మనకే కాదు... పిల్లలకీ ఇబ్బందులుంటాయ్! 

 

 

* ఎంతసేపు తింటావ్, తిండి సరిగ్గా తినకపోతే బలమెలా వస్తుంది అంటూ తిట్టే తల్లులు కొందరు. మా పిల్లాడు అస్సలు తినడండీ అంటూ కంప్లయింట్ చేసే తల్లులు ఇంకొందరు. తింటావా తన్నమంటావా అంటూ బెత్తం పట్టుకునేవాళ్లు ఇంకొందరు. అయితే వీటన్నిటికంటే ముందు చేయాల్సింది ఇంకొకటుంది. మీ బిడ్డ తినకపోవడానికి వెనుక కారణాన్ని వెతకడం. అవును. పిల్లలు తిండి తినకపోవడానికి ఆటల్లో పడిపోవడం ఒక్కటే కాదు... ఏదైనా పెద్ద కారణం ఉండొచ్చు. వాళ్లకేదైనా సమస్య ఉండివుండొచ్చు. కాబట్టి ఆ కోణంలో కూడా ఓసారి ఆలోచించండి.
    
* పిల్లలు తిండి తినకపోవడానికి ఆరోగ్య సమస్యలు చాలాసార్లు కారణమవుతాయి. కాబట్టివాళ్లకి అన్నవాహికలో ఏదైనా సమస్య ఉందా, హార్మోన్ల లోపాలేమైనా ఉన్నాయి, ఆకలి సంబంధింత సమస్యలేమైనా ఉన్నాయా, మలబద్దకం ఉందా, అసిడిటీ ఏమైనా మొదలయ్యిందా, థైరాయిడ్ హార్మోన్లలో హెచ్చుతగ్గులేమైనా ఉన్నాయా, కాలేయ సమస్యలు కానీ కిడ్నీ సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లలకి ఈ సమస్యలా అనుకోకండి. మనకే కాదు... పిల్లలకీ చాలా ఇబ్బందులుంటాయి. అవి వాళ్లు చెప్పలేరు. మనకి అర్థం కాదు. అందుకే పిల్లలు తిండి తినకుండా మారాం చేస్తుంటే చిన్నతనం అని వదిలేయకుండా ఓసారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి. 
    
* ఇక శారరీక సమస్యలతో పాటు మానసిక సమస్యలూ ఉంటాయ్. మన మనసు బాగోకపోతే మనం తిండి తింటామా? అలాగే పిల్లలకూ ఉంటుంది. మనసులో ఏదైనా బెంగ, దిగులు, భయం ఉంటే వాళ్లకి కూడా తిండి సహించదు. కాబట్టి పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. వాళ్లతో మాట్లాడాలి. ఏమైంది అంటూ లాలించి వాళ్ల మనసులో మాటను తెలుసుకోవాలి. ఆ బెంగను, భయాన్ని దూరం చేయాలి. అప్పుడు మీరు బలవంతంగా తినిపించాల్సిన అవసరం ఉండదు. వాళ్లంతట వాళ్లే తినేస్తారు.
    
* ఈ కోణంలో ఆలోచించేవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. ఎందుకంటే చిన్నపిల్లలే కదా అని ఎక్కువ దూరం ఆలోచించకపోవడం వల్ల. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. ఆటల్లో పడినా పిల్లలకు ఆకలి వేస్తుంది. కాస్త లేటయినా వచ్చి తినేస్తారు. కానీ ఎంతకీ తినడం లేదంటే వాళ్లకి సమస్య ఉన్నట్టే. దాన్ని కనిపెట్టాల్సిన బాధ్యత మీదే.

-Sameera