Read more!

జీవాత్మ


    
    గబుక్కున దాన్ని అందుకుని చూశాడు అభిరాం. ఏవో పిచ్చిగీతల్లా ఉన్నాయవి. ఏమీ అర్ధం కాలేదతనికి వరప్రసాదం కూడా వాటిని చూశాడు.
    
    "అవి మీకు అర్ధంకావు" అంటూ ఆ రిపోర్ట్ ని తిరిగి యధాస్థానంలో వుంచేశాడు.
    
    "అయినా ఫర్వాలేదు..... ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ లోని లోపాలు కరెక్టు చేయొచ్చు.... ఏదేమయినా అతనికి స్పృహ వస్తే కానీ ఏ విషయం నిర్ధారణ కాదు. ఒకవేళ అలా జరిగినా మీరు బెంబేలు పడకూడదనే మీకింత వివరంగా చెప్పాను..." అన్నాడు.
    
    అభిరాంకి మహదేవ్ కోలుకుంటున్నాడనే ఆనందం ఆవిరయి పోయి, అతను తన జ్ఞాపకశక్తిని పోగొట్టుకోబోతున్నాడేమో అన్న ఆదుర్దా అధికమయింది. నిస్త్రాణంగా సీటు వెనక్కి వాలిపోయాడు.
    
    వరప్రసాదం చేష్టలుడిగి చూస్తున్నాడు.
    
    "మహదేవ్ కి ఎప్పుడు స్పృహ రావచ్చు?" నూతిలోంచి వచ్చినట్లు వుంది అభిరాం స్వరం.
    
    "మోస్ట్ లీ ఇంకో ఫోర్ అవర్స్" అన్నాడు డాక్టర్.
    
    అప్పుడు సమయం ఉదయం తొమ్మిదవుతోంది. 'అంటే మధ్యాహ్నం ఒంటిగంటకి తెలుస్తుంది. మహదేవ్ విషయం' అనుకుని లేచి నిలబడ్డాడు అభిరాం.
    
    వరప్రసాదం కూడా లేచాడు.
    
    ఇద్దరూ బయటికి నడిచారు. అభిరాంలో శక్తంతా ఎవరో తోడేసి నట్లు నడవలేక నడుస్తున్నాడు.
    
    ఇద్దరూ విజిటర్స్ కోసం కేటాయించిన సోఫాలో రెక్కలు తెగిన పక్షుల్లా కూలబడిపోయారు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. సమయం మెల్లగా సాగుతూ ముందుకు నడుస్తోంది.
    
                                                              *    *    *    *    *
    
    ఆ రోజు ఆఫీసులో వర్క్ పెద్దగా లేకపోవటంతో మనస్విని చుట్టూ ఆలోచనా మేఘాలు ముసురుకుంటున్నాయి. కనులు తెరుచుకునే కలలు కంటున్నట్లు పరధ్యానంలో పడిపోయింది. యోగుల ధ్యానం కన్పించని భగవంతుడి కోసమైతే... యువతీ యువకుల పరధ్యానం కనిపించీ కనపడకుండా అల్లరిగా నువ్వే తమ ప్రియతముల కోసమే!
    
    ఎలా వున్నావ్ మహదేవ్....?
    
    అయ్యో! ఎందుకా నవ్వు మార్దవంగా?! నిన్నంతగా దిగులు నన్నెందుకు ఆవరించుకుందో?
    
    బహుశా నీ సామీప్యానికి దూరమయ్యాననా? కాదు కాదు... అలా అయితే నిన్ను విడిచి పక్షం రోజులు సముద్రతీరాలు, భీమిలీ అందాలు తిలకిస్తుండగా మామూలుగానే ఎందుకుంటాను?
    
    ఎందుకో తెలియదు నిన్న భలే దిగులేసింది. భలే ఏమిటీ.... చెడ్డ దిగులేసింది. దిగులును దిగంతాళ ఆవలకు తోలేందుకు నువ్వు లేవుగా...
    
    కానీ మా మేడం నాకా సమయంలో తోడయి దిగులు బాధతో ముకుళించుకుపోయిన మనసుని మాటల చేతులతో మళ్ళీ ఛెంగు ఛెంగున గెంతి గుబురు పొదలలో దోబూచులాడే లేడిపిల్లలా మలిచారు. నేనే కాదు. ఈ విషయంలో నా తరపున నువ్వూ థ్యాంక్స్ చెప్పాలి. నిన్ను మా గూర్ఖా ఆపేస్తాడా, ఎందుకాపేస్తాడు? నువ్వు నువ్వుగా రావుగా, నువ్వు నేనయి నేను నువ్వయి నువ్వూ నేనూ కలిసే వస్తాంగా ఆ పనిమీదే పయనమయి మళ్ళీ మరిచిపోయావా పప్పుసుద్దా....
    
    ఇంకా ఏం చేస్తున్నావ్ అక్కడ? నువ్వు లేక నీ జ్ఞాపకాల స్వరాలతో సమానంగా గొంతు కలిపి సేద దీరుతున్నాను. ఎందుకింత ఆలస్యం చేస్తున్నావ్? 'ఎడబాటు పెంచును మరింత ప్రియత్వం మనిద్దరి మధ్య పరస్పరం' అని సూత్రాలు వల్లించకు.
    
    బయటికి వచ్చి చూసిన ప్రతిసారీ కదులుతున్న మేఘం తన కదలిక లాపేసి కబుర్లంటే చెప్పమని...... వెంటపడి వేధిస్తోంది.
    
    పిల్ల తెమ్మెర చెవిలో చెలికాడి సంగతులేమయ్యాయని ఆట పట్టిస్తోంది. నీలాకాశం నావైపు చూసి నవ్వటమే మానేసింది. అదీ నీ జట్టు కట్టాకే! పొగడపూలు పరిహాసంగా నన్ను చూసి ఒకటే నవ్వులు.... చామంతి సన్నగా మూతి విరుపులు! ఎందుకు? మన ప్రణయాన్ని కథలు కథలుగా చెప్పలేదనా? ఎందుకు చెప్పాలి?

    మధ్య రాత్రిలో కలలో నువ్వు కబుర్లు కవ్వింతలలో నవ్విస్తుంటే ఎగెరెగిరిపడి మెలకువ వచ్చి చూస్తే నల్లని దివి మీద చెమ్కీల్లా మెరుస్తున్న తారలు నన్ను చూసి ఒకటే పకపకలు! ఇలలోనూ, కలలోనూ నీ జతగాడు అల్లరివాడేనా అని అడుగుతుంటే ఏమని జవాబు చెప్పను?
    
    అల్లరివాడే కానీ అల్లరిపనులు చేసేవాడు కాదని నీ మంచితనపు గుభాళింపుల ఘుమఘుమలు గురించి చెప్పనా?
    
    స్వచ్చతకు సరయిన చిరునామా నావాడే అని, నీ పేరే పలుమార్లు ఉచ్చరించనా?
    
    సముద్రపు అలలపై వెండి వెలుగు చూస్తున్నప్పుడూ కైలాసగిరి అందాలు తిలకిస్తున్నప్పుడూ కలగని ఆనందం నీ సాన్నిధ్యంలోనే నే పొందేది!
    
    మరలిరా నేస్తమా.... మరిక ఆగమాకు నాకు సుదూరంగా... నీ జంట లేక ఒంటరిగా గడుపుతున్న జీవితం ఓ గెలాక్సీలో నేనొక్కదాన్నే అయిన భావం మదిలో గుబులు పుట్టిస్తోంది....
    
    "ఠంగ్" ప్రియుడి తలపుల్లో తలుపులు మూసుకుని బందీ అయినట్టు బాహ్య ప్రపంచాన్ని మరిచిన మనస్వినిని జాగృతం చేస్తూ మోగింది వాల్ క్లాక్.
    
                                                          *    *    *    *    *
    
    ఒంటిగంటయినట్టు రిసెప్షనిస్ట్ వెనుక వాల్ క్లాక్ మోగటంతో అప్పటి వరకూ కళ్ళు మూసుకుని వున్న అభిరాం చటుక్కున కళ్ళు తెరిచాడు. ఎదురుగా వరప్రసాదం అప్పటికే లేచి నుంచుని డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి ఉద్యుక్తుడై వున్నాడు.
    
    ఒక్కక్షణం అభిరాంకి, వరప్రసాదం మీద జాలి, గౌరవం రెండూ కలిగాయి. 'ఎవరికి ఎవరం? చిన్నతనంలో తన అమ్మమ్మ దగ్గర పొందిన మురిపానికి తన స్నేహితుడి కోసం తనతోపాటూ నిద్రాహారాలు మానుకుంటున్నాడు' అనుకున్నాడు.