నా జీవితం నీ కౌగిలిలో


    "ఆ చాప ఇలా విసిరెయ్...." అని ఏడుపు ముఖంతో అన్నాడు ఆంజనేయులు.

 

    "మరి నాకో... నేను కిందపడుకోలేను... అలవాటు లేదు. మీలా నేను కిందపడుకుని వచ్చిందాన్ని కాను.. పట్టుపరుపుల మీద పడుకుని వచ్చిందాన్ని.. ఇదిగో. ఈ తువ్వాలు వేసుకొని పడుకోండి..." అని ఓ తువ్వాలు విసిరేసి తలుపు గడియ పెట్టేసింది.

 

    "ఏంటీ... మాటి మాటికీ... ఆ మెట్లెక్కుతున్నారు..." అవుట్ హౌస్ నుంచి వస్తున్న భర్తని అడిగింది భువనేశ్వరి.

 

    "ఇద్దరికీ కొత్తే గదా... ఆంజనేయుల్తో కొంచెం మంచీ చెడ్డా మాట్లాడి వస్తున్నాను..." చుట్ట వెలిగిస్తూ అన్నాడు భుజంగరావు.

 

    "ఏవిటో ఆ మంచీ చెడ్డా..." రాత్రిపూట అటుపక్క వెళ్ళి, ఆ కొత్త దంపతుల్ని 'డిస్ట్రబ్' చేశాడని భర్తమీద కోపంగా ఉంది భువనేశ్వరికి.

 

    "ఆ మంచీ చెడ్డా నీతో చెప్పాలా? అయితే రా... గదిలో కెళ్తున్నాను అక్కడికి రా..." నవ్వుతూ అన్నాడు భుజంగరావు.

 

    "సిగ్గులేకపోతే సరి..." చీకట్లో సిగ్గుపడుతూ అంది భువనేశ్వరి.

 

    ఆవిడ చెయ్యిపట్టుకుని లాగాడు భుజంగరావు. అదే సమయంలో.

 

    గోడ అవతల నుంచి ఆ దృశ్యాన్ని ఓ రెండు కళ్ళు గమనించడం, వాళ్ళిద్దరూ గమనించలేదు.

 

    అవుట్ హౌస్ లో పడుకున్న ఆంజనేయులికి చాలాసేపు నిద్రపట్టలేదు.

 

    తరణి అన్న మాటలే అతనికి మాటి మాటికీ జ్ఞాపకం వస్తున్నాయి.

 

    పట్టు పరుపు మీద పడుకుని వచ్చిందాన్ని....

 

    పట్టు పరుపు మీద పడుకుని వచ్చిందాన్ని....

 

    ఎలాగైనా తరణిని 'ట్రాప్'లో వేసి అసలు 'తనెవరో' నిజాన్ని కనుక్కోవాలి?

 

    నిర్ణయించుకున్నాడు ఆంజనేయులు. ఎంతకీ నిద్రపట్టకపోవడంతో సిటీ బస్సుని జ్ఞాపకం చేసుకున్నాడు.

 

    'టక్'మని వడగళ్ళవానలా ఆంజనేయుల కళ్ళమీద నిద్ర దబదబా కురిసేసింది.


                             *    *    *    *


    మధ్యాహ్నం మూడు గంటల సమయం....    

 

    నిద్ర రాక, హాల్లో వాలుకుర్చీలో తీవ్రంగా కాళ్ళూపుకుంటూ కూర్చున్నాడు భుజంగరావు.

 

    ఆ సమయంలో ఆదరా బాదరాగా ప్రవేశించాడు డిటెక్టివ్ కమ్ లాయర్ జిగురుమూర్తి.

 

    "ఏవయ్యా... ఏంటీ విశేషాలు...?"

 

    "గత వారం రోజులుగా మీరప్పగించిన పని మీదే వున్నాను సార్..."

 

    "ఏమైనా కొత్త న్యూస్ వుందా...?" ఆసక్తిగా అడిగాడు భుజంగరావు.

 

    " వారం రోజుల రిపోర్ట్ ఒకసారి వినండి. అప్పలరాజు సప్లయింగ్ వరల్డ్ లో ఆంజనేయులు పి.ఆర్.ఓ.గా పని చేస్తున్నాడు. అదే ఆఫీసులో మేరీ మాథ్యూస్ అనే అమ్మాయి పని చేస్తోంది. ఆ అమ్మాయికి ఆంజనేయులంటే వల్ల మాలిన ప్రేమ.

 

    చాలా ఆసక్తికరమైన సంగతి మొన్నరాత్రి జరిగింది. రాత్రి ఎనిమిది గంటలు, తొమ్మిది గంటల మధ్య ఈ మెట్ల మీద ఇద్దరు వ్యక్తులు చాలా సన్నిహితంగా ఉండడం, చూడడం జరిగింది. ఆ వ్యక్తులు ఆ ఆంజనేయులు, ఆ తరణి కావచ్చని నా డిటెక్టివ్ 'బుర్ర' అభిప్రాయపడుతోంది" చెప్పడం ఆపాడు జిగురుమూర్తి.

 

    భుజంగరావు తేలు కుట్టిన దొంగలా అయ్యాడు.

 

    "నా బొందలా వుంది నీ డిటెక్షన్... ఇలాంటి చచ్చు పుచ్చు వార్తలన్నీ కూడగట్టుకొని వచ్చి చెప్పావంటే, ఇక ఈ ఇంట్లోకి రానివ్వను... తెల్సిందా..." చికాకు పడ్డాడు భుజంగరావు.

 

    "ఏం సార్... అతి విలువైన సమాచారం ఇస్తే, ఇలా అనేశారు..." నీరసంగా అన్నాడు జిగురుమూర్తి.

 

    "ఏదయ్యా... నీ విలువైన సమాచారం..."

 

    "మొత్తం వదిలెయ్యండి... మొన్నరాత్రి... చీకట్లో... ఆ ఇద్దరూ... ఇది అతి విలువైన ఇన్ ఫర్ మేషన్ కాదా సర్..."

 

    "కాదు... ఎందుకంటే... ఆ రోజు, ఆ సమయంలో, అక్కడున్నది మహారాజశ్రీ నేనూను, నా భార్యానూ... అర్ధమైందా..."

 

    "అయ్యాబాబోయ్... పొరపాటు జరిగిపోయింది నాయనోయ్... క్షమించండి సర్... మీరా సార్... మీరు ఆ సమయంలో అక్కడ?" నీళ్ళు నమిలాడు జిగురుమూర్తి.

 

    "చూడు జిగురూ... ఆ ఆంజనేయులూ, ఆ అమ్మాయీ భార్యా భార్తలా కాదా అనే విషయం తేల్చడంతో పాటు, ఆ అమ్మాయి ఎవరు అన్న విషయం కూడా పరిశోధించమని చెప్తున్నాను... తెల్సిందా... పరిశోధన పక్కాగా ఉండాలి... అర్ధమైందా... ఇప్పుడులా కాదు... సాయంత్రం నీ అసిస్టెంట్ ని పంపు... అడ్వాన్స్ ఇస్తాను..."

 

    "అలాగే సార్... ఈసారి చూడండి... షెర్లాక్ హోమ్స్ బాబులా, కరమ్ చంద్ లో పంకజ్ కపూర్ డాడీలా, జేమ్స్ బాండ్ సినిమాల్లో రోగర్ మూర్ లా..."

 

    "ఆపు... నీకు తెల్సిన దిక్కుమాలిన పేర్లన్నీ అప్పగించక..."

 

    సగంలో కట్ చేసినందుకు ఇబ్బందిగా 'ఫీలయినా' అంతలోనే దానిని అధిగమించి, "చూస్తుండండి... ఇప్పట్నించే నా పరిశోధనకు శ్రీకారం చుడతాను..." అనుకుంటూ అవుట్ హౌస్ వెనక్కి వెళ్లాడు జిగురుమూర్తి మెల్లగా.


                                             *    *    *    *


    ఆరోజు ఆదివారం.

 

    "ఈవేళ ఎలాగైనా తరణి గుట్టు రట్టు చెయ్యాలి..." నిశ్చయించుకున్నాడు ఆంజనేయులు.

 

    "ఈవేళ ఆంటీని, అంకుల్ని మధ్యాహ్నం లంచ్ కి పిలిస్తే ఎలా వుంటుంది...?"

 

    బియ్యం ఏరుతున్న తరణి తలెత్తి చూసి-

 

    "పిలవండి... మంచిదే" అంది.

 

    "ఒరే అంజిగా... పిలవక, పిలవక ఇద్దర్నీ భోజనాలకి పిలుస్తున్నావ్ కదా... బిర్యానీ, గిర్యానీ, కీమా, ప్రాణ్ పకోడీ ఇలాంటి హడావుడి చేస్తే బాగుంటుందిరా..." సలహా ఇచ్చాడు అనందం.

 

    "ఆ బిర్యానీలు, కీమాలు, ప్రాణ్ పకోడలు నాకు చెయ్యడం రాడు... అన్నం, రసం, ఏదో కాయగూర... అవ్వే నాకొచ్చు..." చెప్పింది తరణి.

 

    "ఇంట్లో సెటిలై పోవడం వచ్చు కదా... చిట్టి తల్లీ..."