"అందర్నీ పరిచయం చెయ్యడం అయిపోయిందిగా! మరోసారి తీరుబడిగా వస్తా ... వాడు అసలు ఐదు నిమిషాలే టైము ఇచ్చాడు నాకు!" అన్నాడు సీతారామయ్య.
    
    మాధవ్ పెద్దనాన్న ఎక్కడ బయలుదేరమంటాడోనని భయంగా చూశాడు.
    
    "అప్పుడేనా? ఈ పూట మా ఇంట్లోనే భోజనం!" అంది పార్వతమ్మ.
    
    "ఈ పూటేమిటే' అన్ని పూట్లానూ!" తీర్మానంలా చెప్పాడు సుబ్బారాయుడు.
    
    "ఇప్పుడు కాదు .... రాత్రికి వస్తాం. వాడు ఇంటి దగ్గరే గట్టిగా చెప్పాడు. లేకపోతే నా మాట ఇంకెన్నడూ నమ్మడు. పదరా!" అన్నాడు సీతారామయ్య.
    
    అసలీ పెద్దాళ్ళకి ఆలోచనా శక్తి నశించిపోతోంది అనుకున్నాడు చిరాగ్గా మాధవ్.
    
    "ఇంట్లో అందర్నీ పరిచయం చెయ్యడం అయిపోయిందాండీ?" ధైర్యం చేసి అడిగాడు.
    
    "ఇంకా నాకు నలుగురు చెల్లెళ్ళూ, వాళ్ళమొగుళ్ళూ మిగిలిపోయారు!" అన్నాడు సుబ్బారాయుడు.
    
    "మరి.... మీ అబ్బాయిల్నీ.. అమ్మాయిల్నీ...." అని నసిగాడు.
    
    "నాకు మగపిల్లలు లేరు.  నా తమ్ముడికి ముగ్గురూ మగ పిల్లలే?" అన్నాడు సుబ్బారాయుడు.
    
    దగ్గరకొచ్చేశాడు అని ఉత్సాహంగా "మరి ఆడపిల్లలూ?" అన్నాడు.
    
    "పదరా... నువ్వు చెప్పిన ఐదు నిమిషాలూ రెట్టింపై కూర్చుంది!" కావాలనే తొందర చేశాడు సీతారామయ్య.
    
    "ఉండండీ.... బాబుకి పాలు తీసుకొస్తాను!" అని పార్వతమ్మ లోపలికి వెళ్ళింది.
    
    "వద్దమ్మా!.... ఆలస్యం అయిపోయింది.....! అన్నాడాయన.
    
    "ఉండు పెద్దనాన్నా పాలుతాగే వెళదాం!" అన్నాడు మాధవ్.
    
    'నీ సంగతి కనిపెట్టేశాలే' అన్నట్లు చూశాడు పెద్దాయన.
    
    ఇంతలో ఘల్లున అందెలు మోగాయి, మాధవ్ కళ్ళు మెరిశాయి. చేతిలో వెండి పళ్ళాలు ఉన్న ట్రేతో రాధ వచ్చింది.

    ఆక్స్ ఫర్డ్ లో అల్లం ఉల్లీ పెసరట్టు తిన్నట్లూ....షేక్స్ పియర్ నీ, శరత్ చంద్రనీ కలిపి చదివినట్టూ....మైఖేల్ జాక్సన్ గొంతులో మధ్యమావతి విన్నట్టూ అనిపించింది మాధవ్ కి.
    
    "మా అమ్మాయి.... అన్నాడు సుబ్బారాయుడు.
    
    తలవంచి రెండు చేతులూ జోడించింది రాధ. ఆ చేతుల గోరింట వెలుగుకి రెండు కళ్ళూ చీకటైనట్లు అనిపించింది.
    
    "పేరూ"?" అడిగాడు.
    
    "మాకు చాలా కలం తర్వాత ఎన్నో మొక్కులూ, వ్రతాలూ అయ్యాక పుట్టింది బాబూ ఇదీ ... అందుకే దీనిపేరు శ్రీమహాలక్ష్మి దుర్గా వీర శివ నాగదత్త మంగళ సుఖీవర గౌరీపూర్ణ అలివేలూ భ్రమర..."
    
    ఆంధ్రదేశంలో ఉన్న గుళ్ళలలో అమ్మవార్లందరి పేర్లూ ఆయన చెప్తుంటే, 'ముక్కోటి దేవతలూ ఒక్కటైనారూ.... చక్కాని పాపనూ ఇక్కడుంచారూ....అని పాడుతున్నట్లుగా ధ్వనించింది.
    
    "త్రిపుర సుందరీ వరద లలిత అనంత వేద.... అనూరాధ!" అని గుక్క తిప్పుకున్నాడు ఆయన.
    
    "రాధా .... అని పిలుస్తాం!" అన్నాడు ప్రకాశం.
    
    "ఈ ఒక్కమాటా ముందే చెప్పొచ్చుగా!" అనుకుని, "రాధ.....! చాలా మంచిపేరు!" అన్నాడు మాధవ్ గోడకి తగిలించిన రాధామాధవులవటం వైపు ఓరగా చూస్తూ.
    
    ఆ చూపుల వాడికి ఆమె చెక్కిలి సొట్టపడి తుర్రున లోపలికి పారిపోయింది.
    
    "ఎలప్రాయపు అందాలూ... అరవిచ్చిన మందారాలూ"
    
    అరిటాకున సిరిచందనాలూ అమరించిన వాడికి వందనాలూ....
    
    అభినందనాలూ...! అనుకున్నాడు మనసులో మాధవ్.
    
                                                                  * * *
    
    "పల్లెటూళ్ళని భాగ్యసీమలని ఎందుకంటారో నాకిప్పుడు అర్ధమైంది. పెద్దనాన్నా!" అన్నాడు కోనేట్లోకి గులకరాళ్ళు విసురుతూ మాధవ్.
    
    ధ్వజస్తంభం చుట్టూ తిరుగుతున్న సీతారామయ్య ఆగి, మాధవ్ చెప్పేదాని కోసం ఎదురుచూశాడు.
    
    "ఆశ్సీస్సులందించే బామ్మలూ, తాతయ్యలూ, ఆప్యాయతను వడ్డించే పిన్నులూ, బాబాయ్ లూ ... ఆదరణని తాంబూలంగా చుట్టిచ్చే వదినలూ, అన్నయ్యలూ....అల్లరితో యింటిని అలంకరించే బుల్లి బుల్లి తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ....దీపావళి పండక్కి ఇంటిముందు పెట్టే దీపాల్లాంటి బావగార్లూ... సంక్రాంతినాడు యింటిముందు తీర్చిదిద్దే రంగవల్లుల్లాంటి అక్కయ్యలూ..."
    
    "ఇంకా!" నవ్వుతూ అడిగాడు సీతారామయ్య.
    
    "ఇంటిముందు వేసిన చల్లని నీడనిచ్చే వేపచెట్టులాంటి పెద్దనాన్నా! ఇందరున్న ఇల్లు ఆనందానికి పుట్టిల్లు కాకా ఏమౌతుందీ? అటువంటి ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు అంతటి అదృష్టవంతులూ?!"
    
    సీతారామయ్య నిట్టూరుస్తూ మాధవ్ పక్కన కూర్చుని, "ఏడాదికి ఒక్కసారి కూడా మీ అమ్మా నాన్న మన ఊరు మొహం చూడరు. కాన్వెంటు చదువులు, రెయిన్ కోటు వేసుకుని .... వానలో పడవలు వదిలినట్లుగా ఉంటాయి. సింగిల్ ఫామిలీలు సుఖం.... జాయింట్ ఫామిలీలు కడగండ్లకి ఆలవాలం అని చిన్నప్పటినుండీ ప్రబోధిస్తారు. సింగిల్ ఫామిలీలు కూడా పోయి సింగిల్ పేరెంట్స్ వచ్చారు..... అటువంటి వాతావరణంలో పెరిగిన నువ్వు యిలా మాట్లాడటం విచిత్రంగా ఉందిరా!" అన్నాడు.
    
    ఎక్కువగా చదువుకొని పెద్దనాన్న నోటినుండి ఇంగ్లీషు మాటలు విని ఆశ్చర్యంగా చూశాడు మాధవ్.
    
    "చదువు వేరూ, జ్ఞానం వేరూ! చదువుకున్న అజ్ఞానులు ఎందరో మనకు సూట్లూ బూట్లూ వేసుకుని కనిపిస్తూ ఉంటారు. అలాగే సుఖమయమైన జీవితం వేరూ! ఆనందమయమైన జీవితం వేరూ! నీ ఆనందం ఎక్కడుందో నీకు తెలిసేసరికి సమయం పడుతుంది అసలు అన్వేషణ లేని చోటు ఎప్పటికీ దొరకదు!" అన్నాడు.
    
    "నిజమే పెద్దనాన్న!" ఒప్పుకున్నాడు మాధవ్. "నేను ఇక్కడికి రాకముందు రూర్కెలా వెళ్ళి పెద్దత్తయ్యని కలిశాను. ఆవిడిద్దరు ఆడపిల్లలకీ పెళ్ళిళ్ళు చేసేసింది. ఒకళ్ళు కెనడాలో, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో సెటిలయ్యారట. మావయ్య, ఆవిడా గడియారపు ముళ్ళులా కాలాన్ని కొలుస్తున్నారు. అందరికీ దూరంగా మన భాషా, మన పద్దతీ కానిచోట ఎందుకుండాలో నాకు అర్ధం కాలేదు. అక్కడనుండి వైజాగ్ వెళ్ళాను. మా పిన్నీ, బాబాయ్ కూడా నేను అనుకున్నంత సంతోషంగా లేరు. పిల్లలిద్దరూ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతున్నారు. పిన్నీ, బాబాయ్ ఇద్దరూ పొద్దున లేచింది మొదలు పరుగులు పెడుతూ ఉద్యోగాలకి వెళ్ళడం, రావటం .....ఇదే దైనందినంతో అసలు మునుపటి సరదాలూ, చమత్కారాలూ మర్చిపోయారు. దే ఆర్ జస్ట్ లివింగ్ లైక్ రొబోట్స్! ఇక చెన్నై వెళ్ళి నీ ఆఖరి తమ్ముడిని కలిశాను. వెళ్ళిన రెండోరోజుకి కానీ ఆయన దర్శనమే నాకు కలగలేదు. పిన్ని ఎన్నోచోట్లకి ఫోన్లు చేస్తే చివరికి ఓచోట పేకాటలో దొరికాడు. వస్తూనే సీసా పెట్టుకుని కూర్చుని నన్నూ మందు కొట్టడానికి రమ్మని ఇన్ వైట్ చేశాడు!"