మీ అందానికి ఈ ఐదు ఫ్రూట్స్ బాడీగార్డ్స్!

 

 

ఫ్రూట్స్ అనగానే వాటిని ఆరోగ్యాన్ని పెండే ఆహారంగానే చూస్తాం. కానీ అవి అందాన్ని పెంచే బ్యూటీషియన్స్ అని మీకు తెలుసా? ముఖ్యంగా ఓ అయిదు ఫ్రూట్స్ మనం అందానికి చేసే  మేలు అంతా ఇంతా కాదు. వాటిని శరీరంలోకి పంపినా, శరీరంపై పూసుకున్నా కూడా మంచిదే. 

 - అరటిపండ్లలో ఉండే ఉండే ఫైబర్, మినరల్స్, మెగ్నీసియం, పొటాసియం వంటివి కూడా ఎంతో మేలు చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ, బి, ఇ లు యాంటీ ఏజింగ్ ఏజెంట్ లా పని చేస్తాయి. అందుకే దీన్ని వీలైనంత తీసుకోవాలి. తేనెతో కలిపి అప్పుడప్పుడూ ప్యాక్ కూడా వేసుకుంటే మంచిది. 

- కమలాఫలాల్లో ఉండే విటమిన్ సి స్కిన్ టెక్స్చర్ ను ఇంప్రూవ్ చేస్తుంది. చర్మంపై ఉండే గాయాల్ని, మచ్చల్ని పోగొడుతుంది. కాబట్టి వీటిని తరచూ తినాలి. వీటి తొక్కలు కూడా ఎంతో మంచివి. వీటిని ఎండబెట్టి, పొడి చేసి, నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. 

- రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అంటారు. డాక్టర్ కే కాదు... బ్యూటీషియన్ కి కూడా దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే అది మన అందాన్ని అంత బాగా కాపాడుతుంది మరి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కణాల్ని, టిష్యూస్ ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. మలినాలను తొలగిస్తుంది. అందుకే వీటిని ఎక్కువగా తినాలి. యాపిల్ జ్యూస్ ని తేనెలో కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత కడిగేసుకుంటే తేమ పెరిగి ముఖం కళకళలాడుతుంది. పొడి చర్మం కలవారికి ఇది చాలా మంచిది.

- బొప్పాయిలో పపెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దీని గుజ్జులో తేనె కానీ పెరుగు కానీ కలిపి రుద్దుకున్నా కూడా చర్మం ఎంతో కాంతివంతమవుతుంది. 

- ఇక నిమ్మ గురించి చెప్పేదేముంది? ఇందులో ఉండే విటమిన్ సి చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. మలినాలను తొలగిస్తుంది. చర్మాన్ని, జుత్తుని కాపాడుతుంది. అందుకే దీన్ని వీలైనంత ఎక్కువ తీసుకోవాలి. దీని రసం రాస్తే మొటిమలు, మచ్చలు, ర్యాషెస్ ఏవైనా తగ్గిపోతాయి. తలకి రాస్తే చుండ్రు పోతుంది. జుత్తు బలంగా అయ్యి మెరుస్తూ ఉంటుంది. 

    చూశారుగా... ఈ అయిదు ఫ్రూట్సే అందానికి బాడీగార్డ్స్. అందుకే వీటిని ఎప్పుడూ మీతోనే ఉంచుకోండి మరి!

-Sameera