Read more!

జీవాత్మ


    
    అరుదుగా అలా ఎవరికయినా, జరిగితే అప్పుడా విధంగా బ్రెయిన్ సెల్స్ నిద్రపోయి జ్ఞాపకశక్తి పోయిన వ్యక్తికి వచ్చిన వ్యాధిని 'అమ్మీసియా' అంటారు. చాలా కారణాలవల్ల మెదడులోని ఎలక్ట్రికల్ యాక్టివిటీలో పెర్ ఫెక్షన్ దెబ్బతింటుంది. అఫ్ కోర్స్ వాటిని సరిచేయవచ్చనుకోండి" అని అతను అంటుండగా డాక్టర్ టేబిల్ మీద ఫోన్ మోగింది.
    
    "ఏదో జరిగింది! సమ్ థింగ్ ఈజ్ రాంగ్" మనసులో అనుకున్నాడు అభిరాం.
    
    "హలో..." అన్నాడతను.
    
    ... ...
    
    "ఓ అరగంటలో వస్తాను"
    
    ... ...
    
    "కొంచెం పనుంది..."
    
    ... ...
    
    "ఎవరెవరు వచ్చారు?"

    ... ...
    
    "పృథ్వీ కూడానా? అతనికోసారి ఫోనివ్వు"
    
    ... ...
    
    "హాయ్ పృథ్వీ! బాగా చదువుతున్నావా?"
    
    ... ...
    
    "ఓ అరగంటలో అక్కడుంటాను" అని ఫోన్ క్రెడిల్ చేసి తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు.
    
    "... ఒక్కోసారి కొన్ని ఏక్సిడెంట్స్ లో తలకి బలమైన దెబ్బలు తగలడంవల్ల జ్ఞాపకశక్తి పోతుంది. తనేం చేస్తున్నాడో, తనెవరో కూడా తెలియదు వాళ్ళకి. తమ పేరు, వృత్తి, వయసు, తల్లిదండ్రుల్నీ, భార్యా పిల్లల్ని కూడా మరచిపోతారు.
    
    తామున్న ప్రదేశం ఏమిటో, అదే దేశమో కూడా గుర్తుండదు. దురదృష్టవశాత్తు దీనికి మందు కూడా లేదు.
    
    సినిమాల్లో చూపించినట్టు ఎక్కడైతే ముందు దెబ్బ తగిలిందో అక్కడే మళ్ళీ తగిలి తన పూర్వ స్మృతి రావాలే తప్ప- ఇదీ నూటికో, కోటికో ఒక్కరికే అలా జరుగుతుంది."
    
    అప్పుడు.... అతడు స్ఫురించింది అభిరాంకి! "మహదేవ్ తలకు తగిలిన బలమైన దెబ్బవల్ల అతనికి జ్ఞాపకశక్తి పోయిందా? అది డైరెక్టుగా చెప్పేస్తే తాము ఖంగారు పడతామని ఇంత ఇన్ డైరెక్టుగా చెబుతున్నాడా డాక్టర్" అనుకున్నాడతను.
    
    అలా అనుకోగానే చల్లని మంచి గదిలోకి తనని ఎవరో తోసేసినట్లు గజగజలాడిందతని శరీరం....
    
                                                           *    *    *    *    *
    
    సమయం ఉదయం ఎనిమిది గంటలు.... మనస్విని హాస్టల్ లోని గదిలో కిటికీగుండా సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆమె అప్పటికే కడిగిన ముత్యంలా తయారయింది.
    
    అడ్డం ముందుకు నడిచి బొట్టు పెట్టుకుంది. దాంతో ఆ బొట్టుకే అందం వచ్చింది. నల్లపూసలున్న తెల్ల కాటన్ శారీలో ఎల్లోరా శిల్పంలా వుందామె.
    
    రూమ్ కి తాళం వేసి బయటపడింది. నిన్నటి దిగులూ, ఆవేదన ఆమెలో ఇప్పుడు మచ్చుకైనా లేవు. వాటినుంచి ఆమెని తప్పించిన ఘనత మేడం ప్రమీలాదేవిదే. ఆ విషయం గుర్తొచ్చి వెళ్ళే ముందు మేడం గదికి నడిచి "ఆఫీసుకి వెళ్ళొస్తాను మేడం" అంది మనస్విని!
    
    "మంచిదమ్మా" ఏదో మేగజైన్ చదువుతున్న మేడం తృప్తిగా చూసి అంది.
    
    హాస్టల్ నుంచి బయటపడి బస్టాప్ వైపు నడుస్తోందామె. "మహదేవ్ తమ సంగతి వాళ్ళమ్మకి చెప్పే వుంటాడు. ఆమె అభ్యంతరం చెప్పదనీ తన ఇష్టమే ఆమె ఇష్టమని అతను చెప్పాడు. కాబట్టి వెంటనే అతను తిరిగొచ్చి ఇద్దరం దైవసన్నిధిలో పెళ్ళి చేసుకుంటా"నన్న ఊహలో ఆమె మోములో సిగ్గు దొంతరలు నాట్యమాడాయి.
    
    ఆమె కళ్ళు చుట్టుపక్కల పరిసరాలని గమనిస్తున్నాయి. ఎక్కడైనా మహదేవ్ కన్పిస్తాడని బస్టాప్ కి చేరుకున్నంతవరకూ ఆమె కళ్ళు చంద్రుని కోసం వెదుకుతున్న చకోరంలా అతన్ని వెదుకుతూనే వున్నాయి. అయినా అతను ఎక్కడా కన్పించలేదు.
    
    "బహుశా ఊర్నించి ఇంకా రాలేదేమో" అనుకుందామె. ఇంతలో ఆమె ఎక్కవలసిన బస్సు వచ్చింది. ఆమె బస్సు ఎక్కుతూ మళ్ళీ పరిసరాలని గమనించింది. మహదేవ్ జాడలేదు. రోజూ చూసే ఆమెని కండక్టర్ చిరునవ్వుతో పలకరించాడేకానీ టిక్కెట్ కానీ బస్ పాస్ కానీ అడగలేదు. బస్ ముందుకు సాగిపోతోంది ఆమె రోడ్డుమీదకి దృష్టి సారించింది.
    
    ఏ రోడ్డు మలుపులో నుంచయినా తన వలపుల చెలికాడు హఠాత్తుగా కనుల ముందు ప్రత్యక్షమౌతాడని, ఆమె ఆశ నిరాశే అయింది.
    
                                                                  *    *    *    *    *
    
    "ప్లీజ్ డాక్టర్! మహదేవ్ కేమయిందో సూటిగా చెప్పండి. ఉపోద్ఘాతాలొద్దు" వణుతుతున్న స్వరంతో అన్నాడు అభిరాం.
    
    వరప్రసాదం అతన్ని వారిస్తున్నట్టు    భుజం తట్టాడు.
    
    అప్పుడు మహదేవ్ పరిస్థితి గురించి అసలు విషయం చెబుతున్నట్టు అభిరాం వంక సూటిగా చూస్తూ అన్నాడు డాక్టర్.
    
    "మీ ఫ్రెండ్ తలకి తగిలిన గాయం వల్ల మెదడుకేమయినా డామేజ్ అయిందేమో అని బ్రెయిన్ స్కానింగ్ తీశాం. అందులో ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ పెర్ ఫెక్షన్ మీద మాక్కొంచెం అనుమానం వచ్చింది" అంటూ డ్రాయర్ లోంచి స్కానింగ్ రిపోర్టు బయటికి తీశాడు.