Read more!

జీవాత్మ


    యోగి అయినవాడు ఈ సత్యం తెలుసుకునే మానవజీవితం కేవలం సాధనకే వుపయోగించి, తరువాత జీవితాన్ని ఆనందమాయం చేసుకుంటాడు. సాధన చేయగా చేయగా యోగికి ఒక్కొక్క శక్తి అలవడుతూ వుంటుంది.
    
    నేను ఇరవై ఏళ్లుగా యోగం చేస్తున్నాను. అది కూడా నాగరిక ప్రపంచంతో అనుబంధాన్ని తెంపుకోకుండా, ప్రేమపాశాలు వదలకుండాను. అందువల్లే నాకు కొన్ని పరిమితమయిన శక్తులే లభించాయి. ఆ కారణంగానే చెప్పగలిగాను ఆపరేషన్ అవసరం లేదని."
    
    అతను చెప్పటం అయిపోయినా చీఫ్ కానీ, డాక్టర్ కానీ ఈ లోకంలోకి రాలేనట్టు- ఏదో ట్రాన్స్ లో వున్నట్టూ బొమ్మల్లా వుండిపోయారు.
    
    వారిని చూసిన అభిరాం, వరప్రసాదం ఆశ్చర్యపోయారు. వారిద్దర్నీ ఈ లోకంలోకి తీసుకురావటానికన్నట్టు చిన్నగా దగ్గాడు తిరుపతి. అప్పుడు కదిలాయి చీఫ్ డాక్టర్ల శరీరాలు చైతన్యం వచ్చినట్లు.
    
    "మీరు.... మీరు చెబుతున్నది నిజమేనా?" చాలాసేపటి తర్వాత తేరుకున్న చీఫ్ అన్నాడు.
    
    "ఇందులో అబద్దం చెప్పవలసిన అవసరం ఏముంది నాకు?" తిరిగి అతన్నే ప్రశ్నించాడు తిరుపతి.
    
    "కానీ సైన్స్ నమ్మదే" అన్నాడతను.
    
    "నిజమే! ప్రతిదానికీ శాస్త్రీయాధారాలంటూ వుండాలి. అలాగే భగవంతుడూ, స్వర్గం-నరకం, ఆత్మలనేవి కూడా వుంటే, వాటి ఉనికిని తెలియచెప్పాలంటే భూకంపనాలని రికార్డ్ చేసే రెక్టర్ స్కేల్, సిప్మోగ్రాఫ్, సిస్మోగ్రాఫ్, మనిషి శరీరంలో ఉష్ణాన్ని తెలియచెప్పే ధర్మామీటర్, గుండె కొట్టుకునే వేగాన్ని తెలియచెప్పే స్టెతస్కోప్, ఎక్కడో వున్న మనిషి మాటల్ని అందుకుని మనకందజేసే టెలిఫోన్ వంటి పరికరాలుండాలి.
    
    భగవంతుడి ఉనికిని మనకు తెలియచెప్పే పరికరం మనలోనే వుంది. అదేమిటో తెలుసా?" అంటూ ప్రశ్నించాడు తిరుపతి.

    "ఏమిటిది?" చీఫ్, డాక్టర్స్ యిద్దరూ ఒకేసారి అన్నారు.
    
                                                             *    *    *    *    *
    
    "అభిరాంగారున్నారా? నా పేరు మనస్విని" అందామె.
    
    "లేడు ఏదో అర్జంటు పనుందని చెప్పి ఇంటికి రాకుండానే వెళ్ళి పోయాడు. యింతకీ నువ్వెవరమ్మా?" అట్నుంచి ఓ స్త్రీ మాటలు వినిపించాయి.
    
    "నేను అభిరాంగారి ఆఫీసులోనే పనిచేస్తున్నాను. మా తాతయ్యకి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అందుకని రేపు ఆఫీసుకి రానని చెబుతారా?" తను అభిరాం ఫ్రెండ్ మహదేవ్ ప్రేయసిని చెప్పలేక అలా అందామె.
    
    "అయ్యో! ఇంత రాత్రివేల ఆ విషయం చెప్పాలా? ఒకరోజు కాకపోతే రెండు రోజులు సెలవు తీసుకోమ్మా ఆ విషయం నేను చెబుతాలే వాడికి...."
    
    "అలాగేనండి యింతకీ మీరు..."
    
    "నేను అభిరాం అమ్మమ్మని నా పేరు సుమతమ్మ"
    
    "నమస్కారమండి. మర్చిపోకండి.... నా పేరు మనస్విని! మనస్విని ఫోన్ చేసిందని చెప్పండి వుంటాను."
    
    "అలాగే" అన్నది సుమతమ్మ.
    
    "తాతయ్యకి ఒంట్లో బాగులేదని.... అందుకని రేపు తను ఆఫీసుకి రాలేనన్న సంగతి ఓ ఆడపిల్ల.... అదీ అర్ధరాత్రి తన బాస్ ఇంటికి ఫోన్ చేయడం! యింతవరకూ నేనెక్కడా చూడలేదు. ఎప్పుడూ వినలేదు. రిసీవర్ క్రెడిల్ చేసి దేనికోసమో వెదుక్కుంటున్న మనస్వినిని అయోమయంగా చూస్తూ అనుకున్నాడు టెలిఫోన్ బూత్ లోని యువకుడు.
    
    "క్యా హువా?" మనస్విని పడుతున్న అవస్థ గమనించి అడిగాడు గూర్ఖా.
    
    "మనీపర్స్ బూల్ గయీ మై" అందామె.
    
    "ఫికర్ మత్ కరోఁ మై దేతా" అంటూ జేబులోంచి డబులు తీసిచ్చాడతను.
    
    మనస్విని గుండెల్లోని ఆవేదన కన్నీళ్ళ రూపంలో బయటికొచ్చేస్తోంది. అభిరాం యింట్లో లేడు. మహదేవ్ సంగతేం తెలియలేదు. 'ఖచ్చితంగా అతనికేదో జరిగింది' అనుకుందామె. గూర్ఖా కదిలాడు మనస్వినితో పాటు.
    
    వాళ్ళిద్దరూ కనిపించిన మేర అలా చూస్తుండిపోయాడు బూత్ లోని యువకుడు. 'పాపం! తాతయ్యంటే చాలా అభిమానంలా వుంది' అనుకున్నాడతను మనస్విని కన్నీళ్ళకి అర్ధం తెలియక.
    
                                                              *    *    *    *    *
    
    "మన మనస్సు!" బదులిచ్చాడు తిరుపతి.
    
    ఇంకా ఏదో చెబుతాడనుకున్న ఆ యిద్దరూ తేలిగ్గా అతని మాటల్ని కొట్టిపడేశారు.
    
    "మనస్సు, అంతరాత్మ, దెయ్యాలూ, భూతాలు ఇవన్నీ ట్రాష్ మనిషి విచ్చలవిడిగా ప్రవర్తించి పాడైపోకూడదన్న వుద్దేశ్యంతో చచ్చాక పావులు చేరేది నరకానికేనని, అక్కడ శిక్షలు భయంకరంగా వుంటాయని మనవాళ్ళు సృష్టించిన పదాల గారడీ.
    
    మోసాలు, పాపాలు చేస్తే భగవంతుడు గమనిస్తుంటాడని ఒక భయాన్ని అతి తేలివిగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేశారు. దేవుడు, స్వర్గం, నరకం అన్న పదాలు హిందూ మత సనాతనులు కల్పిస్తే - దయ్యాలు, భూతాలు, క్షుద్రశక్తులు వంటి పదాల్ని తాంత్రికులమని చెప్పుకునే సెమీ క్రాక్ద్ ఫెలోస్ సృష్టించారు.
    
    ఈ రెండు వర్గాలూ తమ స్వప్రయోజనాల కోసం చేసిన పనిది. భగవంతుడున్నాడని, అతడు సర్వాంతర్యామీ అనీ, పాపపుణ్యాలు పరిశీలించి శిక్షలు వేస్తాడని, అందుకని నివారణోపాయం తాము చెబుతామని దానికై సంభావనం వగైరాలంటూ మొదటివర్గం అమాయక ప్రజల్ని తప్పుదోవ పట్టించింది.
    
    రెండోవర్గంలోని వారు- తమని చూస్తే దెయ్యాలు, భూతాలు వణుకుతాయని, మంత్రం-తంత్రం వంటి వాటి ద్వారా మనిషిని బ్రతికించటం తమకి చాలా సులువని ప్రచారం చేసుకుని ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి తమ పబ్బం గడుపుకుంటారు.