ఓ నిముషంపాటు రాగిణి స్తబ్దుగా ఊరుకుంది. ఏదో అన్యమైన చింత, ఉత్కంఠ ఆమెను పులకితురాలిని చేశాయి. ఆమె అన్నది కుతూహలంతో "మీ చిన్నక్కను గురించి చెప్పటమే కాని ఎప్పుడూ చూపించలేదు?"

    "తప్పకుండా చూపిస్తాను రాగిణీ! ఆ సమయం ఇంకా ఆసన్నం కాలేదు. ఒకానొకనాడు ఆమే, నేనూ మీ ఇంటిముందు బండి దిగుతాము చూడు."

    రాగిణి ఆతురతతోనూ, దిగులుతోనూ అతన్ని వారిస్తూ "వద్దు, వద్దు ఆ పని చేయకండి. ఆవిడ ముఖం చూడటానికి అనర్హురాలనై, సిగ్గుతో చచ్చిన చావవుతుంది. మీరుచేసే పనులన్నీ అలానే వుంటాయి. నామీద ఒట్టే సుమా!" అంది.

    "ఇప్పుడు కాదులే" అని రవి నవ్వి ఊరుకున్నాడు.

    రాగిణి చాలాసేపు తలవంచుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. తరువాత ఏదో గుర్తుకువచ్చి తల ఎత్తి "ఇంతకీ పంచదార చాలిందా, లేదా?"

    "చాలినట్లు లేదు, కానీ త్రాగటం పూర్తయిపోయింది."

    "మరి నాకెందుకు చెప్పలేదు?"

    "అధిక తీపి అంటే నాకు భయం. అదీగాక నువ్వేదో ఆలోచిస్తూ వుండినావాయె. నీ ఏకాగ్రతను భంగం చేయటం ఇష్టంలేక......"  

    రాగిణి గోడకు జారగిలబడి, కళ్లుమూసుకుని, సత్తువ లేనట్లు ఊరుకుంది. "రాగిణీ! లేలే, ఇంకా నిప్పుకూడా ఆర్పలేదు" అన్నాడు రవి. ఆమె తన తెలివి లేమికి చింతిస్తూ గబగబ లేచి నిలబడి, ఇన్ని నీళ్ళుతెచ్చి కుంపటిమీద గుమ్మరించింది. తరువాత ముందరగదిలోకి నడిచి చక్కగా ప్రక్కవేసి, అమర్చింది. "రండి దొరగారూ! ఇలా వచ్చి పడుకోండి" అంది మృదుస్వరంతో.  

    రవి నెమ్మదిగా లేచివచ్చి, మంచంమీద వాలి భారంగా కళ్ళుమూశాడు. "మరి నువ్వెక్కడ పడుకుంటావు?"అని అడిగాడు మంద్రస్వరంతో.

    "ఎక్కడో అక్కడ మీకెందుకు? మీరు పడుకోండి."

    "నాకు ఉక్కబోస్తుంది రాగిణీ!"

    "విసనకర్ర ఇవ్వమంటారా?"

    "నాకు విసురుకునే ఓపిక ఎక్కడిది?" అన్నాడు అమాయకంగా ముఖంపెట్టి.

    రాగిణి ఓ క్షణంపాటు సంకోచించింది. ఓ లిప్తపాటు మలినపూరితమైన చిరునవ్వు ఆమె పెదాలపై మెరిసి మాయమైంది. "సరే, నేనే విసురుతాను. మీరుమాత్రం కొంచెమైనా కళ్ళు తెరవకూడదు. తెరిచారంటే నేను పోయి బావిలో దూకుతాను" అంది.

    అతను అర్ధమైనట్లు తల ఊపాడు.

    "నిద్రపోయారా?" అనడిగింది రాగిణి - ఓ అరగంట గడిచాక.

    "లేదు రాగిణీ! ఎంత ప్రయత్నించినా రావటంలేదు మరి. ఇవేళ నీ ఋణం తీర్చుకోలేను. పాపం అర్ధరాత్రివేళ వచ్చి నిన్ను చాలా ఇబ్బందిపెట్టాను కదూ?" అన్నాడు జాలిగా కళ్ళు మూసుకునే.

    ఆ క్షణంలో ఆమె వదనంలో మెదిలిన బాధను వెయ్యికళ్ళు పెట్టుకుని చూసినా మానవాతీతులు కూడా గుర్తించలేరు. ఇహ రవి అనగా ఎంత? ఒక తృటిలో మెదిలే బాధారహిత హృదయమూ, ఆవేదనా దగ్ధమైన మనస్సూ, కన్నార్పకుండా కలుసుకోవటం మానవకోటిలో ఎప్పుడో, ఎవరితోనోగానీ సాధ్యంకాదు. వాళ్ళు దురదృష్టవంతులు.

    రవి ఆమె మృదుహస్తాన్ని మెల్లగా తన చేతుల్లో బిగించి, అలా హృదయానికి అదుముకున్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. విడిపించుకోవాలని ప్రయత్నం కూడా చేయకుండా, కనురెప్పలు కొద్దిగా ముడిచి అతని ముఖంలోకి భావ గర్భితంగా చూస్తూ మిన్నకుంది.

    "రాగిణీ! నిన్ను విడిచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా నాకు కన్నీళ్ళు రావటం లేదు విచిత్రం! కనీసం విచారమైనా కలుగుతున్న సూచనలు లేవు. నిజం చెప్పాను. నన్ను ద్వేషిస్తావా?" అని ప్రశ్నించాడు.

    ఆమె వెనువెంటనే పెదవి కదపబోయింది గానీ ఏవో కనబడని సంకెళ్ళు వాటిని బిగించివేసినట్లుగా తీవ్ర అసంతృప్తి పొంది, అతని శిలా హృదయం మీద తన నవనీత హస్తాన్ని అలానే ఉంచింది.

    "పోనీలే, జవాబు చెప్పవద్దు రాగిణీ! కానీ ఈ సమయంలో నీ ముఖంలోకి తనివితీరా చూడాలనిపిస్తోంది" అన్నాడతను విరామయంగా.

    "మాట తప్పడం మొగమహారాజులకు అలవాటు గనుక!"    

    అతని నోరు మూతపడి, కోరికను కప్పింది. ఇంక ఏమీ వాగకూడదని దృఢనిశ్చయం చేసుకుని, జననేంద్రియాలను అరికట్టడానికి తీవ్ర ప్రయత్నాలు సాగించాడు. తుదకు అలసట కలిగింది. అతని కామితార్ధాన్ని నెరవేర్చింది.

    చీకటి ఇంకా వీడకముందే అతను ప్రక్కమీద లేచి కూర్చునేసరికి బెడ్ లైట్ అంతిమరకం కాంతిని ప్రసరిస్తోంది. ఆ గదిలో ఎక్కడా రాగిణి కనిపించలేదు.

    ఒకవేళ ఇల్లు విడిచి వెళ్ళిపోయిందేమో? తననుంచి ఆమె చేతిని తీసుకున్నప్పుడు తనకు మెలకువ రాలేదు. అసలు తను ఎందుకంత ఆప్యాయంగా ఆ హస్తాన్ని తనదగ్గర అట్టిపెట్టుకున్నాడో అర్ధంకాలేదు. తన చర్య తనకే సిగ్గు గొలిపింది. ఆమెగనుక ఇల్లు విడిచి వెళ్ళిపోతే బావిలో పడాల్సింది తను. నిలబడి బెడ్ లైట్ వెలుగు ఎక్కువచేశాడు. కళ్ళే శక్తిని పుంజుకున్నట్లుగా వుంది. అడుగులు మత్తులో తూలుతున్నాయి. వచ్చినది పీడకలే అయినా, లోపలిగదిలోకి అడుగుపెట్టి నిర్విణ్ణుడై ఆగిపోయాడు. మ్లానమైంది ముఖం. రాగిణి చాపమీద తలగడ అయినా లేకుండా నిద్రపోతోంది. ఒకవేళ నిద్ర పోలేదేమో? తను లేవటంచూసి అలా పడుకుందేమో తనకు కోపం వస్తుందని. మోకాళ్ళమీద కూర్చుని, వంగి దగ్గరగా చూశాడు. అది అమృతవదనం అనుకున్నాడు. మరికొంచెం ముందుకు వంగాడు. నిద్రలో మెలికలు తిరిగిన పెదవులు వికసించిన పుష్పంరెక్కలా విచ్చుకున్నాయి. లోపల పదిలంగా దాచిపెట్టుకున్న చిరునవ్వును, అందులో భద్రంగా దాచిపెట్టుకున్న రహస్యాన్ని అమాయకంగా, కానీ అందంగా వ్యక్తపరుస్తున్నాయి.

    "నేను పసిగట్టానులే ఎప్పుడో!" పురుషహృదయం. తాను నిద్ర పోయినప్పుడు తన హృదయం ఇలా గెంతులువేసింది కాబోలు. అలానే రాగిణి అబల హృదయం సహజత్వాన్ని మరుగుపరచుకుని అలమటించి వుంటుంది. మరికొంచెం ముందుకు వంగాక ధైర్యంచాలక వెనక్కి తుళ్ళిపడ్డాడు. అవును తను శ్వేదబిందువులు తుడిస్తే ఆమె మేలుకోవచ్చు. ఒక దీర్ఘనిశ్వాసం విడిచాక లేచి నిలబడ్డాడు. మరి ఆమెవంక చూడలేక గబగబ గదిలోకి వచ్చాడు. డ్రాయరు వెదికి కాయితం, కలం తీశాక ఇలా రాశాడు.

    "ఏమీ చెప్పరాదనుకున్నాను. ఏమేమో చెప్పాలనుకున్నాను. ఏమీ చెప్పలేకపోయాను"