వజ్రాల పంజరం


    "సో......  ఇప్పుడు కంటినుంచి నీళ్లెలా వస్తాయో మీరు సైంటిఫిక్ గా చెబితే నేను పార్టీ యిస్తాను"

 

    "చెప్పలేకపోతే నేను పార్టీ యిస్తాను"

 

    "సరే" అనేశాడు అసంకల్పితంగా.

 

    అదే కేవలం అతడితో మరికొన్ని గంటలు గడపడానికి ఆమె తీసుకున్న అవకాశం.

 

    ఆ విషయం రుత్వికి తెలీదు.

 

    "ఓ. కే." నెమ్మదిగా అన్నాడు.

 

    "జవాబు చెప్పండి."

 

    అర నిముషం విరామం తరువాత అంది విజూష "మీరే చెప్పండి పార్టీ నేనిచ్చుకుంటాను.

 

    విజూష అడ్వాంటేజ్ తీసుకోగలిగిందని అర్దం చేసుకున్న రుత్వి చెప్పడం మొదలుపెట్టాడు మరోమార్గం లేనట్టుగా.


 
    "కళ్లలో నీళ్లు ఎప్పుడూ వుంటాయి. నిజానికి కళ్లను శుభ్రం చేసేది ఆ నీళ్లే.

 

    మనం  తరచూ రెప్పల్ని ఆడిస్తుంటాం... అప్పుడు పైరెప్పమీద వున్న నీరు కనుగ్రుడ్ల పైకి అక్కడనుండి ముక్కులోకి జారిపోతూ వుంటుంది."

 

    ఏకాగ్రతగా విజూష రుత్వినే గమనిస్తోంది.

 

    "మామూలుగా అయితే రెప్పలక్రిందనుండి ముక్కులోకి నీళ్లు పోవడానికి సమయం పడుతుంది.


 
    అదే దుఃఖం వచ్చినప్పుడు అంటే మానసికంగా బాగా ఎమోషన్ కు గురైనప్పుడు నీరు ఉదృతంగా మారుతుంది.
 


    అలాంటప్పుడు ఆ నీళ్లు ముక్కు రంద్రం ద్వారా లోనికి పోవటానికి సమయం చాలదు......... అంతే"క్షణం ఆగి అన్నాడు.

 

    "మరో దారిలేక కంటినుంచి నీళ్లు జలజలా బయటికి రాలుతాయి.

 

    జవాబు చెప్పిన రుత్వి విజూషవైపు చూస్తే ఆమెలో చలనం లేదు...

 

    ఇసుకలో దాగివున్న ప్రభంజనంలా ..కెరటంలో కనిపించని కడలిలా.....

 

    చినుకు బొట్టులో దాగివున్న వర్షంలా.. పిలుపులో నిక్షిప్తమైవున్న ఉరుములా అనిపించే రుత్విని గమనిస్తుందేతప్ప అతడు చెప్పడం పూర్తయ్యిందన్న విషయము గ్రహించగల స్పురణలో లేదామె.


 
    "హలో"

 

    పిలిచాడు రుత్వి.

 

     విజూషలో మార్పు కనిపించలేదు.

 

    "మిమ్మల్నే"

 

    సుతిమెత్తగా ఆమె చేతిని తాకాడు.

 

    అదిగో....

 

    అప్పుడు వాస్తవంలోకి వచ్చింది.

 

    అదికాదు...

 

    అతడి స్పర్శ మనసు కుబుసాన్ని రాల్చినట్టే అనిపించిందో లేక ఎల చిగులు వెదురు పొదలా నిన్నటిదాకా మిగిలిన గుండెని వేణువుగా మార్చి  -

 

    ఏ స్వరలయలో పాడినట్లే అనిపించిందో మరి....

 

    మృదువుగా అంది తల వంచుకుని

 

    "మీకు తెలీని విషయాలు వుండవా?"

 

    ఒక మనిషిలో యింత విజ్ఞానం ఆమె వూహకందనిది.

 

    "అంటే అంత ఇంప్రెస్ అయ్యారా?"

 

    అవునూ అనలేకపోయింది.

 

    ప్రపంచంలో తనకు తెలీని అర్దంకాని వింతల గురించి భయాల గురించి అతడ్ని అడిగి తెలుసుకోవాన్నంత ఆవేశం వచ్చింది.

 

    ఆ క్షణంలో ఆమెకు తన తండ్రి గుర్తుకు రావటం కాకతాళీయం కావచ్చు.

 

    కానీ ఎదిగిన తనపై ఆయన ఆంక్షలు  విధించటాన్ని  భరించలేనట్టచు రియాక్టయింది.

 

    "ఏమిటి?" రుత్వి నెమ్మదిగా అన్నాడు.

 

    "మీలో మీరే మాట్లాడుకుంటున్నారు."

 

     ఉలికిపాటుగా చూసింది.

 

    "షాక్ తినకండి.. మీ అందమైన పెదవులు కదలకపోయినా మీలో మీరు మాటాడుకుంటున్నారని నేను ఎలా అనగలిగాను?

 

    అంటే ప్రతి మనిషి మనసులో ఆలోచించడాన్ని తనలో తాను మాటాడుకోవటంగా సైకాలజీ శాస్త్రం చెబుతోంది కాబట్టి. "

 

    విజూష నేత్రాలు అరమోడ్పులయ్యాయి.

 

    రుత్వి తనను మనసు లోతులదాకా చదువుతున్నాడన్న విషయం అర్దంకాగానే...

 

    "మీరు ఒరిజినల్ గా డైనమిక్ అయ్యుండే  యిప్పుడిలా మూడీగా వుంటే మిమ్మల్ని నేను అపార్దం చేసుకోవాల్సి వుంటుంది అన్నాడు రుత్వి మళ్లీ.

 

    "అపార్దం చేసుకోవడమంటే దేనికి" అనలేదు విజూష అడగాలనుకుంది అంతే!

 

    "అంత వర్రీ కానవసరంలేదు.. నేనే చెబుతాను" టక్కున అన్నాడు.

 

    అప్రతిభురాలైంది విజూష.

 

    మరోసారి అతడు తన మనసుని చదివేశాడు.

 

    "అంటే....

 

    తన అంత సులభంగా దొరికిపోతోందా?

 

    "అవును మిస్ విజూషా."

 

    సంధ్యారాగిణిగా అనిపిస్తున్న ఆమె చెంపలపై కుంకుమపూలు పూయటాన్ని గమనిస్తూ అన్నాడు.

 

    "మీలాంటి అందమైన తెలివైన షార్ప్ గా వుండే ఓ అమ్మాయి మరో అబ్బాయి ముందు మౌనాన్ని ప్రదర్శించేది రెండే రెండు సందర్బాలలో."

 

    ఆ రెండు ఏమిటని ఆమె అడిగేటంతలో తానే చెప్పాడు.

 

    "ఒకటి... అబ్బాయిని ద్వేషించినప్పుడు - రెండు తనని వూహల సౌధంలోకి లాక్కుపోగల స్నేహార్ద్రతని ఆ అబ్బాయి ప్రదర్శించినప్పుడు" చెప్పడం ఆపాడు.