Read more!

ఆలింగనం


    లిల్లీ నన్ను చూసి ఒకటి రెండుసార్లు స్నేహంగా నవ్వింది. కానీ నేను నవ్వలేదు, నా మనస్సులో ఒకలాంటి మంట బయల్దేరింది. దానిని 'పాజిటివ్ నెస్' అంటారనీ అది చాలా భయంకరమైన అగ్ని అనీ ఆరోజుల్లో నాకు తెలీదు! ఇంట్లో ఉంటే శివా వాళ్ళింటికెళ్ళాలనిపించేది. వెళ్తే లిల్లీని చూడగానే ఇంటికి వచ్చేయ్యాలనిపించేది. వెళ్తే లిల్లీని చూడగానే ఇంటికి వచ్చెయ్యాలనిపించేది. గొంతులో ఏదో దాహం. మజ్జిగ తేటతో, మంచినీళ్ళతో తీరని దాహం. ఆ పిల్లకి ఏదో పరాభవం జరగాలనీ ఆ పిల్ల ఏడవాలనీ ఏవేవో అసందర్భపు కలలు! అలా అలా దేవుడ్ని కూడా ప్రార్థించేదాన్ని.

 

    ఓనాడు లిల్లీ లూనామీద వస్తూ దారిలో ఎద్దు అడ్డం వచ్చి తప్పించలేక జారి పడిపోయింది. అది చూసిన నేను హేళన చేస్తూ పెద్దగా నవ్వాను.

 

    శివ వచ్చి ఆమెని లేపాడు. ఆ తర్వాత నా దగ్గరకువచ్చి యీడ్చి చెంపమీద కొట్టాడు. అక్కడ అందరూ చూస్తుండగా అతనీ పని చేశాడు. నాకు బుస్సున ఉక్రోషం పొంగుకొచ్చింది. "ఛీ! జన్మలో నాతో మాట్లాడకు. ఆ చిప్పకట్టింగ్ దాంతోనే వూరేగు!" అని అరిచి మా ఇంటికి వెళ్ళిపోయాను.

 

    కొన్ని కొన్ని సంఘటనలు జరిగిపోయాకా, జరగకపోతే బావుండ్ను అనిపిస్తాయి. తుడిపేసే శక్తివుంటే తుడిచేసేవాళ్ళం. కానీ భగవంతుడు ఆ శక్తి ఇవ్వలేదు. లిల్లీకన్నా నాకే ఎక్కువ పరాభవం జరిగినట్లుగా తలుచుకుని నేను కుమిలిపోయాను. కొన్ని రోజులు అసలు వీధి మొహం చూడలేదు.

 

    శివ నేను తనతో మాట్లాడటంలేదన్న విషయం పట్టించుకోనట్లే తిరుగుతున్నాడు.

 

    లిల్లీ శివా వాళ్ళమ్మకి కూడా అప్పుడప్పుడూ బస్ స్టాప్ దగ్గర లిఫ్ట్ ఇస్తోంది. ఇది యింకా నరకంగా వుంది.

 

    "లిల్లీ...లిల్లీ..." అంటూ వాళ్ళ నాన్నగారు కూడా ఒకటే పిలుపులు.

 

    చొరవ ఉంటే లోకంలో అన్నీ సాధించుకోవచ్చు అని అప్పట్లోనే నాకు అర్థమయింది! నా పొడుగాటి జడన్నా, నేను ఎంతో ఇష్టంగా పెట్టుకునే చెమేలీ పువ్వులన్నా కూడా విసుగొచ్చేస్తోంది!

 

    పెద్దక్కకి మళ్ళీ పెళ్ళి చూపులయ్యాయి. ఈసారి పెద్దక్క నోరు మెదపలేదు. పెళ్ళికొడుకు బాగానే ఉన్నాడు. కట్నం అదీ దండిగానే అడిగారుట! తాతయ్య అత్తయ్యకి ఆదుకోవలసిందిగా ఉత్తరం రాశాడు. మొత్తానికి ముహూర్తాలు పెట్టేసుకున్నారు.

 

    చిన్నక్క రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాసులో పాసయింది. మెడిసిన్లో సీటు వచ్చింది. డబ్బెక్కడ్నించి తేవాలన్నదే పెద్ద సమస్య అయిపొయింది. నాన్నమాత్రం ఎలాగయినా అక్కని డాక్టర్ని చెయ్యాల్సిందేనన్నాడు.

 

    అమ్మ మాత్రం ముందు పెద్దక్క పెళ్ళి ముఖ్యం అంది. రెండింటికీ డబ్బు యెలా సర్దాలా అని యిద్దరూ తర్జన భర్జనలు పడ్డారు.

 

    అత్తయ్య చీపిరి తలవాడితోసహా వచ్చేసింది. తను పెళ్ళికి సహాయం చేస్తానని వాగ్దానం చేసింది.

 

    "అందుకే తోడబుట్టిన వాళ్ళు అన్నారు..." అని తాతయ్య కంటతడి పెట్టాడు.

 

    నాకు మాత్రం ఈ చీపిరి తలవాడితో ఏ జిగురుతోనో లోహంతోనో నాకు గట్టిగా ముడివేస్తున్నట్లు అనిపించింది. మెడమీద కత్తిపడే ముందు, మేత ముందు కడేస్తే దిక్కులు చూసే మేకలా వుంది నా పరిస్థితి!

 

    శివా టెన్త్ పాసయ్యాడు. అతన్ని వాళ్ళమ్మావాళ్ళు వేరే ఊళ్ళో హాస్టల్లో వేశారుట. ఒకరోజు గుడిదగ్గర కనిపించి "నీతో మాట్లాడాలి బావి దగ్గరకు రా!" అన్నాడు.

 

    "ఏం లిల్లీ ముద్దు పెట్టుకోనియ్యదా?" అన్నాను.

 

    శివ చాలా గంభీరంగా చూశాడు.

 

    "లిల్లీతో నాకు అలాంటి స్నేహంలేదు. నిజంగా నేను నిన్ను ప్రేమించాను" అన్నాడు.

 

    "కానీ నేను మా బావని పెళ్ళిచేసుకోవాలి" అన్నాను.

 

    "ఎవడు వాడు? ఆ బెదురు కళ్ళవాడేనా? వాణ్ణి చంపేస్తాను" అన్నాడు.

 

    నాకు చాలా ఆనందం వేసింది. "నిజంగా లిల్లీని ముద్దు పెట్టుకోలేదు కదూ!" అని అడిగాను.

 

    "అమ్మతోడు!" అన్నాక నమ్మకం కుదిరింది.

 

    మరునాడు బావి దగ్గరికి వెళ్ళి నువ్వుండలూ, పాకుండలూ ఇచ్చాను. శివ నన్ను దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. మొదటిసారిగా ఏదో 'జిల్'మన్నట్లు అనిపించింది. అతని మీసాలు నా పై పెదవికి గుచ్చుకున్నాయి. పెదవులు పరికిణీతో తుడుచుకోలేదు.

 

    శివ మరోసారి ముద్దు పెట్టుకొంటున్నప్పుడు నేను ఎప్పటిమాదిరిగా విదిలించుకోలేదు. ఇష్టంగానే పెదవులు అందించాను. బహుశా అది నా తొలిముద్దుగా అభివర్ణించవచ్చేమో! మనసు స్పందిస్తే కానీ చర్యకి పరమార్థం అనేది ఉండదుగా!

 

    ఆ దిగుడుబావి ఓ పూదోటగా మారిపోయినట్లూ గాలి అందమైన కీర్తనలు ఆలపిస్తున్నట్లూ మైమరిచా. నా జుట్టుని చెంపల మీద నుండి తొలగిస్తూ నా కళ్ళని ముద్దు పెట్టుకున్నాడు శివ.

 

    నందివర్ధనాలు కళ్ళమీద అద్దినట్లుగా అనిపించింది. నరాలు వీణ తీగల్లా పాడుతున్నట్లూ గాలి కదలడానికి బరువై పర్వతంలా మా మీద కూర్చున్నట్లూ ఉక్కిరి బిక్కిరయ్యాము. కోపం, ఉద్రేకం, ఈర్ష్యా, దుఃఖం సాధింపూ అన్నీ ఆలింగనాలై సేద తీర్చాయి.

 

    ఆ నిముషంలో అతనితో నేనూ వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఎలా? అతనే ఇంకా తన కాళ్ళమీద తను నిలబడలేదు. ఇద్దరం ఉత్తరాలు రాసుకోవాలనీ, ఎన్నెన్నో చెప్పుకోవాలనీ మాటలు తీసుకుని ఒకళ్ళని వదిలి ఒకళ్ళం వదలలేక ఇంటికొచ్చాం.

 

    ఆ రాత్రి వెన్నెల అరుగులపాలైపోతుంటే ఉస్సూరనిపించింది. దాన్ని వదలలేక కిటికీలో నుండి దోసిట్లో ధారగా పట్టుకుని తాగుతూ కూర్చున్నాను. ఆఖరి చుక్క వెళ్ళిపోతూ ఓ గువ్వల జంటని నిద్రలేపి వెళ్ళింది. అది కూత పెట్టుకుంటూ సూర్యుడ్ని మేల్కొలిపింది.'తూర్పు దిక్కు వేటగాడు సుల్తాను గోపురాన్ని వలవేసి పట్టాడు... మేలుకో ప్రేయసీ...మేలుకో' అనే పాట ఆ సమయంలో గుర్తొచ్చింది.