శారద గుండె ద్రవించిపోయింది. సమీపిస్తూ వేదనగా "పాపిష్టిదాన్ని మీకు కష్టం కలుగజేశాను. ఉండండి, పాలు త్రాగుదురుగానీ" అని ప్లాస్కూ, మందుల పెట్టెవున్న బల్లదగ్గరకు వెళ్ళి అతికష్టంమీద పెదాలను బిగబట్టింది.

    ఆ రాత్రి రవి వెళ్ళిపోయాక కొంతసేపటికి చిన్నక్క మంచంమీదనే ఆయనకు చాలా చేరువలో కూర్చునివుంది. ఒకచేయి ఆయన దుర్భలమైన గుండెపై వుంది. తన రెండు చేతులతో ఆ మృదువైన వ్రేళ్ళను నిమురుతూ ఇలా అడిగాడు.

    "శారదా! ఆ స్త్రీ ఎవరు ?"

    "మీరు పడుకోండి తరువాత చెబుతాను కానీ. మనకు కావలసిన స్త్రీయే" అంది ఆమె.

                                               8

    మరునాటి ఉదయం పది దాటింది. హాస్పిటల్ వాతావరణం చాలా నిశ్శబ్దంగా వుంది. ఆ సమయంలో ఓ కారువచ్చి మెల్లగా ఆగింది. అందులోంచి దిగిన ఓ యువతి లోపలకు వెళ్ళి గదినెంబర్లు చూసుకుంటూ నడిచి, చివరకు ఓ గదిముందు ఆగి "లోపలకు రావచ్చునాండీ?" అనడిగింది కొంచెం తటపటాయిస్తూనే.  

    సమాధానంగా శారద ఆశ్చర్యంగా ఇవతలకు వచ్చింది. ఎదురుగా నిలబడి వున్న యువతిని ఆమె ఇంతవరకూ చూడలేదు. కొంచెం పొడవుగా, అందంగా నాగరికంగా వున్న ఆమెరూపం త్వరలోనే ఆకర్షించి దగ్గరకు చేర్చింది. ఏదో తృష్ణతో అవలోకిస్తున్నాయి ఆ విశాల నయనాలు. కాసేపు ఇద్దరూ సంకోచిస్తూ నిలబడ్డారు.

    "ఎవరమ్మా నువ్వు?" అనడిగింది శారద.

    "నా పేరు శశి. మిమ్మల్ని చూద్దామనే వచ్చాను" అందా యువతి మృదుస్వరంతో.

    "కానీ నేను నిన్నెప్పుడూ చూసి ఎరుగనే?"

    "మిమ్మల్ని నేనెరుగుదును."

    శారద విస్తుపోలేదు. ఆమెకీ అనుభవం కొత్త ఏమీకాదు. నిన్న సాయంత్రం అంతవరకూ ముక్కూమొహం ఎరుగని ఒక స్త్రీ తనని "చిన్నక్కా!" అని ఆప్యాయంగా సంబోధించింది. ఆమె లోపలికి చూసి భర్త సుఖమయమైన నిద్రలోవుండటం చూసి "రా అటుపోదాం" అంటూ ఆమె భుజంమీద చేయివేసి చెట్లు గుబురుగా వున్న బయటి ఖాళీ ప్రదేశంవైపు నడిచింది. ఇద్దరూ పోయి ఓ సిమెంటు తిన్నెమీద కూర్చున్నారు. పది దాటుతున్నా ఎండ అన్నమాట లేదు. అప్పుడప్పుడు మనుష్యులు ఇటు వస్తూపోతూ వున్నారు.

    "మీగురించి రవి అప్పుడప్పుడూ చెబుతూండేవాడు. నేను చొరవ చేసుకుని మాట్లాడుతుంటే క్షమించమని కోరుతున్నాను. అప్పటినుంచీ సౌజన్యమూర్తిగా, శాంతస్వరూపంలా మిమ్మల్ని మనసులో చిత్రించుకుంటూ వచ్చాను. అదే రూపాన్ని మీలో చూడగలిగినందుకు నా అదృష్టాన్ని ఎలా అభినందించుకోవాలో తెలియకుండా వుంది. నాగురించి మీరేమీ వినలేదనుకుంటాను" అంది శశి.

    "అవునమ్మా! వినలేదు. నాకు రవి ఏమీ చెప్పలేదు. కానీ ఏమీ విననక్కరలేదు. చెప్పు?"

    "ఏం చెప్పమంటారు? ఈరోజు మిమ్మల్ని చూద్దామనుకుని వచ్చాను. బయటకు కదలరుగా మీరు?" అన్నది శశి మందహాసం చేసి.

    "నీవు చూస్తే చాలా చదువుకున్నదానివలె వున్నావు. రవి ఏవిధంగా తెలుసునో చెప్పవా? మన్నించు "నువ్వు" అనే అంటున్నందుకు. ఏమిటో అలవాటైపోయింది. అయినా నాకన్నా చిన్నవాళ్లని చూసినప్పుడు అలానే నోరుజారిపోతుంది."

    శశి చాలా నొచ్చుకుని "ఏమీ ఫర్వాలేదండి. మద్రాసులో వుంటున్నాను కాబట్టి ఏదో గర్వపోతునని భావిస్తే నన్ను చాలా అన్యాయం చేశారన్నమాటే. మేమిద్దరం కలిసి లా చదివాం."

    ఈ మాటలధోరణి శారదను ఆకర్షించింది. తన్మయంగా ఆమెను ఆమూలాగ్రం పరిశీలించింది. ఈ నాజూకుతనం, అందమైన అమాయకత్వం ఆమెను పులకితురాల్ని చేశాయి. లా చదివిన యువతి ఆమె. అయినా ఎంత లేతగా వుంది?

    "ఏమిటి ఇలా నా వంక అంతయిదిగా చూస్తున్నారు, చెప్పరా?"

    శారద కొద్దిగా తృళ్ళిపడినట్లయి, మెల్లిగా నవ్వుతూ "ఏమీలేదు... నిన్ను కలుసుకోవటం ఇదే ప్రథమం. ఐనా ఎన్నాళ్ళుగానో కలిసిమెలిసి వున్నట్లుగా వుంది" అంది.

    "దానికి మీ విశాలహృదయమే తప్ప మరొకటి కారణం కాదు."

    "ఉహు!" అని శారద తల అడ్డంగా వూపింది. "దీనికి కారణం నువ్వూ కాదు, నేనూ కాదు. మూడోది ఇంకోటి ఉంది."

    "ఏమిటో చెప్పండి? లేకపోతే నాకీ రాత్రికి నిద్రపట్టదు" అంది శశి త్వరగా.

    "నాకు మాత్రం ఏం తెలుసు? అయినా దాన్నిగురించి మనమంత తీవ్రంగా ఆలోచించవద్దు. సరేనా?" అని ఆమె శశితో కబుర్లలోకి దిగింది. అరగంటసేపు సంభాషణ ప్రవాహంలా గడిచిపోయింది. ఇద్దరూ చాలా ఆప్యాయంగా సంప్రీతిగా మాట్లాడుకున్నారు. శశి గోవిందరావుగారిని చూపించమంది. ఆయన నిద్రలేచాక తీసుకువెళ్ళి పరిచయం చేస్తానంది శారద.

    శశి అంది "మిమ్మల్ని అందరూ "చిన్నక్కా!" అని పిలుస్తారట. నేనూ అలానే పిలవాలన్న ఉత్సాహాన్ని అరికట్టుకోలేకుండా వున్నాను . కానీ ఏదో సందేహమో, మరి ఇంకొకటో నన్ను ఆపుచేస్తోంది.

    "వద్దు, నువ్వలా పిలవద్దు. అలా పిలవటంవల్లనే అనుకుంటా ఒక వ్యక్తి నా ముందు భంగపడటం జరిగింది. కానీ అందులో నా జోక్యం ఏమీ లేదు సుమా!"

    "మీరు ఎంత చక్కగా మాట్లాడుతారు! కానీ నాకు అర్ధంకాలేదు."

    చాలాసేపటికి ఇద్దరూ లేచారు. శశి మాటల్లో ఏదో మర్మభావం తాండవ మాడుతోందనీ, అది బయటకు రా వెరుస్తోందనీ శారద గ్రహించింది. కానీ తన అభిప్రాయం ఏమీ బయటకు వెలిబుచ్చలేదు. అంది "నేను ఈ ఊళ్ళో ఉన్నన్నాళ్ళూ మనం ఇలానే తరచూ కలుసుకుంటూ వుంటే బాగుంటుంది కదూ! ఈసారి రవికూడా వుంటాడు."   

    కానీ శశి ఈమాట వినిపించుకున్నట్లు లేదు. దగ్గరకు వచ్చి కలవరపాటును కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తూ "ఒక మాట చెప్పనా?" అంది.

    శారద తల ఊపింది.

    "మరి..... మధ్యాహ్నం నాన్నగారిని కూడా తీసుకువస్తాను యిక్కడికి, వారిని చూసినట్లూ అవుతుంది."

    ఆమె నవ్వి "సరే సరే! తప్పకుండా నాన్నగారిని తీసుకురా. మీకోసం ఎదురు చూస్తూ వుంటాను."

    తర్వాత శశి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.