డెత్ సెంటెన్స్


    "ఏమిటది?" అన్నాడు.

 

    అతని హావభావాలు గమనించకపోలేదు శరత్ చంద్ర. కానీ తప్పదు. పసిపిల్లల ప్రాణాలకి న్యాయం చేయడం కోసం తానేదైనా ఎదుర్కోక తప్పదు.

 

    "చైల్డ్ సర్జరీ గురించి అమెరికాలో డాక్టర్ రాజుతో కలిసి వర్క్ చేశాను. హార్ట్ లోని డిఫార్మిటీస్ రోజుల పాపలుగా ఉన్నప్పుడే సర్జరీ చేసి సరిచేయడం వల్ల రిజల్ట్ చాలా బాగుంటుందని అక్కడ రుజువైంది" డైరెక్టర్ మొహంలో కదిలే భావాలను చదవాలని క్షణం ఆగాడు.

 

    ఏ భావమూ వ్యక్తంకాని అదే గంభీరంతో "ఐసీ....!" అన్నాడు పరమేశ్వరం.

 

    "మనం కూడా చేస్తే రిజల్టు బాగుంటుందని ఆశగా ఉంది. డాక్టరు రాజుకి అసిస్ట్ చేయడం వల్ల ఇదివరకటి కన్నా నా పనితీరు మెరుగైంది. అందువల్ల ఆపరేషన్ లు సక్సెస్ అయ్యే అవకాశం పెరిగింది. మీరనుమతిస్తే కేసులు చెయ్యాలనుకుంటున్నాను" అన్నాడు శరత్ చంద్ర.

 

    అదివరకటి గొడవలనీ, అవమానాన్నీ దిగమింగుకొనైనా డైరెక్టర్ తో సౌమ్యంగా మాట్లాడి అంగీకారం పొందాలని, పిల్లల ప్రాణాలని కాపాడాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడతను.

 

    "ఇదివరకు మీకోసారి చెప్పాను కదా ఈ ఆలోచన మానుకోమని. దానివల్ల కలిగే నష్టం గురించి చర్చించడానికి మీటింగ్ కూడా పెట్టాల్సొచ్చింది. కదా! మళ్ళీ అదే విషయం మీరెందుకు అడుగుతున్నట్లు?"

 

    "సర్! ఇదివరకటి పరిస్థితి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు. నేను చేస్తే రిజల్టు బాగుంటుందని చెప్పగలను"

 

    "ఒక్క రిజల్టు గురించే కాదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఎదుర్కోడానికి ఇన్ స్టిట్యూట్ సిద్ధంగా లేదు. అయినా మీ కింత మొండితనం పనికిరాదు శరత్ చంద్రా. ఆ విషయమై ఎప్పుడో నిర్ణయం జరిగిపోయింది. అయామ్ సారీ, ఇంక దాన్ని గురించి వదిలేయండి" దృఢంగా వుంది పరమేశ్వరం గొంతు.

 

    హతాశుడయ్యాడు శరత్ చంద్ర.

 

    "సర్....! నేను దాని విషయమై అక్కడ చాలా శ్రమ తీసుకున్నాను. టైమునీ, శ్రమనీ వెచ్చించి పని నేర్చుకొని వచ్చాను. మరొక్కసారి ఆలోచించండి సర్!"

 

    చివర ప్రయత్నంగా అభ్యర్ధించాడు.

 

    "అయితే చాలా శ్రమ పడ్డానంటారు!" టేబిల్ మీదున్న ఫైలొకటి అందుకొని తిరగేస్తూ చాలా మామూలుగా అన్నాడు ఆయన.

 

    ఆ మాట తీరుచూసి తనకి అనుకూలంగా సమాధానం వస్తుందని ఆశ కలిగింది శరత్ కి.

 

    "అవును సార్! చాలా శ్రమపడ్డాను!" ముందుకి కొద్దిగా వంగి వినయంగా మళ్ళీ చెప్పాడు.

 

    "సో.... వ్వాట్? అలా చెయ్యమని మేం మిమ్మల్ని అడగలేదే? మేం మిమ్మల్ని అందుకోసం అమెరికా పంపించలేదే? మాకేం ప్రమేయం లేని విషయాన్ని పదేపదే అడిగి మమ్మల్నెందుకు విసిగిస్తున్నారు?"

 

    చాలా క్యాజువల్ గా అంటున్నట్లున్న పరమేశ్వరం మాటల్లో స్పష్టంగా వ్యక్తమవుతున్న వ్యంగ్యం, గడుచుదనం శరత్ చంద్రని కుదిపేశాయి.

 

    ఎంత అణుచుకున్నా ఆగనంత కోపం ముంచుకొచ్చింది.

 

    "అయితే మీరు పర్మిషన్ ఇవ్వనంటారు. అంతేగా?" అన్నాడు తీవ్రస్వరంతో.

 

    "యస్....!" నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చాడు పరమేశ్వరం.

 

    "నా దగ్గరికి వచ్చిన పసిపాపల్ని రిక్తహస్తాలు చూపి వెనక్కి పంపడమూ నా వల్లకాదు. ఆపరేషన్ చెయ్యడానికే నేనూ నిర్ణయించుకున్నాను" అంతే తీవ్రంగా సమాధానం ఇచ్చాడు శరత్ చంద్ర.

 

    "రూల్స్ ని అతిక్రమించినందుకు ఉద్యోగం వదులుకోవాల్సి వుంటుంది!" బెదిరింపుగా ఉంది పరమేశ్వరం స్వరం.

 

    "ఫరవాలేదు. నాకొచ్చే నష్టమేమీలేదు. ఇన్ స్టిట్యూట్ లో పనిచేయడం వల్ల నా విజ్ఞానాన్ని విస్తృత పరుచుకోడానికి వీలుంటుందని ఆశపడ్డాను. అందుకు వీలు కలిగినా, ఆ విజ్ఞానాన్ని ఉపయోగించే అవకాశం మీరు కలిగించడం లేదు. ఇక్కడ ఉండి నేను పెద్దగా సాధించేదేంలేనప్పుడు బయటికి వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు. నెలంతా కష్టపడితే మీరిచ్చేది అయిదువేలు, బయట ఒక్క కేసు చేసుకొంటే నాకొస్తుంది. కనీసం ఆర్ధిక బాధనుండయినా నా కుటుంబాన్ని రక్షించగలిగానన్న తృప్తి మిగులుతుంది!" అంటూ కుర్చీలోంచి లేచాడు శరత్ చంద్ర. కోపంతో అతని వళ్ళు ఉడికిపోతున్నట్లు సెగలు కక్కుతోంది.

 

    అతనలా మాట్లాడతాడని వూహించని పరమేశ్వరం కాస్త తెల్లబోయాడు. తెగేదాకా లాగుతున్నానేమోనని అతనికి కాస్త భయం కలిగింది. హాస్పిటల్ ప్రతిష్టా, ఆదాయమూ శరత్ చంద్ర మీద చాలా ఆధారపడి ఉన్నాయి. నిజంగా అతను వెళ్ళిపోవడమంటూ జరిగితే హాస్పిటల్ చాలా నష్టపోవాల్సి ఉంటుంది.

 

    వెంటనే మొహంలోని భావాలు మార్చేసి మొహం మీద నవ్వు పులుముకొని "కూల్ డౌన్ శరత్ చంద్రా! సమస్య తీవ్రత గురించి అలా అన్నానే గానీ నిజంగా మిమ్మల్ని రిజైన్ చెయ్యమని కాదుగదా! సరే మీ దగ్గిరకు వచ్చిన పేషెంట్స్ కి ఆపరేట్ చేయవచ్చును. కోపం తగ్గించుకోండి!" అన్నాడు విషయాన్ని తేలికచేసేస్తూ.

 

    అతనేమన్నాడో ఒక్కక్షణం అర్ధంకాలేదు శరత్ చంద్రకు. మెల్లగా అర్ధమైన తరువాత మొహం ప్రసన్నమైపోయింది.

 

    "ఓ.... కె....! థాంక్యూ సర్! వస్తాను. మళ్ళీ కలుస్తాను" అని పరమేశ్వరంతో చేయి కలిపి సెలవు తీసుకున్నాడు.

 

    స్ప్రింగ్ డోర్ తెరుచుకుని వెళ్ళిపోతున్న అతన్నే చూస్తూ, "ముళ్ళకంపలాంటి మనిషి అని ఊహించలేక గుడ్డ ఆరవేశాను. ఏం చేస్తాం. గుడ్డ చిరగకుండా జాగ్రత్తగా వెనక్కి తీసుకోవడమే మార్గం" అనుకున్నాడు పరమేశ్వరం.

 

    వెంటనే భగవంతంకి ఫోను కలిపి, పసిపిల్లల కేసులని శరత్ చంద్ర దాకా రాకుండా గట్టి ఏర్పాట్లు చూడమని చెప్పి, హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.

 

    అవును మరి, అతనిదాకా వస్తేనేగదా శరత్ చంద్ర ఆపరేషన్ చేయగలిగేది.


                                                  *    *    *    *

        
    రెండు రోజులు గడిచిపోయాయి.

 

    తనకీ కిరణ్ కీ మధ్య జరిగిన నిర్ణయం శరత్ చంద్రకి తెలియజేయాలని రవళికి ఆత్రంగా ఉంది. కానీ శరత్ చంద్ర ఒంటరిగా దొరకడం లేదు.

 

    పైగా ఈరోజు మరో విషయం తనదాకా వచ్చింది. ఆపరేషన్ అవసరమైన పసిపాప కేసొకటి వస్తే వాళ్ళని శరత్ చంద్రని కలువనీకుండా వెనక్కి పంపించారని, హాస్పిటల్లో ఉన్న రోగి తాలూకు మనుషులు ఆరోజే తనకి చెప్పారు.

 

    అందుకు బాధ్యుడు భగవంతం అనీ, చాలా పగడ్భందీగా వ్యవహారం జరుపుతున్నారని కూడా తెలిసింది. ఈ విషయాలన్నీ శరత్ చంద్రకి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా తెలియజేయాలని ఆమెకి ఆతృతగా ఉంది.