Read more!

జీవాత్మ


    అవతారవతరాతీతా నాగత్ వర్తమానాని దర్శయ దర్సీయ మమ
    
    భవిష్యం కథయ హ్రీం కర్ణపిశాచిని స్వాహా!!
    
    ఆ మంత్ర పఠనానికి దిక్కులు దద్దరిల్లిపోయాయి. శూన్యంలో కదలాడుతున్న నీడలు క్షణమాత్రంలో కనుమరుగైపోయాయి.
    
    ఏదో అదృశ్యశక్తి తోడ్కొని పోతున్నట్లు అప్పటిదాకా స్వైరవిహారం చేసిన హోరు క్రమక్రమంగా తగ్గిపోయింది. శ్మశాన నిశ్శబ్దం! జీవుల ఆఖరి మజిలీ అయిన శ్మశానంలోనే శ్మశాన నిశ్శబ్దం మనుషుల్ని భయ భ్రాంతులకు, చిత్తభ్రమలకూ గురిచేసే నిశ్శబ్దం విస్ఫోటనానికి ముందున్న ప్రశాంతత. తాంత్రికుడు ఎటూ కదలక కూర్చున్నాడు.
    
    క్షణాలు నిముషాలవుతున్నాయి. ఆకాశం నల్లని మేలిముసుగు కప్పుకున్నట్టుంది. తారలు, చంద్రుడు కానరాని లోకాలకు తరలిపోయి నట్లుంది బోసిపోయిన దీవి అదే సమయంలో మళ్ళీ హోరు మొదలైంది. దక్షిణంవైపు నుంచి, క్రమక్రమంగా దగ్గరై తాంత్రికుడి చుట్టూ తిరుగుతోంది. చెవి వొగ్గి వింటున్నట్లు ఒకవైపు వంగి తలాడించాడతను.
    
    మరుక్షణం లేచి నించున్నాడు. గాలి హోరు దక్షిణం వైపు నుంచి సద్దుమణిగిపోయింది. క్షణంలో వాతావరణం మామూలుగా అయిపోయింది. చరాలు చలించాయి. పక్షులు కువకువలాడాయి. తాంత్రికుడి నైరుతి దిక్కుగా సాగిపోయాడు.
    
                                                          *    *    *    *    *
    
    మహదేవ్ కెందుకో ఆ రాత్రి నిద్రపట్టడం లేదు! మనసు గోదావారి అలలపై ఊయలూగుతున్న భావన ఖాళీపాత్రలో జీవన మధువు నిండిపోయి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసే ఆనందం.
    
    కిటికీ సందులోంచి వెన్నెల ఆబగా వచ్చి చెవిలో గుసగుస లాడుతున్న తలంపు. తనువులోని అణువణువూ హిమబిందువుల్ని స్పృశించి నాట్యమాడే మయూరంలా నర్తిస్తున్న అనుభూతి!
    
    అధరాలు యిది అని చెప్పలేని ఆనంద సంకేతాలై దరహాస రేఖల్ని చిందిస్తున్న వేళ! హిమవర్షంలో తడిసి ముద్దయిన జంట కపోతాలు గుబురుకొమ్మల సందుల్లో పక్క పక్కనే ఒకదానికొకటి ఒత్తుకుని శరీరాల్ని నులివెచ్చగా మలుచుకుంటున్న అపురూప దృశ్యం. కలకాని ఇలలోనే కళ్ళెదుట కన్పిస్తూ కవ్విస్తున్నట్లుంది.
    
    "ఏమైందీ రోజు తనకి? ఎందుకింతగా మనసు స్పందిస్తోంది" అనుకున్నాడతను.
    
    అప్పుడు గుర్తొచ్చిందా.... కాదు కాదు.... మరచిపోతే కదా గుర్తు రావటానికి.... ఈ భావాలన్నింటికీ కారణం మనస్విని త్వరలో తన అర్ధభాగం కాబోతుందన్న ఒకే ఒక విషయానికి తన మనసు రాగరంజితమై సుస్వరాల్ని పలికిస్తోంది.
    
    కిటికీలోంచి బయటకు చూశాడతను. నీలాకాశం అతనివంకే అసూయగా చూస్తున్నట్లుంది. మనస్వినిలాంటి అందాలరాసిని పొందబోతున్న అతన్ని చూసి నీలాకాశమే కాదు... ముల్లోకాల్లోని పురుషులు సైతం అసూయ చెందకేం చేస్తారు?
    
    తననే చూస్తున్న మహదేవ్ చూపులతో చూపులు కలిపి ఏదో వస్తున్నట్టు శశాంకుడు మబ్బులమాటుకు ఒదిగిపోయాడు. తారలు వెలుగుతూ, ఆరుతూ అతనికి అభినందన సంకేతాలు పంపుతున్నాయి.
    
    పిల్ల తెమ్మర నైట్ క్వీన్ పరిమళాల్ని మోసుకొచ్చి అడ్వాన్స్ గ్రీటింగ్స్ అందజేస్తోంది. గాలికి కదలాడిన కొబ్బరాకు శుభాభివందనలందజేస్తోంది. మహదేవ్ కి మనస్విని పరిచయమైన వైనం గుర్తుకొచ్చింది.
    
    'ఆరోజు తను జూబ్లీహిల్స్ వైపు బైకుమీద వెళుతున్నాడు. జనం ఎవరి హడావిడిలో వాళ్ళు మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చినట్లు ఉరుకులు పరుగులతో జీవన సమరంలో ఈదులాడుతున్నారు. ఈ మనుషులకెందుకంత యాతన? ఎప్పుడూ కొంపలంటుకు పోయినట్టు ప్రవర్తిస్తారు?
    
    వీళ్ళలో ఎంతమంది మంచుతెరల బద్దకాన్ని వదిల్చి, ఉదయించే సూర్యుడ్ని చూసుంటారు? ఉహూ..... ఎవరూ చూసుండరు.... పోనీ సంజకెంజాయ వర్ణంలో మరునాడు మరింత ఉత్సాహాన్ని నింపుకు రావటానికి పడమర కొండల్లోకి జాలువారే సూర్యాస్తమయాన్ని చూసుంటారా? అదీ అనుమానమే.
    
    డబ్బు సంపాదన ధ్యేయంగా గొడ్డుల్లా ఓవర్ టైమ్ లు, సైడ్ బిజినెస్సులూ, చేస్తూ ఆదమరిచిపోయి గుర్రుపెడుతూ ప్రభాతవేళల పక్షుల కిలకిలరావాలూ, ఉషోదయాలూ చూడరు.
    
    ఫెళఫెళలాడే నోట్లకట్టలు కళ్ళముందు ఊహించుకుంటూ సాయం సంధ్య వేళల్లో మబ్బులకు హారాలై ఆహారాన్వేషణ ముగించుకుని తమ గూళ్ళకు చేరుకునే పక్షుల్నీ, సూర్యాస్తమయాన్నీ చూడరు.
    
    వీళ్ళకి జీవితంలో తామేం కోల్పోతున్నారో తెలియదు. పోనీ తెలియ చెబితే విన్పించుకుంటారా? అదీ లేదు' అనుకుంటూ మెల్లగా బైక్ మీద వెళుతుంటే నల్లని తారురోడ్డుమీద దర్శనమిచ్చింది అందంగా, పొందిగ్గా వున్న గులాబీ వర్ణపు లేడీస్ పర్స్!
    
    అతను బైక్ ఆపి దాన్ని అందుకుని జిప్ తీసి చూశాడు. కొన్ని వందరూపాయలు నోట్లూ, పదులు, అయిదులూ, కొంత చిల్లర. దాంతో పాటే కొన్ని విజిటింగ్ కార్డ్స్, బస్సు పాస్! తను బస్ పాస్ తెరచి చూశాడు. అందులోని ఫోటో చూసి తన హృదయం ఒక్కక్షణం ఆగి తిరిగి కొట్టుకోసాగింది.
    
    వివరాల కోసం చూశాడతను. ఆమె పేరు మనస్విని అనీ, ఉమెన్స్ హాస్టల్ లో వుంటుందని తెలిసింది. వెంటనే బైక్ స్టార్ట్ చేసి అడ్రసులో వున్న హాస్టల్ చేరుకున్నాడు.
    
    "కౌన్ చాహియే?" గూర్కా అడిగాడు. అతనికో యాభై ఏళ్ళుంటాయి.
    
    "మనస్విని" బదులిచ్చాడతను.

    "తోడీ సమయ్ మే ఆసీస్ సే ఆయేగి. ఆప్ కౌన్ హై?" సీరియస్ గా అడిగాడు.
    
    'తనకామె పర్స్, బస్ పాస్ దొరికాయని చెబితే అవి తీసుకుని తానందజేస్తానంటాడితను. అందులో డబ్బు గోల్ మాల్ చేసే అవకాశం వుంది. అదీగాకుండా ఇంత అందాల భరిణను చూడకుండా ఈ వెధవ చేతికి పర్సిచ్చి వెళ్ళిపోతే ఎలా? తనామెను చూడాలి.... తప్పకుండా చూడాలి' అనుకుని-
    
    "మై ఉన్ కీ కజిన్ హుఁ..." అని బదులిచ్చాడు.