Read more!

డెత్ సెంటెన్స్


    "రేపు మనకు తీరిక దొరికే అవకాశం లేదు. నెక్ట్స్ సండే...." అంది.

 

    "సరే రవళీ! కానీ ఒకటి మాత్రం నిజం. మీరు కాదంటే ఆ శూన్యాన్ని భరించడం నాకూ చాలా కష్టం. నా పట్ల పాజిటివ్ గా ఆలోచించమని అభ్యర్ధిస్తున్నాను" అన్నాడు.

 

    ఏం చెప్పాలో అర్ధం కాక చిరునవ్వు నవ్వింది.

 

    "హలో.... ఇక్కడున్నారా? మీ కోసమే వెదుక్కొంటు వస్తున్నాను" అంటూ అప్పుడే ఆ గదిలోకి శరత్ చంద్ర అడుగు పెట్టాడు.

 

    ఒక్కసారిగా ట్రాన్స్ లోంచి బయట పడినట్లు ఇద్దరూ "హల్లో.... సర్! మేం మీ కోసమే ఎదురుచూస్తున్నాం! హౌ ఆర్యూ సర్?" అంటూ లేచి చెయ్యిజాపుతూ ఎదురు వెళఅళారు.

 

    షేక్ హాండ్లయ్యాక చాలా ఉత్సాహంతో రవళిని మాట్లాడనీకుండా తను చేసిన కేసులన్నీ ఏకరువుపెట్టాడు కిరణ్. ఎంతో సంతోషించాడు శరత్.

 

    అక్కడి విషయాలు వాళ్ళకి వివరిస్తూ ఇక్కడి రోగుల గురించి తెలుసుకుంటూ పరస్పరం అనుభవాలని పంచుకుంటుండగా ఆ సాయంత్రము ఇట్టే గడిచిపోయింది ముగ్గురికీ.


                             *    *    *    *

        
    ఆరున్నర అవుతుండగా ఇల్లు చేరాడు శరత్ చంద్ర. పడక గదిలో దూరం జరిగిన మంచాలను చూసి చివుక్కుమంది అతని మనసు.

 

    ఒక్కసారిగా మనసంతా దిగులు ఆవహించింది. శరత్ చంద్రకి. ఇండియాలో అడుగు పెట్టేంత వరకూ ఈ పరిణామాన్ని అసలు ఊహించలేక పోయాడు.

 

    ఇదంతా ఎందుకు జరుగుతుందో, కొత్తగా వచ్చిన ప్రత్యేకమైన కారణం ఏమిటో అర్ధం కాకపోయినా మూలకారణం మాత్రం తనని శంకిస్తున్న నీలిమ మనసని అతనికి తెలుసు!

 

    తాను వెళ్ళేప్పుడు ఆమె ఇచ్చిన ఆత్మీయమైన వీడ్కోలుకీ, తిరిగి వచ్చినప్పటి ఆహ్వానానికీ ఎంత తేడా అని అనుకున్నాడు.

 

    అక్కడ - అమెరికాలో తీరిక దొరకని పని వత్తిడిలో కూడా మనసు పొరల్లో నీలిమ కదలాడుతుండేది. ఎలా ఉందో పిచ్చి తల్లి? తనంటే విపరీతమైన ఇష్టం ఉంది. ఇద్దరూ కలిసి గడిపేకాలం తక్కువయిపోయినకొద్దీ, టెన్షన్ లతో పని వత్తిడిలో ఆమెతో గడిపిన కొద్ది సమయం కూడా ఆహ్లాదంగా గడపలేకపోయాడు.

 

    అంతకుముందు తాను ఆమె మీద చూపించిన అమితమైన ప్రేమ అంతస్థాయిలో చూపించలేకపోయాడుయ తన ప్రేమనంతా ఎవరో కొల్లగొట్టుకుపోతున్నారనే అనుమాన బీజానికి అది తావునిచ్చింది. అదే సమయాన తాను నీలిమని 'రవళీ' అని సంబోధించడంతో అనుమానానికి ఆధారం దొరికినట్లయింది.

 

    ఆవసరమైన ఆలోచనలతో మనసంతా పాడుచేసుకొంటోంది పిచ్చి తల్లి అనుకున్నాడు చాలాసార్లు.

 

    పనుల వత్తిడి ఎప్పుడూ వుండేదే. ఇండియా వెళ్ళాక ఏదో విధంగా ఓ వారంరోజులు లీవు పెట్టి నీలమనీ తీసుకొని దూరంగా వెళ్ళి హాయిగా గడిపిరావాలి. అలిగిన మనసుని లాలించుకోవాలి. నేను తన వాడినేనని బుజ్జగించుకోవాలి!" అనుకున్నాడు. వచ్చేముందు ఎన్నెన్నో ఊహలూ ఆలోచనలూ చేశాడు.

 

    తన పట్ల కాస్త మెత్తబడిన నీలిమ మనసు ఈ కొద్దికాల వియోగంలో తనకోసం తపిస్తుంటుందని ఎంతెంతో ఆశపడ్డాడు. కానీ.... కానీ.... అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితంతా తారుమారై మనసుని గాయపరుస్తోంది!

 

    ఏదో.... అవసరమైన కొన్ని మాటలు తప్ప భర్తతో ఆ పూట కూడా పెద్దగా మాట్లాడలేదు నీలిమ.

 

    భోజనాలు చేస్తున్నప్పుడు వడ్డించే విషయంలోనూ, పిల్లల గురించీ ఇంటి గురించీ అతనడుగుతున్న ప్రశ్నలకి సమాధానంగానో పొడిపొడిగా సమాధానం చెప్పింది.

 

    పిల్లలకి తండ్రి తెచ్చిన ఆట వస్తువులతో కొత్తదనం తీరింది. మువ్వ ఆ పూటంతా తండ్రిని ఆనుకొని ఆనుకొని తిరిగింది. ఒడిలో చేరి బోలెడు కబుర్లు చెప్పింది.

 

    "నువ్వక్కడేం చేసేవాడివి? ఎవరింట్లో పడుకొనేవాడివి? నీకు అన్నం ఎవరు పెట్టేవాళ్ళు?" లాంటి ప్రశ్నలతో అక్కడి విశేషాలన్నీ అడిగి అడిగి చెప్పించుకుంది. ఆ రాత్రికి తండ్రి దగ్గరే తననీ పడుకోనీయాలని మాట తీసుకుంది.

 

    జీవన్ దూరంగానే ఉండి అన్నీ వింటున్నాడు. తండ్రి అక్కడి నుండీ తెచ్చిన కొత్త ఆటలని అర్ధం చేసుకొని ఒకసారి ఆడుకొని ప్రక్కన పెట్టేశాడు, కొత్త ఆటల గురించి తెలుసుకొంటున్న ఉత్సాహం తప్ప తండ్రి తెచ్చాడన్న ఆనందంగానీ, తనకోసం వస్తువులు తెచ్చాడన్న సంతోషంగానీ వాడి మొహంలో కనిపించకపోవడం శరత్ చంద్ర గమనించాడు.

 

    బహుశః ఉదయం తమ మధ్య జరిగిన సంభాషణ విన్నాడేమో అనిపించింది. నీలిమ ముభావంగా ఉండటం కూడా వాడి డల్ నెస్ కి కారణమేమో అనిపించి, మనసంతా వాడిపట్ల జాలితో నిండిపోయింది.

 

    "జీవూ! ఇలారా, నా దగ్గర కూర్చో!" అన్నాడు.

 

    ఆ గొంతులో ఉట్టిపడుతున్న అనురాగానికి కదిలినట్లు వెంటనే వచ్చి తండ్రి పక్కనే కూర్చున్నాడు జీవన్.

 

    కొడుకు భుజమ్మీద చెయ్యేసి హత్తుకొని కూర్చొని అమెరికాలో తీసిన ఫోటోలను చూపిస్తూ, ఫోటోల్లోని పరిసరాలని గురించి, అక్కడ తనకెదురయిన విశేషాల గురించీ చెబుతూ కొడుకులో ఉత్సాహం నింపడానికి ప్రయత్నించాడు శరత్ చంద్ర.

 

    ఫోటోలు చూడటం పూర్తయ్యేటప్పటికి జీవన్ మొహంలో కొద్ది మార్పు చోటుచేసుకుంది.

 

    ఆ రాత్రి తండ్రి పక్కలో పడుకొని కథలు చెప్పించుకొంటూ, జోకొట్టించుకొంటూ హాయిగా నిద్రపోయింది మువ్వ. ఆ పూట దొరకక.... దొరకక దొరికిన అపురూపంలా అనిపిస్తున్నాడు తండ్రి.

 

    కూతురు నిద్రలోకి జారుకున్నా, నిద్రకళ్ళ మీద బరువుగా రెప్పలు వాల్చేముందు -

 

    "డాడీ! మమ్మీ మంచం దూరంగా వేసుకొందేమిటీ?" అని అడిగిన ప్రశ్న అతని కళ్ళముందు ప్రశ్నార్ధకంగా నిలిచేవుంది.

 

    "దగ్గరగా పడుకొంటే నేనూరికే ఫోనులో మాట్లాడుతుంటానుగా, నిద్రపట్టదనీ...." అని అప్పటికే సమాధానం చెప్పాడు.

 

    "నాకు నిద్రవస్తోంది, పడుకుంటాను" అని జీవన్ తన గదిలోకి వెళ్ళి పడుకొని అప్పటికి చాలాసేపు అయింది.

 

    "నీలూ! నీ కోసమని చీర తెచ్చాను. తీసుకో-" అన్నాడు దగ్గరకెళ్ళి.

 

    తన మంచంమ్మీద పడుకొని సాలోచనగా ఎటోచూస్తున్న నీలిమ తలతిప్పి చూసింది. అతని చేతిలోని చీర ప్యాకెట్ వైపూ, అతని మొహంలోకి ఒక్క క్షణం మార్చి చూసి....,

 

    "ఆ బహుమతులు నాకెందుకులే.... ఇవ్వవలసిన వాళ్ళకీ.... వాటి కోసం ఎదురుచూసే వాళ్ళకీ ఇస్తే సంతోషిస్తారు" అంది ఆమె గొంతులో కాఠిన్యం ఇమిడి ఉంది.