థాయ్ పిల్లలు మనకు ఏం నేర్పిస్తున్నారో తెలుసా...?

 

 

పన్నెండు మంది పిల్లలు మరియు కోచ్ సురక్షితంగా బయట పడ్డారు అని వినగానే అందరం అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. వారిని రక్షించిన వారికి జేజేలు పలికాము. సోషల్ మీడియా లో మన హర్షాతిరేకాలని ప్రకటించాము.మన దేశం లో అయితే అసలు ఆ పిల్లలని మనం రక్షించలేక పోయేవాళ్ళం అని కూడా  పోస్ట్ లు పెట్టేసాము .  ప్రభుత్వం కి అంత సమర్ధత లేదు అని నిర్దారించి తీర్పు ఇచ్చాం కరెక్టే కాని , మనం పెంచే పిల్లలులో ఆ పిల్లలలో ఉన్నంత మానసిక స్థైర్యం , శారీరక సామర్ధ్యం ఉందా ? అని ఎవరికీ వాళ్ళం ఒక్కసారి ప్రశ్నించు కున్నామా ?

 

 

ప్రతికూల పరిస్తితులులో కూడా ఎక్కడా బెదరకుండా , రేపటికి ప్రాణాలతో ఉంటామో లేదో , అసలు ఇక్కడ నుంచి బయట పడతామో లేదో అన్న స్థితిలో కూడా నిబ్బరంగా వుండటం అంటే మాటలా ? ఇన్ని రోజులలో ఇన్ని వార్తలు చూసాము కదా , ఎక్కడైనా పిల్లలు ఏడుస్తున్నారు అని కాని , భయ పడిపోయి వున్నారని కాని చదివామా ? ఎంత వాళ్ళ వయసు ? పట్టుమని పదిహేను ఏళ్ళు లేవు . ఎక్కడ నుంచి వచ్చింది వాళ్ళకంత ధైర్యం ? ఏ ట్రైనింగ్ తీసుకున్నారని మృత్యువు అంచుల దాకా వెళ్లి , దానిని ఓడించి రాగలిగారు ?

 

 

మన ప్రభుత్వం ఎంత చేతనైనదో వాక్యానించే ముందు , అసలు మనం ఎంత అద్బుతమైన పేరెంటింగ్ చేస్తున్నామో చూసుకుంటే రేపటి రోజున పరీక్ష బాగా రాయలేదని అమ్మా నాన్నలకి ఎదురుపడటానికి కూడా దైర్యం లేక పరీక్ష హాలు మీద నుంచి దూకి ప్రాణాలు వదిలేసే అమ్మాయి కోసం ఇంకో సారి వినాల్సిన అవసరం రాదు . చిన్న తరగతులు నుంచి పెద్ద తరగతులు వరకు ఎక్కడ పరీక్ష తప్పినా చావే పరిష్కారం . ఉద్యోగం నుంచి ప్రేమ దాకా ఎక్కడ ఓడిపోయినా చావే పరిష్కారం . ఇది కదా ఇప్పుడు మనం చూస్తోంది మన సమాజం లో ? ఇలా కదా మనం పెంచుతోంది ఈ తరాన్ని ? ఇదే కదా మన వాస్తవం?

 

 

ఒక్కసారి ఆలోచించండి . ఎక్కడ వుంది పొరపాటు ?  అందరికి తెలిసిన రహస్యం అది.   అయినా నిర్లక్ష్యం . మనం మారం . మానసిక నిపుణులు మొత్తుకుంటున్నారు . పిల్లల ఎదుగుదల అంటే చదువు, మార్కులు , పెద్ద ఉద్యోగం , జీతం మాత్రమె కాదు ...జీవితాన్ని జీవించటం నేర్చుకోవటం అని . ఆ జీవించటం తెలిస్తే చాలు . అందులోనే ఓటమిని ఎదుర్కోవటం , ప్రతికూల పరిస్తుతులలో కూడా నమ్మకం తో వుండటం , మృత్యువు ఎదురైనా చిరునవ్వుతో రాను పొమ్మని చెప్పగలిగే దైర్యం అన్నీ, అన్నీ వుంటాయి . ఇవి కదా మనం పిల్లలకి నేర్పించాల్సింది . ఇవి మాత్రమె కదా పసి వారిని ఆనందం గా , ఆహ్లాదం గా , దైర్యం గా రేపటిని ఎదుర్కునేలా చేసేది . తెలిసీ మనం ఎందుకు తప్పు చేస్తున్నాము .? తెలిసీ మనం మన పసివారిని ఎందుకు నిర్వీర్యుల్ని , నిరాశా వాదులని చేస్తున్నాము ?

 

 

ఒక్కసారి మనం మన పిల్లలకి థాయ్ పిల్లల కథని చెబుదాము . ఆ సాహసాన్ని , ఆ దైర్యాన్ని చూసి నేర్చుకోమని చెబుదాము . అంత దైర్య వంతులుగా మన పిల్లలు కూడా మారేలా చేద్దాము .అంతే కాదు  మానసిక స్థైర్యం తో పాటు ఆ పిల్లల శారీరక ద్రుడత్వం ని కూడా ప్రపంచం కొనియాడుతోంది . అది గమనించుదాము. కేవలం పుస్తకాలే కాకుండా పిల్లల ప్రపంచం ఇంకా చాలా ఉంటుందని గ్రహిద్దాము . ఆటలు వాళ్ళని మానసికం గా , శారీరకం గా ఎంతో  దృడం గా వుంచుతాయని ఒప్పుకున్దాము. రేపటి రోజున మన పిల్లలు అలాంటి గుహలో ఇరుక్కోక పోవచ్చు ., కాని జీవితం అనే గుహ కూడా చాలా సార్లు సమస్యలతో బయటకి వచ్చే దారులని మూసేస్తుంది . ఊపిరి అందకుండా చేస్తుంది . రక్షించటానికి ఎవరు ముందుకి రాకపోవచ్చు ., తప్పించుకునే దారి కనిపించక పోవచ్చు .అయినా కూడా ఎక్కడా అదరక, బెదరక దైర్యంగా జీవిత పద్మవ్యూహాన్ని చేదించి విజేతలుగా నిలవాలంటే మనం మారక తప్పదు. ఆలోచించండి.

- రమ