ఆనందపురంలో ఆమె వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఆమె తండ్రి గోవిందాచార్యులు 'అమ్మా' అమ్మా!' అని అరుస్తూ ఆ గ్రామంలో పిచ్చివాడిలా తిరుగుతున్నాడు.

 

    అప్రయత్నంగా అతని కనుకొలకులలో నీళ్ళు నిలిచాయి. అది చూసి సక్సేనా  "ఏడుస్తున్నావా?" అని అడిగాడు.

 

    "లేదు. నా జీవితాన్ని ధారపోయటానికి నేను సిద్ధపడిన వస్తువు, యింత సునాయాసంగా లభ్యమైనప్పుడు దుఃఖించటం దేనికి? ఇవి ఆనందభాష్పాలు" అన్నాడు. కాని అతని గొంతులోని అసహజత్వం పసిగట్టి చలించాడు సక్సేనా. అతని హృదయం ద్రవించింది.

 

    "ఆమె కల్యాణమూర్తి కోసం లేచి వచ్చింది నైతిక విలువలకు తిలోదకాలిచ్చి. ఆమె అంటే అసహ్యం వేయటం లేదా?" అనడిగాడు స్నేహితుడి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ.

 

    "లేదు"

 

    "ఆమె యందు నీకున్న విలువ తరిగిపోలేదా?"

 

    "కొంచంకూడా తరిగి పోలేదు"

 

    "ఎలాంటి భావాలు ఉత్పన్నమవుతున్నాయి ఆమెపట్ల యిప్పుడు నీకు?"

 

    శాయి నేత్రాలు ఉజ్వలకాంతితో ప్రకాశించాయి. "ఆమెను నేను ప్రేమిస్తున్నాను, మోహిస్తున్నాను, కామిస్తున్నాను. ఇప్పటికికూడా" అన్నాడు సుస్థితకంఠంతో. సక్సేనా స్నేహితుడి చెయ్యిపట్టుకుని ప్రేమగా నొక్కాడు, "మిత్రమా! దురదృష్ట సంఘటనలతో నీ జీవితపు పుటలన్నీ నిండిపోయినయ్. చరిత్ర కలుషితమై దుర్గంధమే నీ ప్రాణవాయువుగా మారింది" అన్నాడు. గాద్గదిక కంఠంతో.

 

    "సక్సేనా! నా యందు నీకుగల సహజానురాగానికీ, సానుభూతికి ధన్యుడ్ని అయాను. నీలాంటి పరమమిత్రుడ్ని జన్మజన్మలకూ పొందలేను."

 

    ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని విచిత్రమైన పారవశ్యమనుభవిస్తూ కొలది నిమిషాలు మౌనంగా వూరుకున్నారు.

 

    క్షణాలు గతించినకొద్దీ శాయి మనసునిండా మళ్లీ వేదిత ఆక్రమించటం మొదలుపెట్టింది. ఈ విపరీత పరిణామాల తుదిరూపం కోసం ఆలోచనలు ఆరాటపడటం మొదలుపెట్టాయి. క్షణంక్రితం అతని ముఖంలో ప్రస్ఫుటమైన ప్రసన్నత మాయమై, రానురానూ గంభీరంగా మారిపోసాగింది.

 

    అది చూసి సక్సేనా "భాయీ! ఏమిటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు?" అని అడిగాడు ఉత్కంఠతను వ్యక్తపరుస్తూ.

 

    జవాబు చెప్పటానికి శాయి కాస్త వ్యవధి తీసుకున్నాడు. తర్వాత నిట్టూర్పు విడిచి "మిత్రమా! మనస్సులేని దేహంతో ఆడుకోవటానికైనా నా కభ్యంతరం లేదు. ఇదివరకే అధోగతిపాలయినవాడిని, మరింత దిగజారటానికి వెను దియ్యను, ఇన్ని ఉపకారాలు చేసిపెట్టావు. మరొకటి కొరత వుండిపోయింది" అన్నాడు.

 

    "ఏమిటి శాయీ!"

 

    "కల్యాణమూర్తి బహుశా యీ ఆవేదనతోనే అనుకుంటాను తిరిగి యీ దేశానికి రానని చెప్పాడు ఆనాడు నాతో. అతను తిరిగిరాడు. నా త్రోవకు అడ్డు తగలడు. ఆ భయం నాకు లేదు. కాని అతనిమీద ఆశ, తిరిగి వస్తాడనే భ్రాంతి ఆమెలో అణుమాత్రమైనా వుండటం నాకు ఇష్టం లేదు. అతను ఆమె స్మృతిలో శాశ్వతంగా చచ్చిపోవాలి. అర్థమయిందా?"

 

    "శాయి"

 

    "సక్సేనా! నేను కొన్నాళ్ళపాటు బయటేదయినా హోటల్లో కాలం గడుపుతాను. నా సూట్ కేసు అక్కడ వుండిపోయింది. నువ్వు తెచ్చిపెడుదువు గాని, నువ్వు చెయ్యవలసిన పనేమిటో తెలుసా? విమాన ప్రమాదంలో కల్యాణమూర్తి చనిపోయాడని వేదితకు చెప్పాలి."

 

    "శాయి!"

 

    "సక్సేనా! నన్నెంత అసహ్యించుకున్నా సరే! ఈ సహాయం నువ్వు చేసి తీరాలి."

 

    "ప్రభూ!" అనుకుంటూ సక్సేనా కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అతన్లో ఎన్నో ఆలోచనలు చెలరేగుతున్నాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. అగ్నిపర్వతాలు బ్రద్ధలవుతున్నాయి.

 

    శాయి అతని ముఖంకేసి చూస్తున్నాడు.

 

    కాసేపటికి ఏదో నిశ్చయించుకుని సక్సేనా కళ్ళు తెరిచాడు. అతని ముఖమిప్పుడెంతో ప్రశాంతంగా ఉంది. "సరే మిత్రమా! నీ అభిమతం ప్రకారమే కానియ్యి. ఎన్నో పాపాలు చేశాను. అందులో యిదీ ఒకటి అవుతుంది."   

 

    శాయి లేచి నిల్చున్నాడు. అతని కనులు ఆనందంతో మెరిశాయి. బల్లచుట్టూ తిరిగివెళ్లి స్నేహితుడ్ని సమీపించి గట్టిగా కౌగిలించుకున్నాడు. "సక్సేనా" సక్సేనా! నీ ఋణం ఎలా దీర్చుకోను" అంటున్నాడు. అతనికళ్ళ వెంబడి సంతతధారగా అశ్రువులు ప్రవహిస్తున్నాయి.

 

                                            * * *

 

    ఆ రోజు రాత్రి!

 

    "మీరు నాకు కనిపించిన రోజు మధ్యాహ్నం.... ఆనాడేకదూ మీ కళ్యాణమూర్తి ప్లేన్ లో స్టేట్స్ కి ప్రయాణమయ్యాడు?" అంటున్నాడు సక్సేనా వేదితతో.

 

    "చిన్నమ్మీ! ఏమిటి అంటున్నాడాయన!" అనడిగింది ఆమె. త్రిమూర్తులు చెప్పింది.

 

    "అవును" అంది జవాబుగా.

 

    మీ స్వవిషయాలు నాకెలా తెలుసునని విస్తుపోకండి. త్రిమూర్తుల నడిగి తెలుసుకున్నాను.

 

    ఆమె మనసేదో కీడు శంకిస్తోంది. కాని నిబ్బరంగా నిల్చుంది.