "యూ కెన్ గో..." అన్నాడు గురుమూర్తి.

 

    శ్రీనివాసరావులో టెన్షన్ పెరిగిపోయింది.

 

    భుజంగరావు, భువనేశ్వరీదేవి మొహాల్లో ఒకింత కాంతి, ప్రశాంతత చోటు చేసుకున్నాయి.

 

    కేసు మరుసటి రోజుకి వాయిదా పడింది.


                                                          *    *    *    *


    "పురోహితుడు దొరికిపోయాడు. గురువారం నాడు షిర్డిసాయి గుడిలో సాయంత్రం ఆరున్నరకి జరిగిన పెళ్ళికి, షుమారు పదిమంది దాకా రావటం హాస్యాస్పదం. పైగా మంత్రాలు రాని పురోహితుడు పెళ్లి చేయటం, మరీ హాస్యాస్పదం. అలాంటి సాక్షి మీకెక్కడ దొరికాడండి బాబు..." తల పట్టుకున్నాడు లాయర్.

 

    "అలాంటి లూప్ హోల్స్ వెతికి పట్టుకొని, కోర్ట్ లో దొర్లకుండా సాక్ష్యుల్ని తయారుచేయటం మీ బాధ్యత కాదా? వేలకు వేలు ఫీజుకింద తీసుకోవటం మాత్రం తెలుసు" శ్రీనివాసరావు ఫైరయిపోయాడు.

 

    "ఇదంతా చూస్తుంటే నాకు ఉరిశిక్ష పడేలా వుంది. కేసు ఓడిపోయేలా వుంది. పుత్రశోకంతో మీ ఇద్దరూ పోతారు. మీరెలా పోతారులే, మీరు పెద్ద జంతర్ మంతర్..." కాశీబాంబు వణికిపోతూ తండ్రికేసి చూస్తూ అన్నాడు.

 

    "వీడెవడండీ బాబు... నోరు విప్పితే అన్నీ అశుభాలే. రేపు కోర్టులో ఏం చెబుతాడో ఏమో... జడ్జీగారు మహా ఫాస్ట్. పెద్ద మనస్తత్వ శాస్త్రవేత్త కూడా. ఆవలించకుండానే పేగులు లెఖ్ఖిస్తారు..." లాయర్ చిరాకు పడిపోతూ అన్నాడు.

 

    "ఒరేయ్ నువ్వు కాసేపు నోర్మూసుకో. లేదంటే తాట వలిచేస్తాను" గుడ్లురిమాడు శ్రీనివాసరావు.


                                *    *    *    *


    "అంత మాత్రం చేత మనం గెలిచినట్లు కాదు. ఫోటో కరెక్ట్ గా వుంటే చాలు. అదే తిరుగులేని సాక్ష్యమవుతుంది. మంత్రాలు రాకపోయినా గుడి పూజారని చేయించుకున్నాం పెళ్లి అని శ్రీనివాసంటే చేయగలిగిందేమీ లేదు..." గురుమూర్తి తన ఆలోచనలకి పదును పెట్టుకుంటూ అన్నాడు.

 

    "మరెలాగయ్యా..." భుజంగరావు ఆందోళన పడిపోయాడు.

 

    "సమయస్ఫూర్తితోటే ఇలాంటి కేసుల్ని గెలవగలం. అదేలాగన్నదే ఆలోచిస్తున్నాను" అన్నాడు గురుమూర్తి.

 

    వారిద్దరి మధ్య నడిచే సంభాషణని శ్రద్ధగా ఆలకిస్తోంది భువనేశ్వరి.

 

    "రేపు పాప కోర్ట్ కి రావాలి. ఇకిప్పుడు బయటకొచ్చినా వాళ్ళు చేయగలిగిందేమీ లేదు. సుబ్రమణ్యం ఇంటికి కబురు పెట్టి, మీ అమ్మాయి రేపు కోర్టుకొచ్చేలా చేయండి" అన్నాడు తనేదో నోట్ చేసుకుంటూ.

 

    ఆ రాత్రంతా భువనేశ్వరీదేవి టీ పెట్టిస్తూ, గురుమూర్తి నిద్రపోకుండా కేసు స్టడీ చేసేలా కాపలా కాస్తూ వుండిపోయింది.


                                                        *    *    *    *


    మరుసటి రోజు సరిగ్గా పదిగంటలకు కేసు తిరిగి హియరింగ్ కి వచ్చింది.

 

    గురుమూర్తి-కాశీబాంబుని, శ్రీనివాసరావుని, లక్ష్మిని ఎన్నో తికమకలకు గురిచేస్తూ ప్రశ్నించాడు.

 

    వాళ్ళు బాగా ప్రిపేర్ అయి వుండటంతో ఒక్క తప్పు మాట్లాడలేదు.

 

    ఎగ్జిబిట్ నెంబర్ ఒన్ - కాశీబాంబు, తరణి కలిసి తీయించుకున్న ఫోటో జడ్జీ ముందుంచారు.

 

    ఎగ్జిబిట్ నెంబర్ టూ - పంచాయితీ ప్రెసిడెంట్ లెటర్. దాన్ని కూడా జడ్జీ ముందుంచారు.

 

    ఎగ్జిబిట్ నెంబర్ త్రీ - మండల రెవిన్యూ ఆఫీసర్ ధృవీకరణ పత్రం. దాన్నీ జడ్జీ ముందుంచారు.