జీవాత్మ


    
    అయినా సాధకుడు ఆపకుండా సాధన చేసిన పిమ్మట మృదంగములు వాయించినట్లు, శంఖములూదినట్లు, ఘంటా నాదములు, కాహాళనాదము, వేణుగానము, వీణానాదము, భ్రమర నాదములు మొదలైనవి దేహం మధ్య ప్రదేశము నుండి విన్పిస్తుంటాయి.
    
    అప్పుడు బుద్ది నిర్మలమై, ఏకాగ్రత పెరుగుతుంది. శరీరము ద్వారా చేయు సమస్త కర్మలు, వాటి ఫలితములు ఈశ్వరార్పణ గావించి జీవితాంతం నిగ్రహముగా వుండి కోరికలని త్యజించి బుద్దిని సుఖదుఃఖముల వైపు మళ్ళకుండా సాధనచేస్తూ పోతే కుండలినీ శక్తి వశమవుతుంది.
    
    మానవదేహంలో షట్ చక్రములున్నాయి అవి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము ఈ చక్రములు సుషుమ్నా నడియందుంటాయి. ఆ షట్ చక్రములలో కుండలినీ నాది ప్రవేశిస్తున్నప్పుడు ఒక్కో రకం అనుభూతి ఎదురవుతుంది.
    
    సుషుమ్నా నాది అంటే ప్రాణశక్తి సంచరించేందుకు అడ్డులేని రాజబాటని అంటారు. కుండలినీ ఇంకా ముందుకు సాగిపోతే సాధకుడికి అన్ని భయాలు తొలగిపోతాయి. మానసికంగా, శారీరకంగా బలవంతుడవుతాడు....ఆ అనుభూతి పొందితే దానిని బ్రహ్మనాడిలో కుండలినీ ప్రవేశించడంగా చెప్పుకోవచ్చు. ఇలా కుండలినీ శక్తి చలిస్తూ సాధకుడిని మహిమాన్వితుడ్ని చేస్తుంది. యోగులు ఆ మహిమల్ని అష్టయిశ్వర్యములు లేదా అష్టనిధ శక్తులని అంటారు.
    
    అవి-అణియ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశ్వత, వశత్వ శక్తులు!
    
    ఇందాక నేను మహదేవ్ శరీరంలో సూక్ష్మశరీరం లేదని చెప్పటానికి కారణం నాకొచ్చిన యోగమహిమే! అయితే నేనింకా ఎంతో సాధిస్తేనే కానీ కుండలినీ శక్తిని పొందినట్టు కాదు ఆ లెక్కన నా గమ్యాన్ని నేను సగానికి కూడా చేరుకోలేదు. మామూలు మనుషులు చూడలేని సూక్ష్మ శరీరాన్ని యోగులు యోగశక్తితో చూడగలరు. ఇది ఒకప్పటి మాట...."
    
    కానీ మానవుడు సాధించక ఎన్నో విజయాల్లో మరొక విజయంగా యోగులు మాత్రమే చూడగలిగిన సూక్ష్మ శరీరాన్ని (తేజోమయ శరీరం) రష్యన్ సైంటిస్టులు ఫోటోలు తీసి చూపించటంలో విజయం సాధించారు...." అని చెప్పాడు తిరుపతి.
    
    అభిరాం, వరప్రసాదం ఆశ్చర్యంగా చూశారతన్ని.
    
    "అవును! మనిషిలోని మరో మనిషి వంటి సూక్ష్మ శరీరాన్ని వారు కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటోలు తీసి, మనదేశంలోని యోగులూ, ఋషులూ ఎప్పుడో కనిపెట్టిన విషయాన్ని వారిప్పుడు కనుక్కొని, మనదేశంలోని మహాత్ములు చెప్పిన విషయాన్ని కట్టుకధలుగా కొట్టి పారేసే కుహనా సైన్స్ మేధావులకి కనువిప్పు కలిగించారు.
    
    1906లో జంతువుల శరీరంలో దాగివున్న వేలుతుర్ని (Bio Luminscence Or Phosphorescence) కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా కనుగొన్నారు. ఇది ఎక్స్ రే లాంటి పరికరం.
    
    తరువాత రకరకాల చెట్లను, ఆకులను ఫోటోలు తీయడం జరిగింది. వాటిలోని ప్రత్యేకించి సూక్ష్మశరీరం అణాబడేది కేవలం తేజస్సు మాత్రమే.
    
    అది అన్నివైపులా నిప్పురవ్వల వంటి కాంతి మెరుపులలో తళతళలాడే స్పష్టమైన తేజస్సుతో అంచుల చుట్టూ కన్పించింది.
    
    ఆ తరువాత వారు కొన్ని చెట్ల ఆకులను కత్తిరించి మళ్ళీ ఫోటోలు తీయగా కత్తిరించిన ఆకుభాగం కూడా పూర్తిగా కిర్లియన్ ఫోటోలు కనపడింది. అంటే ఆ ఫోటోలు పడింది ఆకు యొక్క 'ప్రేతాత్మ' (Ghost) లేదా 'జీవాత్మ' (plasma Body) అన్న మాట.
    
    అందుకే దాంట్లో కొంత కత్తిరించాక కూడా అది సరిగ్గా ఆ పూర్తి ఆకు యొక్క 'స్థూల శరీరాన్ని' పొలి వుంది. అంటే సూక్ష్మ శరీరం, కవలల్లా వుంటాయన్న మాట.
    
    స్థూల శరీరంలో మనిషికి ఒక వేలు కానీ, కాలుగాని ఆపరేషన్ చేసి తీసివేసిన తర్వాత కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటో తీసి చూస్తే సూక్ష్మ శరీరంలో మాత్రం తీసేసిన వేలుగానీ, కాలుగానీ అలాగే వుంటుంది. స్థూల శరీరంలో దాగి వుంటే సూక్ష్మ శరీరం ప్లాస్మా వంటి ప్రాధమిక పదార్ధం. (Elementary Matter) ఇంకొక సూక్ష్మశక్తితో కలసి ఏర్పడిన పొగ వంటి తేజస్సు. ఇది ఆకాశంలోని నక్షత్రాల మేఘం (Star-Cloud) లాగా కనబడుతోంది.
    
    ఈ సూక్ష్మశరీరం ఎలక్ట్రానుల వంటి కణాలతో లేక రేణువులతో తయారయిన స్పష్టమైన (Independent entity) శక్తిగా రుజువైంది. అంతేకాదు! ఇది నిరాధారంగా పొగమంచులా ఏర్పడ్డ శక్తి కాదు స్పష్టంగా ఆకారంలో వున్న ఒక జీవంగానూ, అన్ని పనులూ నిర్వహించగల ఒక వ్యక్తిత్వాన్ని కలిగి వున్నది.
    
    దాంతో హిందూమత స్థాపకులైన ఋషులు లక్షలవేల ఏళ్లనాదే కనుక్కున్నా 'సూక్ష్మశరీరం' 'అంతరాత్మ' అనేవే లేవనే నాస్తికులకి పునాదులు కదిలిపోయాయ్. ఇప్పుడు మీ ఊహకందని సత్యాన్ని మీ కళ్ళ ముందే ఆవిష్కరిస్తాను" అంటూ లేచాడు తిరుపతి.
    
    అభిరాం, వరప్రసాదం అతనేం చేయబోతున్నాడోనని ఆశ్చర్యంగా చూడసాగారు.
    
    తన సూట్ కేస్ లోంచి వీడియో కెమెరాలాంటి దాన్ని బయటకు తీశాడతను.    

    మడిచివున్న పైపుల్లాంటి గొట్టాల్ని కొన్నింటిని తీసుకుని వాటి మడతలని విప్పి నేలపై పెట్టాడు. అప్పుడొక స్టాండ్ రూపాన్ని సంతరించు కుంది. ఆ స్టాండ్ మీద కెమెరాని అమర్చాడు.
    
    "ఇది కిర్లియన్ దంపతులు కనిపెట్టిన స్పెషల్ కెమెరా నుంచి ఎంతో పరిణామం చెందిన ఆధునిక కిర్లియన్ కెమెరా.
    
    అభిరాం మీరిటురండి. వరప్రసాదంగారూ మీరు లేచి నిలబడండి" అన్నాడు. అభిరాం అతన్ని సమీపించాడు. వరప్రసాదం లేచి నిలబడ్డాడు.
    
    లెన్స్ సరిచేస్తున్నట్లు కెమెరా ముందు భాగంలో ఉన్న గుండ్రని చక్రాన్ని తిప్పుతూ దానిలోంచి వరప్రసాదాన్ని కాసేపు చూశాడు.