Read more!

వజ్రాల పంజరం


    ఆలోచనల నించి తేరుకున్న విజూష అప్పుడు చూసింది.

 

    ఉదృతంగా కురుస్తోంది వర్షం.

 

    నిశిరాత్రిని వణికిస్తున్న ఉరుములు మెరుపులు.

 

    జన సంచారంలేని దట్టమైన అడవిలాంటి పరిసరాల్లో ఆగిన కారులో నుంచి చూస్తుంటే భయానకంగా వుంది.


 
    ఎక్కడో పిడుగు పడిన చప్పుడు.

 

    గభాల్న అతన్ని చుట్టేసింది.

 

    ఆ స్పర్శలో వలచిగుళ్లవు వెదురుపొదలో ఉలికిపడిన అనుభూతి.

 

    ఓదార్పుగా అతని చేతులు ఆమె తలనీ కంఠాన్ని నిమురుతుంటే చెంపలు సంధ్యారాగిణులై కోరికల కొసకొమ్మలపై బలహీనంగా వేలాడుతున్న సజల హృదయ సంగీతం.

 

    కాంక్షలు కాలు దువ్వుతున్నట్లు అనిపిస్తున్న ఏడు జన్మల వరం కావాల్సిన రేపటి తమ దాంపత్యం ఏడు స్వరాలుగా ఇప్పుడే విడిపోయిన వాడిన కుంకుమ పూలగంపల్లో కూరుకుపోకూడదనుకుంది.

 

    వెంటనే బాధగా చాలా కష్టంగా అతని పట్టు నుండి విడిపడింది.

 

    "ఈ రాత్రికి ప్రయాణం కష్టం."

 

    గొణుగుతున్నట్టుగా అన్నాడు.


 
    "అక్కడేదో గెస్ట్ హౌస్ లా వుంది వెళదామా?"

 

    తల తిప్పి చూసిన విజూష ఉలిక్కిపడిందెందుకో.


 
    ఆ భీభత్స వాతావరణంలో దూరంగా కనిపించిన గెస్ట్ హౌస్ లో ఏదో సమాధిలా అనిపించింది ముందు.

 

    మళ్లీ మెరుపు వెలుగు.

 

    ఈసారి నిద్రపోతున్న మృత్యువులా కనిపించింది.


 
    ఎందుకిలా అనిపిస్తోంది?

 

    "వెళదామా?"

 

    "వద్దు" అని ఆమె అనకముందే అటు కారు మలుపు తిప్పాడు మిలింద్.

 

    కుంభవృష్టిలా కురుస్తున్న వర్షంలో తోవ సరిగ్గా కనిపించడం లేదు.

 

    దానికి తోడు చీకటి.

 

    అసలు ఇంతసేపైనా కారు గానీ, లారీగానీ తమకి అభిముఖంగా రాకపోవడం కూడా  ఆమెకి ఆశ్చర్యంగా వుంది.

 

    కారు ఎత్తుపల్లాలో తూలుకుంటూ గెస్ట్ హౌస్ ని చేరుకుంది.


 
    అది నిజంగా గెస్ట్ హౌసేనా?

 

    దూరానికి చాలా విశాలంగా కనిపించింది.

 

    ఇప్పుడు  పెంకుటింటిలా ఇంత చిన్నగా వుందేం?

 

    చుట్టూ గుబురుగా పెరిగిన పొదలు.

 

    చెట్టు తొర్రలో గుర్రుపెట్టి నిద్రపోతున్న పిచ్చివాడిలా మొహంజొదారోమట్టిలోనించి యిప్పటి వర్షానికి బయటికొచ్చిన అస్తిపంజరంలా...

 

    నిన్న మొన్నటి ఓ కథకి గుర్తుగా మిగిలిన గత స్మృతిలా...

 

    ప్రపంచమనే నిర్జన వేదికపై నేనే ఈ విశ్వానికి అసలు నియంత అంటూ నరకం  చేస్తున్న ఘీకాంరంలా -

 

    అప్పుడు చూసింది విజూష.

 

     జవాబు లేదు.

 

    అరిచింది తన ఆర్తనాదం ప్రకృతి విలయంలో లయమైనట్టుగా.

 

    "ఏడీ మిలిందెక్కడ?"

 

    పక్కకి తిరిగిన విజూష ఏదో చూసి ఒక విస్పోటనంతో పీలికలైనట్టు కెవ్వుమంది అసంకల్పితంగా  గోడపై తూలిపడుతూ!

 

    తన ముందున్నది జంతువో లేక మనిషో విజూషకి ముందు అర్దం కాలేదు.

 

    జడలు కట్టిన జుట్టూ....

 

    కపాలం నుండి ఉబికిన రెండు మాంసపు ముద్దల్లా కనిపిస్తున్న కళ్లు....

 

    ప్రపంచంమీద కసితో, ఆగ్రహ కండరాల్ని చెంపల పైకి రప్పించుకున్నట్టుగా...

 

    చితి మంటల్లో సగం కాలిన శవంలా జుగుప్సగా, అసహ్యంగా వున్నాడు.

 

    వయసు అరవై దాటి వుండొచ్చు.

 

    అదికాదు.

 

    రక్తాన్ని రుచి మరిగినట్టు నవ్వుతున్న అతని పళ్లసందులు ఇంకో కలేబరానికి ఆహ్వానం  పలుకుతున్నట్టు అనిపించింది.

 

    వాస్తవాన్ని వెక్కిరిస్తున్నట్టు పుచ్చిన పచ్చి అస్థిపంజరంలా రెండడుగులు ముందుకు వేశాడో లేదో అరిచింది.


 
    "ఆగు. ఎవర్నువ్వు?" ముందుకు రాకు. "

 

    ఆమె కేకలు నిశిరాత్రి కుంభవృష్టిలో ఉరుముల్లా వినిపిస్తున్నా అతడు నిశ్చలంగా నడుస్తున్నాడు.


 
    ప్రాణభీతితో కంపించిపోయింది విజూష.

 

    ఏమయ్యాడో తెలీని మిలింద్ కోసం మరోసారి కేక పెట్టింది.


 
    భూనభోమండలాల్ని ఏకం చేసే ప్రళయ  ప్రభంజనాల నేపధ్యంలో గుహలా అనిపిస్తున్న గెస్ట్ హౌస్ లోపలికి పరుగుతీసింది.

 

    మృత్యువు రెక్కల్లా మసిబారిన గోడలు...

 

    వక్రవలయాల్లా పేరుకున్న సాలెగూళ్లు...

 

    తూలిపడింది కాలికి ఏదో తగిలి.

 

    కళ్లనుంచి నీళ్ళు ఉబుకుతున్నాయి.

 

    తోడుగా వచ్చిన మిలింద్ ఏమయ్యాడో తెలీక ఏడేడు జన్మల అనుబంధం  కావాల్సిన స్నేహపు అంశం ఒక్కొక్కటీ ముక్కలవుతుంటే ఏం చెయ్యాలో పాలుపోక... అశ్రువులు రక్తాక్షరాలై రాలుతుంటే చూసిందీ నేలపై వున్న ఎముకల్నీ  మనుషుల్నీ మనుషుల కపాలాల్నీ....

 

    ఒక ఆక్రందన  గొంతులోనే సమాదై క్షణకాలం మౌనవాసం తీసి మరుక్షణం స్మారక సంగీతమైంది. ఇంకా చావని గుప్పెడు జీవకణాలు ఆమెను మృతికీ స్మృతికీ మధ్య స్థితిలోకి నెట్టాయి.