జీవాత్మ


    
    దూరం నుంచి అస్పష్టంగా వుండటంవల్ల మంచుమనిషిలాగా అగుపించి హిమాలయాలలో యెతి (ఆంగ్లేయులు దీన్ని షాంగ్రిలా అని సంబోధిస్తారు) వున్నదని ప్రచారం జరిగిపోయింది.
    
    నిజానికి 'యతి' అనేది శంకరాచార్య సంప్రదాయం సన్యాసులను ఉద్దేశించి వాడే పదం.
    
    మంత్రమంటే ఏమిటో నాకు తెలిసింది హిమాలయాలలోనే. మంత్రమంటే మామూలు మనుషుల భాష నుండి వచ్చినది కాదు. నిశ్చలమైన, తీవ్రమైన ధ్యానంలో మహర్షులు కనిపెట్టిన కొన్ని పదాలు, అక్షరాలు, శబ్దాలు కలసి ఏర్పడినవే. అవి అంతశ్చేతన నుండి వచ్చిన నాదాలు.
    
    సాధకుని పైపైకి తీసుకువెళ్ళి ఆఖరికి పరిపూర్ణుడైన యోగిగా మార్చి, అనంతానంతమైన నిశ్శబ్దంలోకి పంపుతాయి. మంత్రాల గురించి జ్ఞానం పెరిగేకొద్దీ కొత్త అర్ధాలు స్ఫురిస్తాహాయి. చైతన్యంలో వున్న స్థితుల గురించి తెలుస్తుంది. మనిషికున్నట్లే మాత్రానికి కూడా కొన్ని కవచాలున్నాయి.
    
    ఉదాహరణకు 'ఓంకార' మంత్రం తీసుకుంటే గనుక ఇందులోని ఆ, ఉ, మ ఆమె మూడు అక్షరాలు మెలకువ, కలలు కనడం, నిద్రపోవడం అనే మూడు దశలను సంకేతంగా వున్నాయి. ఇవే సూక్ష్మ, స్థూల, కారణ దేహాలకు చిహ్నాలు వీటిని దాటిన నాలుగవ దశ (తురీయస్థితి)లో మంత్రానికి ఒక రూపం లేదు. నాదం లేదు. అది వర్ణనాతీతం.
    
    లయయోగం (స్వేదనం) గురించి తెలిసినవారికి ఈ నాలుగో దశ సిద్దిస్తుంది. ప్రార్ధనా రూపాలలో అత్యంత శక్తివంతమైనది, పొందికైనది, ప్రముఖమైనది మంత్రమే. చక్కగా గుర్తుంచుకుంటే అది దారి చూపుతుంది.
    
    కొందరు ఋషులు మాత్రమే చెప్పే ప్రత్యేక మంత్రం 'ఆప్త మంత్రం' రుషికేశ్ సమీపంలో ఒక నదీతీరంలోని కుటీరంలో ఒక స్వామి వుండేవాడు. ఆయనకు చూడాలంటే కాస్సేపు తాళ్ళ వంతెనపై నడిచి గంగా నదిని దాటి వెళ్ళాలి. ఆ ప్రాంతంలో క్రూరమృగాలు కూడా ఎక్కువగానే తిరుగుతూ వుండేవి.
    
    నేనాయన్ని చూడాలని బయలుదేరి వెళ్ళాను. స్వెట్టర్, మఫ్లర్, తలకి తుండు చుట్టుకున్నా నేను చలికి గజగజా వణుకుతున్నాను. నేనాయన్ని సమీపించేసరికి ఆయన అంతటి శీతలంలో కూడా గంగానదిలో స్నానం చేస్తూ కన్పించాడు. అది యోగం వల్ల సాధ్యమవుతుంది. ఆయన స్నానం చేసి వచ్చారు. నేనాయనకి నమస్కరించాను.
    
    ఆయన దీవిస్తున్నట్లు చెయ్యెత్తి ఆశీర్వదించి నన్ను తన కుటీరంలోకి తీసుకెళ్ళారు.
    
    లోపల ఏదో తాళపత్ర గ్రంథాలు, ఆయన సాధన సామగ్రి తప్ప మరేం లేవు. ఆయన కొద్దిసేపు ధ్యానం చేసుకుని బయటకి వచ్చాడు.
    
    ఆయనకి డెబ్బై ఏళ్ళుంటాయి. నేను చూస్తుండగానే ఆయన చెట్లెక్కాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ చెట్ట్టుమీదో తేనె పట్టుంది. ఆయన ఆ తేనెను తీసే ప్రయత్నంలో వున్నాడు. ఆయన పనికి నేను విస్మయం చెందాను.
    
    తేనెపట్టుని కదిలిస్తే తేనెతీగలు కుట్టేస్తాయి. మరితనేమిటి ఇలా చేస్తున్నాడు అనుకున్నాను. అయితే నా అంచనాలను తారుమారుచేస్తూ ఆయన ఏదో మంత్రం ఉచ్చరించి కొమ్మ తుంచి తేనెపట్టుతోపాటు దిగాడు. తేనెటీగలు ఆయన్నేం చేయలేదు. ఆయన తేనెని తీసి నాకిచ్చి, తానూ తాగాడు. అక్కడితో నేనాయనవద్ద సెలవు తీసుకుని వెనుదిరిగాను"
    
    వరప్రసాదం చెబుతున్న విషయాలని శ్రద్దగా వింటున్నాడు అభిరాం. అతని ముందో క్రొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నట్లు వరప్రసాదం మళ్ళీ ఇలా తన సంభాషణని కొనసాగించాడు.
    
    "హిమాలయాలలోనే ఒక యోగి ప్రదర్శించిన పరకాయ ప్రవేశాన్ని వీక్షించే అదృష్టం కలిగింది నాకు."
    
    "ఏమిటీ పరకాయ ప్రవేశమా?" ఎంతో ఆశ్చర్యపోతూ అడిగాడు అభిరాం.
    
    "అవును! ఓ యోగి తన శిష్యులకి ఆ విద్యను ప్రదర్శించి చూపుతుండగా అదృష్టవశాత్తు నేనప్పుడు అక్కడే వున్నాను గనుక చూశాను.
    
    ఆ యోగి తన శిష్యులకి ఒక కొయ్యపలకను ఇచ్చి పట్టుకోమన్నాడు. వారు ఆ పలకను పట్టుకున్నారు. 'చూస్తున్నారా నన్ను?' శిష్యులని అడిగాడా యోగి. 'చూస్తున్నాం' అన్నారు వాళ్ళు. నాకంతా అయోమయంగా వుంది.
    
    కాసేపటికి చూస్తుండగానే ఆ యోగి శరీరం మసకబారింది. అది ఆయన శిష్యులవైపు పయనించింది. తరువాత అదృశ్యమైపోయింది కొయ్యపలక బరువెక్కింది. శిష్యులు ఆ పలక బరువు హఠాత్తుగా పెరిగిపోవడంతో మోయలేక కిందికి దించేశారు. 'పలకను వదలకుండా పట్టుకోండి' యోగి స్వరం అదృశ్యరూపంలోంచే విన్పించింది.
    
    అతిప్రయాసతో శిష్యులా కొయ్యపలకని పైకి లేవదీశారు. పది, పదిహేను నిమిషాల తర్వాత యోగి రూపం అందరిముందూ నిలిచింది.
    
    మనిషికి ఇటువంటి సిద్దులు యోగం ద్వారా వస్తాయని, ఆ విషయం పతంజలి యోగశాస్త్రంలో వుందని ఆ యోగి తన శిష్యులకి వివరించారు. తరువాత ఆయన సౌరశాస్త్రం గురించి వివరించారు. ఇది సౌరనాడిని ధ్యానించడం వలన వస్తుంది.
    
    మణిపూరక చక్రం పై ధ్యానంవల్ల రోగనివారణ చేసే విద్య అబ్బుతుందని చెప్పాడతను.
    
    ఈ శాస్త్రాన్ని ఉపనిషత్తులు వర్ణిస్తాయని, దీన్ని అభ్యసిస్తే మనిషికి భౌతిక, బౌద్ధిక, ప్రాణిక స్థాయిలలో ఆధిపత్యం లభిస్తుందనీ, ఈ శాస్త్రంలో నిపుణుడైన వ్యక్తి ఎంత దూరంలో వున్నవారికైనా జబ్బులు నయం చేయగలడాయన"
    
    అభిరాం ఊపిరి బిగపట్టి వరప్రసాదం చెప్పే ఆశ్చర్యకర విషయాలు వింటూ ఉద్విగ్నత అంచుకు చేరుకున్న వాడిలా వున్నాడు.
    
    "నా ప్రయాణంలో హిమాలయాలలో 'తుంగనాధ్' అనే ప్రాంతంలో ప్రభాతస్వామి అనే సాధువుని కలిశాను. ఆయనకీ ఎనభై ఏళ్ళుంటాయి. ఆయన ద్వారా ప్రేతలోక విశేషాలు తెలుసుకున్నాను.    

    'శరీరం ధరించిన ప్రతి జీవి తప్పించుకోలేనిది మరణం సృష్టిలో ముందూ వెనకగా అందరూ తమ దేహాలు విడిచి లోకాంతర గతులు కావలసిందే చనిపోయాక మనుష్యులకు ప్రేతత్వం పొందటం, యమలోకానికి పోవటం వంటి దశలుంటాయి.