గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ మహంతకు తనో ట్రాప్ లో ఇరుక్కున్నానన్న విషయం తెలీదు. అప్పటికే ఆ మెసేజ్ ముస్సోరిలోని అనంత మూర్తికి చేరడానికి, న్యూయార్క్ లోని ఒలింపిక్ అపార్ట్ మెంటు నుంచి బయటికెళ్ళిపోయింది.


                                                 *    *    *    *


    ముస్సోరీ...

 

    యంగ్ ప్యాలెస్ లో వంటరిగా కూర్చున్నాడు సిద్ధార్ధ. అతనా సమయంలో ఎర్రచందనపు బొమ్మలా మెరుస్తున్నాడు.

 

    రోజంతా గదిలో గడిపిన అతనికి ఏం తోచడం లేదు. తనకు తెలీకుండా మనసులో జరుగుతున్న మార్పు, పెరుగుతున్న వుద్వేగం...

 

    గార్డెన్ లో రఘువీర్ ను చూసినప్పటి నుంచీ తెలీని భావోద్వేగంతో సతమతమైపోతున్నాడతను. రఘువీర్ అతనికలా కన్పించడానికి ప్రధాన కారణం అతనొక రక్తమాంసాలున్న మనిషిలా కన్పించడమే. తనొక గాజుకుప్పెలో వేసిన మిణుగురు పురుగు. అతని ఆలోచనల్లోకొచ్చిన ఆ భావం అలా అలా పెరుగుతోంది.

 

    బుల్ షిట్... కొన్నాళ్ళకు తనకు పిచ్చెక్కిపోవడం ఖాయం... తండ్రికి ఫోన్ చేసి నీ ఎంపైర్ నాకఖ్ఖర్లేదని చెప్పేస్తే?

 

    మామూలు మనిషిలా బతుకుతానని, బతకనివ్వమని అడిగితే? ఒప్పుకుంటాడా తండ్రి?

 

    "జీవితమంతా సంతోషాన్నిచ్చే ఆస్తి, అంతస్తు కావాలనుకుంటే ఈ ఎంపైర్ ని నీకప్పగిస్తాను... ఆ ఎంపైర్ ని నీకిచ్చే ముందు నువ్వు అందుకు అర్హుడివో, కాదో తేల్చాల్సిన అవసరం నాకుంది. నిన్ను అన్ని రకాలుగా టెస్ట్ చేయాల్సిన అవసరం నాకుంది. ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గినప్పుడే నేను నా మేథస్సుతో నిర్మించిన యీ బిలియనీర్ ఎస్టేట్ నీ స్వంతమవుతుంది." తండ్రి మహంత హెచ్చరించిన హెచ్చరిక గుర్తుకొచ్చింది.

 

    ఎందుకీ టెస్ట్ లు? ఎందుకీ వంటరితనం? చికాగ్గా రూమ్ లో నుంచి బయటికొస్తున్న సిద్ధార్ధ...

 

    గబగబా తనవైపే వస్తున్న అనంతమూర్తిని చూసి ఆగాడు.

 

    "మిస్టర్ సిద్ధార్ధా! గుడ్ న్యూస్ ఫర్ యూ."

 

    ఎవడో ఇంకో కొత్త ప్రొఫెసర్ ని తండ్రి పంపిస్తున్నాడేమో?

 

    "నీకు స్వేచ్చ లభించింది. మీ డాడీ మహంత పంపించిన మెసేజ్ చదువుతాను విను."

 

    చదవడం ప్రారంభించాడు అనంతమూర్తి.

 

    "మిస్టర్ అనంతమూర్తీ! బెస్ట్ విషెస్...

 

    సిద్ధార్ధ రొటీన్ ప్రోగ్రామ్ లో చిన్న మార్పు చెయ్యడానికి చీఫ్ సంకల్పించారు.

 

    ఒకటి... ప్రతిరోజూ మూడుగంటలసేపు సిద్ధార్ధ ముస్సోరీ పరిసర ప్రాంతాల్లో వాహ్యాళికి వెళ్లడం.

 

    రెండు... ప్రతి ఆదివారంనాడు పూర్తిగా సిద్ధార్ధ తనకి నచ్చినచోట పన్నెండు గంటలు గడిపి రావటం."

 

    ఆ మెసేజ్ ను గబుక్కున తన చేతుల్లోకి లాక్కుని చదువుకున్నాడతను. తన తండ్రి దగ్గర్నించి యిలాంటి మెసేజ్ వస్తుందని కలలో కూడా వూహించలేదతను.

 

    "వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారా దీనిని?" ఆనందంగా అడిగాడు అతను.

 

    "ఎస్... ఇమ్మీడియట్లీ" హుషారుగా అన్నాడు అనంతమూర్తి.

 

    "అయితే రేపట్నుంచి..."

 

    "కాదు ఎల్లుండునుంచి."

 

    ఆదిమానవుడు మొట్టమొదటిసారి వెలుతురుని చూసినట్టుగా వుంది సిద్ధార్ధకు.

 

    "డే ఆఫ్టర్ టుమారో ఈజ్ సండే" చిన్నపిల్లాడిలా అరుచుకుంటూ లోనికెళ్లిపోయాడతను.

 

    నవ్వుకుంటూ బయటికొచ్చేశాడు అనంతమూర్తి. మహంత నుంచి వచ్చిన యింకో మెసేజ్ ని జేబులోంచి తీసి చూస్తున్నాడు.

 

    మిస్టర్ అనంతమూర్తీ!

 

    ప్రతిరోజూ బయటికెళ్ళే సిద్ధార్ధకు సెక్యూరిటీ పకడ్బందీగా జరగాలి. కానీ ఆ విషయం అతనికి తెలియడానికి వీల్లేదు.

 

    అతనిలో జరిగే మానసికమైన మార్పుల్ని ఎప్పటికప్పుడూ విశ్లేషిస్తూ హెడ్ ఆఫీసుకు మెసేజ్ ని పంపాలి.

 

    ఆ మెసేజ్ పేపర్ ని అటూ ఇటూ చూసి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చింపి డస్ట్ బిన్ లో పడేశాడు అనంతమూర్తి. గబగబా నడిచి తన పర్సనల్ రూమ్ లోకెళ్ళాడు. తలుపులన్నీ వేసేసుకుని ఆ సమయంలో ఆ గదిలోకి ఎవరూ రారని నిర్ధారించుకుని టెలిఫోన్ తీసుకున్నాడు.

 

    ఎస్.టి.డి. కోడ్ 022 ప్రెస్ చేశాడు. తర్వాత తనకు కావలసిన నెంబరుని డయల్ చేశాడు.

 

    సిద్ధార్ధ రెగ్యులర్ ప్రోగ్రామ్ లో మార్పు జరిగిందన్న విషయం అనంతమూర్తి ద్వారా తెలుసుకున్న బొంబాయిలోని ఆ వ్యక్తి...

 

    'గుడ్! ప్రొసీడ్ మై ఫ్రెండ్! నీ పర్సనల్ బ్యాంక్ ఎకౌంట్ లోకి ఇవాలే మరో పది లక్షలు జమ చేస్తున్నాను" చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ బొంబాయిలోని వ్యక్తి.

 

    ఇంకో ఇరవయ్ నాలుగ్గంటల్లో శనివారం ఆదివారంగా మారుతుంది.

 

    ఆ ఆదివారం కోసం ఎదురుచూస్తున్నాడు సిద్ధార్ధ.


                                *    *    *    *


    ఏ.సి. సూట్లో నిశ్శబ్దం చుక్కలు చుక్కలుగా రాలుతోంది.

 

    "రెండు గంటల క్రితం జరిగిన సంఘటన గురించే నువ్వాలోచిస్తున్నావ్. ఇక్కడకొచ్చాక అరగంట క్రితం జరిగిన సంఘటన గురించి నువ్వాలోచించడం లేదు కదూ?" పర్సనల్ రూమ్ లో ఎవరితోనో ఫోన్ లో మాట్లాడి వస్తూ అడిగాడు దేశ్ ముఖ్.

 

    "అరగంట క్రితం ఏం జరిగింది?" అయోమయంగా ప్రశ్నించింది నిశాంత.

 

    "అదే అనుభవానికి, వాస్తవానికి తేడా. స్లమ్ ఏరియాలోకి నువ్వెళ్ళడం ఒక టెస్ట్. అలాగే నారాయణదత్ కేసు... అది కూడా ఒక టెస్టే." నవ్వుతూ అన్నాడు ఆయన.

 

    "నారాయణ్ దత్ కేసు, తనకు పెట్టిన టెస్టా?" ఒక మహామాంత్రికుడ్ని చూస్తున్నట్టుగా చూసింది ఆయనవైపు నిశాంత.

 

    "ఎస్ బేబీ! ఒకటి నీ హోప్ కి టెస్టు. రెండోది నీ యింటలిజెన్స్ కు టెస్టు."

 

    "నన్ను టెస్టు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో తెల్సుకోవచ్చా?" కోపంగా అడిగింది నిశాంత.

 

    "దట్స్ సింపుల్ బేబీ! బిజినెస్... బిజినెస్ పార్ట్నర్స్... ఒకర్నొకరు టెస్ట్ చేసుకోవడం. నేచురల్... నేను నిన్ను చేరదీసింది కూడా అందుకే" నెమ్మదిగా చెప్పాడు దేశ్ ముఖ్.

 

    "అందులో మీకెన్ని కోట్లు లాభం వస్తుంది?" అలా అడుగుతున్న నిశాంతవైపు, కుందేలు వైపు చూసిన పులిలా చూశాడు ఆయన.