Read more!

వజ్రాల పంజరం


    ఏ ఉద్దేశ్యంతో అతడలాంటి స్టేట్ మెంటిచ్చినాగానీ రుత్వి రియాక్టయ్యాడు.

 

    "ఇది కంప్యూటర్ యుగం. వెంటనే నిర్ణయాలు తీసుకుంటే తప్ప వెనకబడిపోతాం అన్న ఫీలింగ్ ప్రేమకి వర్తిస్తుందేమో" మృదువుగా నవ్విన రుత్వి -

 

    "సారీ! ఈ విషయంలో నాకు అంతగా అనుభవంలేదు. కాబట్టి ఇంతకుమించి మాట్లాడలేను" అన్నాడు.


 
    విజూష ఉద్విగ్నంగా చూసింది.

 

    అంటే......

 

    సశ్య తనంతట తానుగా రుత్వి  వెంట పడుతూందేతప్ప ఆమెను రుత్వి కోరుకోవడంలేదనేగా..

 

    అతడన్నది నిజంగానే నిజమయితే.........

 

    వినీ వినిపించని ఏ మేళ తాళాలో గుండె గృహాంగణంలో ప్రతిధ్వనించి ఆమె ప్రతి సుమధుర మందహాసమయింది. కాలం పుక్కిటనుంచి రాలిపడుతున్న పూల సౌరభం సందిగ్దాల మంచుల్ని ప్రత్యూష పవనాల్లో చీల్చి దాచుకున్న ఏ భాష్ప బిందువుల  భాహ్యాన్నో విజూషకి వివరిస్తున్నట్టుగా వుంది.

 

    "అసలు అర్జంటుగా ఇలాంటి ప్రసక్తి ఎందుకు తీసుకొచ్చారో తెలియచేస్తే ఆనందిస్తాను" అన్నాడు ఇందాకటి విలేఖరిని చూస్తూ.

 

    "అమరం అనుకున్న ప్రేమనుంచి ఆత్మహత్యలదాకా వెళుతున్న అబ్బాయిలూ అమ్మాయిల గురించి మీకు తెలియచెప్పాలని" క్షణంపాటు సీరియస్ గా చూసి ఆ తరువాత చెప్పాడు.

 

    "నాకు తెలిసిన అమ్మాయి మొన్న గన్నేరుపప్పు తినేసింది. ఆ విషయం రెండుగంటలదాకా ఆ ఇంటి వాళ్లకి తెలీదు.

 

    ఆ అమ్మాయి ఇలా చేసింది పెద్దలు అంగీకరించని  ప్రేమకి దూరం కాలేకనే

 

    అయినా సకాలంలో ట్రీట్ మెంట్ దక్కితే బ్రతికేది అన్నారు డాక్టర్లు."

 

    ఇంతసేపూ ఆ విలేఖరి మాట్లాడింది ఆత్మహత్యా  ప్రయత్నాలు గురించి వాటికి అవసరమైన ప్రధమ చికిత్స గురించి అని బోధపడిన రుత్వి స్పందించాడు.

 

    వెంటనే - "నిజమే! కావాలని చాలాసార్లు అనుకోకుండా కొన్నిసార్లు విష పదార్దాల్ని విషాహారాన్ని తీసుకోవడం జరుగుతూ వుంటుంది. ఇందాక మీరు చెప్పిన  గన్నేరుపప్పు అన్న కావాలని  ఆ అమ్మాయి తీసుకున్నా కొందరు పసిపిల్లలు పల్లెటూళ్లలో తెలీకుండా తినేయడం, ప్రాణాలమీదికి తెచ్చుకోవడం జరుగుతుంది.

 

    అయితే అటువంటివాళ్లని హాస్పిటల్ లోకి తీసుకెళ్ళేముందు సకాలంలో ఫస్ట్ ఎయిడ్ చేస్తే తప్పకుండా బ్రతుకుతావను. నిజానికి అదేమంత కష్టంకూడాకాదు" నిట్టూర్పుగా ఆగాడు రుత్వి.

 

    క్రీగంట అతడ్ని గమనిస్తున్న విజూషని చూడలేదను.

 

    "గోరువెచ్చని నీళ్ళలో బాగా వుప్పు కలిపి బలవంతంగా తాగిస్తే వాంతిచేసుకుంటాడు.

 

    అలా విషం బయటకు విసర్జించబడుతుంది.

 

    ఆ తరువాత పెరుగులో పటికబెల్లం కలిపి ఎక్కువ మోతాదులో తినిపిస్తే ఇందాక మీరు చెప్పిన గన్నేరు విషం విరిగిపోతుంది. ఇదొక్కటే కాదు.

 

    కరక్కాయని నీళ్లలోనూరి ఆ రసాన్ని తాగించినా గన్నేరు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది"

 

    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.

 

    అనునిత్యమూ కళ్లముందు కనిపించే ప్రకృతి ప్రసాదించిన పదార్దాల గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు రుత్వి.
    


    అదికాదు.. ఇంగ్లీషు వైద్యానికి అమితంగా అలవాటుపడి ఆయుర్వేదాన్ని మరిచిన ఇప్పటి తత్వాల్ని ఆధునిక ప్రపంచానికి చెందిన ఓ కంప్యూటర్ ఇంజనీర్ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాడు.

 

    "రుత్విసాబ్" ఓ ఉర్దూ దినపత్రిక విలేకరి అన్నాడు.

 

    "మా అన్నయ్య తరచూ నల్లమందు తీసుకుంటాడు.  ఒక్కో రాత్రి కాస్త ఎక్కువ డోసులో వేసుకుని ఇంచుమించు ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. వాడిచేత అలవాటు మాన్పించలేకపోయాం. కనీసం ఎక్కువ డోసు తీసుకున్నప్పుడు వెంటనే చేయాల్సిన చికిత్స గురించి తెలియజేయండి."

 

    "సింపుల్" రుత్వి కేజువల్ గా చెప్పుకుపోయాడు.

 

    "అలాంటి పరిస్థితి ఎదురయినప్పుడు ముందు పేషెంట్ ని కూర్చోబెట్టి తలనిండా  ధారగా నీళ్లుపోయాలి. ఆ తరువాత ఇందాక నేను చెప్పినట్లు వాంతి చేయించాలి. స్వీట్స్ తినిపించాలి. వేడివేడిగా కాఫీగానీ టీగానీ తాగించాలి. ఇదొక్కటేకాదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేదాకా నిద్రపోకుండా మెలకువగా వుండేట్టు చూడాలి."

 

    "డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లేదాకా అంటున్నారు. ఇంత ఫస్ట్ ఎయిడ్ చేశాక నల్లమందు విషాన్ని తగ్గించటానికి ఆయుర్వేదంలో మందు లేదా?"

 

    రుత్వి వెంటనే జవాబు చెప్పలేదు. అరనిమిషం నిశ్శబ్దం. తరువాత అన్నాడు.

 

    "ఆయుర్వేదంలో ప్రతి వ్యాధికీ మందు వుంది. అయితే కొన్ని ఎమర్జెన్సీ కేసుల్లో వైద్యుడి పర్యవేక్షణ చాలా అవసరమని చెప్పడం నా ఉద్దేశ్యం. మామూలు దగ్గు, జ్వరంలాంటి కేసులకి ప్రాణహాని జరిగే ప్రమాదకరమైన పరిస్థితుల్లో వున్న కేసులకీ వ్యత్యాసం వుందిగా."

 

    క్షణం ఆగాడు రుత్వి.

 

    "వెల్ ..నల్లమందులాంటి విషానికి ఆయుర్వేదంలో మందులేదా అని యిందాక మీరడిగారు. వుంది... అల్లంరసంగానీ లేదా శొంఠిరసం గానీ   అదీకాకపోతే ఇంగువవేసిన  నీళ్లు తాగించిగాని విషప్రభావం  నుంచి రోగిని పూర్తిగా కాపాడొచ్చు"

 

    "ఇంత సీరియస్ గా సాగుతున్న చర్చలో ఈ సిల్లీ క్వశ్చన్ ఏమిటీ అని మీరనుకోకపోతే "సంశయంగా పదిసెకండ్లు" ఆగిన ఓ యువకుడు అడిగాడు.

 

    "ఒక్కోసారి లిక్కర్ ఎక్కువ డోస్ కావటంతో చాలా ఆందోళనగా వుంటుంది. అలాంటప్పుడు ఆ మైకంలోనుంచి అర్జంటుగా బయటపడాలంటే?"

 

    "నెయ్యిలో పంచదార వేసుకుని తింటే చాలు ఎంత మైకంలో నుంచైనా మామూలు స్థితికి రావచ్చు."

 

    రుత్వి జవాబు పూర్తి కానేలేదు... ఓ విలేఖరి జోక్యం చేసుకున్నాడు.

 

    "రుత్విగారూ! లిక్కర్ విషయంలో మీరిలాంటి టిప్స్ ఇచ్చేకన్నా అసలు మందు కొట్టకురా సన్నాసీ అని మా వాడికి గడ్డిపెడితే బెటరనుకుంటాను"

 

    "గడ్డిపెడితే అని ఇంత చులకనగా అనడం బాగోలేదు మాస్టారూ" రుత్వికూడా  అంతే జోవియల్ గా అన్నాడు.

 

    "ఆయుర్వేదానికి సంబంధించి ప్రముఖమైన పంచ ఔషధుల్లో గడ్డి ఒకటి.

 

    దిగ్ర్బాంతిగా  చూశారంతా.