డెత్ సెంటెన్స్


    మెదడు ఆలోచిస్తున్నా హృదయం జరిగిన పరిణామాలకి పదే పదే పీడిస్తోంది. ఎవరితో పంచుకోగలడీ బాధ? సమాజంలో పేరున్న పెద్ద డాక్టరు! పేరున్న అందరిలాగే శత్రువులెప్పుడూ ఛాన్స్ కోసం పొంచి వుంటారు. తన కుటుంబం గురించి కొద్దిగా బయటికి పొక్కినా చిలవలూ పలువలుగా ప్రచారమవుతుంది, ఈ కారణాలని అడ్డుగా పెట్టుకొని కుటుంబం చిరాకులతో తను మానసికంగా స్థిరత్వం కోల్పోతున్నాడని కేసు ఫెయిలయినప్పుడల్లా దానికి కారణం అదేననీ ప్రచారం మొదలెడతారు. తనని తన స్థానాన్నించి పడగొట్టాలని ప్రయత్నిస్తారు. ఇది పోటీ ప్రపంచం! తప్పదు. అన్నీ తనలోనే ఇముడ్చుకోవాలి.

 

    సమాజంలో మనిషి స్థాయి పెరుగుతున్న కొద్దీ మానసికంగా ఒంటరివాడవుతాడట.

 

    ఇప్పుడది నిజమే అనిపిస్తోంది. ఎవరితోనూ చెప్పుకోలేని బాధ. తన బాధని తన స్థాయిలో అర్ధం చేసుకొని ఊరడించగల వ్యక్తులు ఎందరు?

 

    తనకు మిగిలింది గోపాలకృష్ణగారే! కానీ..... ఆయన ఎన్నో ఒడుదుడుకులని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కాస్త మానసిక విశ్రాంతితో గడుపుతున్నారు. తన బాధ ఆయనకి పరాయి బాధకాదు. మళ్ళీ ఇప్పుడు ఆయన్ని బాధించడం ఇష్టం లేదు.

 

    సలుపుతున్న మనసుకూ విశ్రాంతి కావాలన్నట్లు, ఆలోచనలతో అతనికెప్పుడో నిద్రపట్టింది!


                                                *    *    *    *    

    
    పాప ఆపరేషన్ సక్సెస్ అయిన శరత్ చంద్రకు అందుతున్న అభినందనల పరంపరని కిరణ్ గమనిస్తూనే వున్నాడు.

 

    రవళి కూడా కనిపించిన వాళ్ళందరికీ శరత్ సామర్ధ్యాన్ని పదే పదే వివరించడమూ చూస్తున్నాడు.

 

    జీవితంలో మొదటిసారిగా 'ఈ హాస్పిటల్లో తన స్థానం ఏమిటి' అన్న ఆలోచన కొత్తగా అతనికి కలిగింది. శరత్ చంద్ర కొస్తున్న గుర్తింపు చూసి అతని మనసు కుట్టింది.

 

    ఈ మధ్యకాలంలో అతను చేస్తున్న పెద్ద పెద్ద ఆపరేషన్ లు కూడా ఏ ప్రాబ్లం లేకుండా సక్సెస్ అవుతుండటం వల్ల అతనిమీద అతనికి చాలా నమ్మకం కుదిరింది కిరణ్ కి. ఆ నమ్మకం ఇప్పుడిప్పుడే శృతి మించడం మొదలైంది.

 

    ఎందుకీ శరత్ చంద్రని అందరూ ఇలా పొగుడుతున్నారు? నా కన్నా అతనేమంత గొప్పవాడు అతను చేసిన కేసులన్నీ నేను చేయగలను. పసిపిల్లలకు మాత్రం తాను చేయలేడా? పాప ఆపరేషన్ అసిస్ట్ చేస్తున్నప్పుడు చూశాడు కదా! అది పెద్ద కష్టమేం కాదు. ఛాన్సిస్తే తనూ చేయగలడు.

 

    గొప్ప విషయమేదో సాధించేసినట్లు అందరూ అతన్ని ఆకాశానికెత్తేస్తున్నారు అనుకున్నాడు.

 

    ఈ సక్సెస్ వెనక శరత్ పడిన తపన, వేదన, శ్రమ, కష్టం, నష్టం అన్నీ ఇప్పుడతనికి పూచికపుల్లలా తోస్తున్నాయి.

 

    ఈర్ష్య అతన్ని ప్రశాంతంగా వుండనీడం లేదు.


                                                    *    *    *    *

        
    రాజ్యం వార్డులో పనిచేసుకుంటోంది.

 

    కుట్టు కొద్దిగా చీము పట్టిన ఆపరేషన్ రోగికి డ్రెస్సింగ్ చేస్తోంది.

 

    రోగులందరినీ ఓసారి చూసి వెళదామని వచ్చాడు కిరణ్. రాజ్యం డ్రెస్సింగ్ చేస్తున్న కేసు దగ్గరకొచ్చి ఎర్రపుండు పడిన గాయాన్ని పరీక్షిస్తూ నిలబడ్డాడు. ఆ కేసు అతను చేసిందే.

 

    "ఇది మీ కేసేనండి. పుండు క్లోజైపోతోంది. రెండ్రోజుల్లో పేషెంట్ ని డిశ్చార్జి చెయ్యవచ్చు కదా!" అంది రాజ్యం  పుండుమీద ఆయింట్ మెంట్ రాస్తూ.

 

    "ఆ.... చెయ్యొచ్చు. నా కేసులన్నీ ఓకే. నో ప్రాబ్లమ్స్" రాజ్యాన్ని గర్వంగా చూస్తూ 'నా' అన్న చోట నొక్కి పలుకుతూ అన్నాడు.

 

    ఆపరేషన్ చేయడమనే చాలాస సాహసంతో కూడిన పనిని తాను చేస్తున్నట్టూ, అందరూ దాన్ని గుర్తించాలన్నట్లూ వుంటోంది కిరణ్ ప్రవర్తన.

 

    "ఊ.... అన్నీ సక్సెస్ కిరణ్ సాబ్! మొత్తానికి వి.ఎస్. పేరు సార్ధకం చేసుకున్నారు" అంది రాజ్యం నవ్వుతూ.

 

    కిరణ్ కి అర్ధం కాలేదు.

 

    "వి.ఎస్. ఏంటి" అన్నాడు ఆశ్చర్యంగా.

 

    "అదేసార్ వీర శివాజీ" కొంటెగా అంది.

 

    "ఛ.... ఊరుకో" అంటూ నవ్వేశాడు.

 

    "రొటీన్ కేసులుకాదు. మీరుకూడా ఏదన్నా సాధించాలి! మన శరత్ చంద్ర సార్ లాగా! సార్ గ్రేటండి. ఆయన దేవుడు! అట్లుండాలి డాక్టరంటే" అంది తన్మయంగా.

 

    ఆమె మాట వింటూన్ నవ్వుతున్న కిరణ్ మొహం ముడుచుకు పోయింది.

 

    "తర్వాత తీరిగ్గా పొగుడుకోవచ్చు త్వరగా పని కానివ్వండి" విసుక్కుంటున్నట్లు అక్కడి నుండి కదిలాడు.

 

    వెళ్ళిపోతున్న అతన్ని చిత్రంగా చూసింది రాజ్యం.


                              *    *    *    *

        
    కాలం గిర్రున తిరిగి పోతోంది. కదలుతున్న కాలంతో నిమిత్తం లేకుండా పనిలో నిమగ్నమై వుంటున్నాడు శరత్ చంద్ర.

 

    పాప కేసు సక్సెస్ అవడంతో మా హాస్పిటల్ కి ఎంతో గుర్తింపు రావడంవల్ల పిల్లల కేసులు చాలా రావడం మొదలుపెట్టాయి. సక్సెస్ చూపించిన శరత్ చంద్రని కాదనలేకపోతున్నాడు పరమేశ్వరం.

 

    అయితే తనకు తెలీకుండా ఏ కేసూ చేయకూడదని కండిషన్ పెట్టాడు. రిస్క్ తక్కువ అనుకున్న కేసులు సెలక్టు చేసి శరత్ చంద్రకి పంపించే బాధ్యతని కార్డియాలజీ డిపార్టుమెంట్ హెడ్ డాక్టర్ రఘుకి అప్పగించాడు. అంత ఫిల్టర్ చేస్తున్నా వచ్చే కేసుల పరంపరతో శరత్ చంద్ర బిజీగా వుంటున్నాడు. కేసులు పసిపిల్లలవడంవల్ల అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది. ఈ మధ్య పసిపిల్లల కేసులన్నీ కావాలని కిరణే అసిస్ట్ చేస్తున్నాడు.

 

    సాయంత్రం నాలుగవుతుండగా థియేటర్ లోంచి బయటపడ్డాడు శరత్ చంద్ర. కాఫీ తాగుతూ కాస్సేపు రిలాక్స్ డ్ గా కూర్చోవాలని పించింది. కాఫీ తెమ్మని బాయ్ కి చెప్పి తన గదిలోకెళ్ళి ఫ్యాన్ కింద రిలాక్స్ డ్ గా కూర్చున్నాడు. కాళ్ళు ముడిచి పాదాలు ఎదురుగా వున్న కుర్చీ మీద ఆన్చి తలని కూర్చున్న కుర్చీ అంచుమీద వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు.