Read more!

ఎండల్లో మేను మెరవాలంటే...



ఎండల్లో మేను మెరవాలంటే ...

 

ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పకర్లెద్దు. బయటకి వెళ్ళాలంటే చాలు మొహం ఎక్కడ పాడయిపోతుందో అనే భయం. అలాంటి భయాలు దూరం చేసి ఎండల్లో కూడా మీ మేనూ మెరిసిపోవాలంటే...... ఈ జ్యూస్ లు తాగి చూడండి. మన శరీరం ఎందుకు వెలిగిపోదో చూద్దాం.

ఎండాకాలం మామూలు ఆహారం కన్నా కూరగాయలు, ఆకుకూరలు తినటం మంచిదని అందరికి తెలుసు. వాటిలో కొన్ని మనకి ఎంతో మేలు చేస్తాయి అవేంటో చూద్దామా.


బేబీ కార్న్ జ్యూస్: బేబీ కార్న్ సూప్ తింటాం కాని జ్యూస్ ఎక్కువగా తాగం. కాని ఈ జ్యూస్ తాగటం వల్ల శరీరానికి ఎంతో నిగారింపు వస్తుంది. ఇందులో పీచు పదార్ధం ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది తాగటం వల్ల ఎక్కువ సేపు ఆకలి కూడా వెయ్యదు. డైటింగ్ చేసేవాళ్ళకి ఇది ఒక మంచి జ్యూస్. స్వీట్ కార్న్ లో కొన్ని పాలు కలిపి జ్యూస్ లా తయారుచేసుకుని తాగటం వల్ల ఎండకి కూడా చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.

 


టమాటా జ్యూస్: ఇది అందరి ఇళ్ళల్లో మనం కామన్ గా చూసే జ్యూస్.  ఇందులో శరీరంలోని కొవ్వుని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది. సన్నబడాలి అనుకునే వాళ్ళు ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి ఉండటం వల్ల చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.

గ్రీన్ పీస్ జ్యూస్: గ్రీన్ పీస్ కూరల్లో ఎంత రుచిగా ఉంటుందో, జ్యూస్ లా చేసినా అంతే రుచిగా ఉంటుంది. ఈ పచ్చి బఠాణిలో విటమిన్ K, ఇంకా విటమిన్ B6 సమృద్దిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. అంతేకాక యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఒక మంచి పౌష్టికాహారం కూడా. మరీ పచ్చి వాసన వస్తోందనిపిస్తే అందులో కాస్త ఉప్పు కలిపి తాగితే బాగుంటుంది.


కేరట్ జ్యూస్: విటమిన్ A పుష్కలంగా ఉండే కేరట్లు కళ్ళకి మాత్రమే కాదు చర్మం నిగారింపుకు కూడా బాగా ఉపయోగపడతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే కేరట్ జ్యూస్ తాగటం వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది. దీర్ఘకాలం పాటు చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే క్రమం తప్పకుండా కేరట్ జ్యూస్ తీసుకోవాలి. మీ వయసు కనపడనీయకుండా మిమల్ని యంగ్ గా కనిపించేలా చేస్తుంది.

 

పాలకూర జ్యూస్: పాలకూర ఎండాకాలంలో మనకి తల్లిలాంటి మేలు చేస్తుంది. విటమిన్ K పుష్కలంగా లభించే పాలకూర ఎముకులని దృడంగా ఉంచటంలో సహాయపడుతుంది. ఐరన్ కూడా ఎక్కువగా ఉండే ఈ పాలకూర తినటం వల్ల ఎర్ర రక్త కణాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి. ఈ పాలకూర జ్యూస్ వాసన నచ్చక తాగలేని వాళ్ళు ఇందులో ఒక కేరట్, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగచ్చు.

మన శరీరం మంచి నిగారింపు సంతరించుకుని వయసులో చిన్నగా కనిపించాలంటే ఇలాంటి జ్యూస్ లు ట్రై చేయక తప్పదు. అందంతో పాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. మరి మీరు?ట్రై చేయటానికి రెడీగా ఉన్నారా ?
 


..కళ్యాణి