సొగసైన చేతులకు సొబగులు అద్దే గాజులు

 

 

సొగసైన చేతులకు మరింత సొబగులు అద్దుతాయి గాజులు. మట్టిగాజులైనా ప్లాస్టిక్ గాజులైనా... రాళ్ల గాజులైనా రవ్వల గాజులైనా... పడతి చేతులకు గాజులు ఉండాల్సిందే. ఆ అందం కన్నులారా చూడాల్సిందే. అయితే కన్నులారా చూసినా తనివి తీరనంత అందం తెచ్చే గాజుల గురించి మీకు తెలుసా? బంగారం కాదు. వజ్రాలు ఉండవు. అయినా వాటి మెరుపులు మనోహరంగా ఉంటాయి. అవే ఈ గాజులు.

 

    వీటిని చేయడానికి వాడింది కేవలం సిల్క్ దారం. అవును. సిల్కుదారాలతో నేసిన ఎన్ని దుస్తులు ధరించి ఉంటాం! కానీ ఇప్పుడు వాటితో గాజులు కూడా తయారు చేస్తున్నారు. సిలుకు తళుకుల్ని మరింత ఇనుమడింపజేయడానికి రాళ్లు, రవ్వలు అద్దుతున్నారు. రకరకాలు వర్ణాలు... ఎన్నో రకాల డిజైన్లు... చూసేకొద్దీ మనసు లాగుతుంది. వేసిన కొద్దీ మక్కువ పెరుగుతుంది.

 

 


    ఫ్యాషనబుల్ జ్యూయెలరీ దొరికే పలు షాపుల్లో ఈ గాజులు లభిస్తున్నాయి. ధర మరీ ఆకాశాన్ని అంటదు. అందుబాటులోనే ఉంటుంది. లేని రంగంటూ ఉండదు కాబట్టి మనం ధరించే ఏ రంగు దుస్తులకైనా నప్పే గాజుల జత తేలికగా దొరుకుతుంది. నిజానికి వీటిని సొంతగా కూడా తయారు చేసుకోవచ్చు. మధ్యలో ఓ ప్లాస్టిక్ గాజునో మట్టి గాజునో పెట్టి దానికి సిల్కు దారం చుట్టుకుంటూ పోవాలి. నచ్చిన సైజులోకి వచ్చాక ముడి వేసి.. నచ్చినట్టుగా రాళ్లు గానీ, పూసలు గానీ అతికించుకోవచ్చు. మరీ అంత కష్టం ఎందుకనుకుంటే హ్యపీగా కొనేసుకోండి. అందుబాటు ధరలో అందం దొరుకుతుందంటే సొంతం చేసుకోడానికి ఆలస్యం ఎందుకు చెప్పండి!

 

 

- Sameera