అందులోంచి దిగిన సిద్ధార్ధ కళ్ళు నలువేపులా వెతుకుతున్నాయి. పక్కనే నుంచున్న అనంతమూర్తి వేపు చూశాడతను.

 

    "నా కోసం ఎవరైనా వచ్చారా?"

 

    "లేదు సర్... ఎవరూ రాలేదు" జవాబు చెప్పాడు అనంతమూర్తి.

 

    చేతి వాచీ చూసుకున్నాడు సిద్ధార్ధ.

 

    అదే సమయంలో మెయిన్ గేటు ముందు ఆగిందో వ్యాను. ఆ వ్యానుని, ఆ వ్యానులోంచి దిగుతున్న నిశాంతను చూడగానే అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి.

 

    "మీకు ఆసిస్ట్ చేయడానికి మిస్టర్ ముఖర్జీని పంపుతున్నాను" చెప్పాడు అనంతమూర్తి.

 

    "నో మిస్టర్ మూర్తీ! ఐ డోంట్ వాంట్ ఎనీ అసిస్టెన్స్. నాతో పాటు నా ఫ్రెండొకరు వస్తున్నారు" వడివడిగా తనవేపే వస్తున్న నిశాంతను చూపిస్తూ అన్నాడతను.

 

    అనంతమూర్తి నిశాంతను స్పష్టంగా చూడటం అదే మొదటిసారి. ఏదో చెప్పబోయి ఆగిపోయాడు.

 

    నిశాంతను చూసి "ఫైవ్ మినిట్స్ లేట్" పలకరింపుగా అన్నాడు సిద్ధార్ధ.

 

    "ముస్సోరీలో వాచెస్ నెమ్మదిగా నడుస్తాయ్... ఎందుకో తెలుసా? మంచు వలన" జోగ్గా అంది నిశాంత.

 

    అంతలో ఎయిర్ క్రాఫ్ట్ కెప్టెన్ నీలధర్ విష్ చేసి తనను తాను పరిచయం చేసుకున్నాడు.


    
    "ఏమిటి? ఎయిర్ క్రాప్టు కొత్తగా కనిపిస్తోందా" దూరంగా... హంసలా మెరిసిపోతున్న విమానంవేపు చూస్తూ అడిగాడు సిద్ధార్ధ.

 

    "మీకోసం స్పెషల్ గా బెంగుళూరునుంచి తెప్పించాం సర్" చెపుతున్నాడు కెప్టెన్ నీలధర్.

 

    "తనేజా ఎయిరో స్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ కంపెనీ... కొత్తగా మార్కెట్లోకి రిలీజ్ చేసిన జనరల్ ఏవియేషన్ ఎయిర్ క్రాప్టు సార్ యిది. దీన్ని పి-68 అంటారు. సెవెన్ సీటర్ పిస్టన్ ఇంజన్ దీని స్పెషాలిటీ" మిగతా టెక్నికల్ డిటెయిల్స్ చెపుతూ ముందుకి నడుస్తున్నాడు కెప్టెన్ నీలధర్.

 

    ఎయిర్ క్రాప్టులోకి అడుగుపెట్టాడు సిద్ధార్ధ. ఆ వెనక నిశాంత...

 

    డోర్ క్లోజ్ చేసి తన సీట్లో కూర్చున్నాడు కెప్టెన్ నీలధర్.

 

    ఇంజన్ స్టార్టయ్యింది.

 

    "ఈ ఎయిర్ క్రాప్టుకి మామూలు విమానాల్లా పాడ్స్ అవసరం లేదు సర్. టేకాఫ్ కి మట్టి నేలయినా, పచ్చిక నేలయినా యిబ్బంది లేదు. అలాగే లాండింగ్ కి కూడా నీలధర్ చెపుతున్నాడు.

 

    విమానం నెమ్మదిగా పైకి లేచింది.

 

    గాల్లో గింగిర్లు కొట్టి ఆకాశంలోకి దూసుకుపోయింది.


                                                  *    *    *    *


    సరిగ్గా అదే సమయంలో...

 

    ముస్సోరీ నుంచి బొంబాయిలోని దేశ్ ముఖ్ కి ఓ ఫోన్ కాల్ వచ్చింది.

 

    "ఇప్పుడే ఎయిర్ క్రాప్టు ముస్సోరీలో బయలుదేరింది సార్! మీరు చెప్పినట్లుగానే అంతా చేశాను."

 

    "ముస్సోరీ నుంచి బొంబాయి చేరడానికి ఎన్ని గంటలు పడుతుంది?" అడిగాడాయన.

 

    "టూ అవర్స్ సార్"

 

    'టూ అవర్స్..." ఆలోచనలో పడ్డాడు కొద్దిసేపు ఆయన.

 

    "జర్నీలో ప్రాబ్లమ్ స్టార్ట్ కావడానికి ఎంత టైమ్ పడుతుంది?" మళ్ళీ అడిగాడాయన.

 

    "సరిగ్గా తొంభయ్ నిమిషాల తర్వాత" చెప్పాడా వ్యక్తి.

 

    "ఆ విషయం కెప్టెన్ కి ఎంతసేపటికి తెలుస్తుంది?"

 

    "మరో ఏడు నిమిషాల తర్వాత."

 

    "గుడ్! ఈపాటికి నీ రెమ్యునరేషన్ చెక్ రూపంలో నీ టేబుల్ మీద వుంటుంది" సంతృప్తిగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడాయన.


                                                *    *    *    *


    అదే సమయంలో రూమ్ లోకి ప్రవేశించాడు పి.ఎ. సుభాష్ చంద్ర. చేతిలో నేషనల్, ఇంటర్నేషనల్ పేపర్స్ తో...

 

    దేశ్ ముఖ్ ముందుంచాడు ఆ పేపర్స్ ని సుభాష్ చంద్ర.

 

    హిందీ నటి పూజాబేడీతో తను స్పెషల్ గా తీయించుకున్న ఫోటోలు, ఇంటర్వ్యూలు... అప్పటికే వేరే హీరోయిన్స్ తో దేశ్ ముఖ్ దిగిన ఫోటోల పేపర్ కటింగ్స్ మహంతకు చేరాయి.

 

    అందుకే మహంత తన కొడుకు విషయంలో అంత జాగ్రత్తగా వున్నది.

 

    "గుడ్! కరెక్ట్ టైమ్ కి వచ్చాయన్న మాట... మహంత ఎడ్రస్ కి కొన్ని పోస్ట్ చెయ్యి" సీరియస్ గా చెప్పాడు దేశ్ ముఖ్.

 

    "గంట క్రితమే ఎయిర్ మెయిల్ ద్వారా పంపే ఏర్పాటు చేశాను సర్."

 

    "వెరీగుడ్! ఫస్ట్ టైమ్ డెలిగేట్స్ మీటింగ్ కి నిశాంతతో వెళ్లాడన్న విషయం తెలుసుకున్న టైమ్ కే యీ పేపర్స్ కూడా వెళతాయి కదూ?" అడిగాడు దేశ్ ముఖ్.

 

    "ఎస్ సర్."

 

    "అప్పుడు మహంత కన్ ఫ్యూజ్ అయిపోతాడు కదూ?"

 

    "ఎస్ సర్."

 

    "టోటల్ కన్ ఫ్యూజన్... ఇంటర్నేషనల్ నెట్ వర్క్ కి కూడా అందని వింత కన్ ఫ్యూజన్."

 

    "మిమ్మల్ని ఏ రకంగా సస్పెక్ట్ చేయడానికి అవకాశం వుండదు సార్. ఎందుకంటే లోకం దృష్టిలో మీరు అవుటాఫ్ మూడ్స్ కదా?" సుభాష్ చంద్ర నవ్వకుండా చెప్పాడు.

 

    "కదూ" గర్వంగా నవ్వాడాయన సంతృప్తిగా, హుందాగా నవ్వాడాయన.


                             *    *    *    *


    సరిగ్గా అదే సమయంలో-

 

    ముస్సోరీ నుంచి బయలుదేరిన పి-68 ఎయిర్ క్రాప్టులో-

 

    "నీకూ, నాకూ రెక్కలుంటే ఎంత బాగుంటుందో కదూ" గబుక్కున బుగ్గ మీదకు వంగుతూ అన్నాడు సిద్ధార్ధ.

 

    "హుష్... పైలెట్" మెల్లగా గొణిగింది నిశాంత.

 

    "ప్రతిదానికీ అడ్డు చెప్పడం ఆడవాళ్ళ ప్రధమ లక్షణం కదూ?" ఆమె చేతిమీద గిచ్చుతూ అన్నాడతను.

 

    "అడ్డు చెప్పడం అంటే వద్దని చెప్పడం కాదు. ఎందుకంటే గోరింటాకు చేతివేళ్ళకే పెట్టుకుంటారు. అలాగే పిల్లల్ని బుగ్గమీదే ముద్దు పెట్టుకుంటారు. ఇష్టపడే అమ్మాయిని ముద్దు పెట్టుకోవాల్సింది బుగ్గమీద కాదు" సిగ్గుపడుతూ అంది.