Read more!

హ్యూమరాలజీ -2


    పిల్లలందరూ తినుబండారాల కోసం ఏడుపులు, పెడబొబ్బలు, భార్యా భర్తలు ఊరికూరికే దెబ్బలాటలు- నానా రభసగాను తయారయింది.

 

    ఈ ఆరోగ్య నిబంధనలేమీ పట్టించుకోకుండా అన్ని కూరగాయలు - అన్ని రకాల నాన్ వెజిటేరియన్ పదార్థాలు - శుభ్రంగా తిని సుఖంగా తిరుగుతోన్న జీవి ఒక్కడే కనబడ్డాడు నాకు. అతడు బగారా బైగన్ వెంకట్రావ్.

 

    ఈ పరిస్థితి చాలా దారుణంగా కనిపించింది నాకు. గోపాలరావ్, నేనూ కాలనీ, ప్రెసిడెంట్, శాయిరామ్ కలిసి డాక్టరు గారిని కలుసుకుని మా బాధలన్నీ వివరించి ఆయన విధించిన నిబంధనలు పునఃపరిశీలించమని కోరాము.

 

    "నోనోనో- నాటెటాల్! ఆరోగ్య సూత్రాలన్నాక అమలుపరచడం కష్టంగానే ఉంటాయ్! నన్ను చూడండి ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్లే యాభై అయిదేళ్ళు ఎలాంటి రోగం, ఆఖరికి జలుబుకూడా లేకుండా గడపగలిగాను. అంతేగాదు, మరో యాభై ఏళ్ళు కూడా ఇలాగే ఆరోగ్యంగా గడిపేయగలను. మీకు నాలాంటి ఉక్కు ఆరోగ్యం కావాలో లేక ఈ రోగాలను కలిగించే ఆహార పదార్థాలు కావాలో - ఎన్నుకోండి" అన్నాడాయన.

 

    చేసేది లేక తిరిగి వచ్చాము.

 

    మర్నాడు ప్రొద్దునే శాయిరామ్ న్యూస్ పేపర్ పట్టుకుని పరుగుతో వచ్చాడు హడావుడిగా.

 

    "చూశారా! పేపర్లో ఏం రాశారో! అమెరికాలో ఈ మధ్య వంద మందికి కోడిగుడ్లు, గడ్డ పెరుగు రోజూ తినిపించారట- మిగతా సగం మందికీ ఆ మూడు నెలలూ అవి అందుబాటులో లేకుండా చేశారట! తరువాత అందరినీ పరీక్షిస్తే ఏం తేలిందో తెలుసా? రోజూ గుడ్లూ, గడ్డ పెరుగు తిన్నవాళ్ళు, వాటిని ఏమాత్రం తినని వాళ్ళకంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నారంట! వారి గుండె ఏ బాదరబందీ లేకుండా పెండ్యులమ్ లాగా స్టడీగా కొట్టుకుంటోందంట-"

 

    ఆ వార్త విని కొంతమంది హాపీగా ఫీలయ్యారు.

 

    అందరం డైలమాలో పడి డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టాం-

 

    అందరం ఇంకా తర్జనభర్జనలు పడుతూండగానే డాక్టర్ వచ్చేశాడు.

 

    మా గొడవంతా విని చిరునవ్వుతో ఇంకో జర్నల్ తీసి చూపించాడు.

 

    అందులోని ఒక ఆర్టికల్ తనే చదివి వినిపించాడు.

 

    జర్మనీలో రెండు చుంచు ఎలుకల మీద చేసిన ఎక్స్ పెరిమెంట్ లో గుడ్డూ, పెరుగూ ఇతర కొవ్వుపదార్థాలు తిన్న చుంచుకి హార్ట్ ఎటాక్ వచ్చిందట! తినని ఎలుక హాపీగా కేరింతలు కొడుతూ తిరుగుతోందిట!

 

    అందరూ మళ్ళీ నిరుత్సాహపడిపోయారు. కాలనీలో పెరుగు గుడ్ల వాడకం మూడొంతులు పడిపోయింది- నెయ్యి పేరు వింటేనే పారిపోతున్నారు కొంతమంది.

 

    మరుసటి వారంలో ఇంకో బాంబు పేల్చాడు డాక్టరు.

 

    కాఫీలు, టీలు తక్షణమే మానివేయాల్సిందేనని-

 

    వాటివల్ల గ్యాస్, ఎసిడిటీతోపాటు కొవ్వు కూడా పెరిగి రకరకాల వ్యాధులకు దారి తీస్తుందట-

 

    కాలనీ వాళ్ళందరం కాఫీలు, టీలు మానడానికి పదిరోజులు నానా చావూ ఛావాల్సి వచ్చింది. చివరకు అవి మానేయటం చేతకాక రోజు కొక్కసారే తాగే ఏర్పాటు చేసుకున్నాం. దాంతో అందరినీ నీరసం ఆవహించింది. ఆ తరువాతి వారంలో ఇంకో బాంబు పేల్చాడు- డాక్టర్.

 

    "వెంటనే అందరూ ఆహారంలో కాలరీలను తక్కువగా తీసుకోవటం చాలా అవసరం! దాని వల్ల చెడు కొలస్ట్రాల్, రక్తపోటు తగ్గిపోతాయ్. అలాగే మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.

 

    ఉదాహరణకు షుమారు అయిదువందలు కాలరీలు తగ్గిస్తే కొలస్ట్రాల్ 120కి తగ్గిపోతుంది. చెక్కెర 65కి పడిపోతుంది. బి.పి. నార్మల్ కి వచ్చేస్తుంది. బాడీ వెయిట్ కూడా తగ్గిపోతుంది. ఇంకా ముఖ్యమయిన విషయం ఏమిటంటే కేన్సర్ పెరిగే వేగాన్ని ఇది తగ్గించేస్తుంది. నన్నడిగితే వారానికి మూడు రోజులు ఉపవాసం ఉండండి! సర్వరోగ నివారిణి అంటే ఉపవాసం ఒక్కటే!

 

    ఈ రోజు నేనింత ఆరోగ్యంగా ఉన్నానూ అంటే కారణం ఏమిటి? ఉపవాసాలు! ఛాన్స్ దొరికితే చాలు! ఉపవాసం చేస్తాను-"

 

    అందరూ నీరసంగా తప్పట్లు కొట్టారు.

 

    ఆరోజు నుంచీ కాలనీలో అందరికీ తిండి పడిపోయింది. మనకిష్టమయిన పదార్ధం ఏది తిందామన్నా డాక్టర్ గొంతు ఎక్కడినుంచో ఖంగున వినపిస్తోన్నట్లుంది. కొంతమంది మాత్రం ఉపవాసాలు చేయటం మొదలుపెట్టారు.

 

    దాంతో విపరీతమయిన ఆకలి, నీరసం-

 

    ఆ విషయమే డాక్టర్ తో చెప్పారు నెక్ట్స్ మీటింగ్ లో-

 

    "ఆకలి వేయటం చాలా మంచి విషయం! మీరిప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్నారన్నమాట! ఏ మాత్రం వెనుకంజ వేయకండి! ఆకలి తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడల్లా రెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగండి! నన్ను చూడండి! ఎప్పుడు భుజానికి వాటర్ బాటిల్ తగిలించుకునే వుంటాను."

 

    ఎవరు ఏమీ మాట్లాడలేదు.

 

    డాక్టర్ ఎంత కన్విన్సింగ్ గా చెప్తున్నా ఎందుకో అందరికీ అసంతృప్తిగా ఉంది.

 

    "అంతేకాదు! మీరంతా రోజుకి ఆరు కిలోమీటర్ల దూరం వేగంగా నడవాలి! అప్పుడే ఇంతకాలం మీలో పేరుకుపోయిన ఫాట్స్ కరిగిపోయి అద్భుతమయిన ఆరోగ్యంతో నవనవలాడిపోతారు-"

 

    డాక్టర్ వెళ్ళిపోగానే అందరు గొణుక్కోవటం వినిపిస్తూనే ఉంది. "మావల్ల కాదు వాకింగ్" అన్నారు కొంతమంది-

 

    అయితే ఆ గొడవ అక్కడితో ఆగలేదు. కాలనీలోని ఆడాళ్ళందరూ కూడపలుక్కుని డాక్టరుగారి సలహాలన్నింటికీ తిలోదకాలివ్వాలని నిర్ణయించారు. మళ్ళీ కాలనీ మీటింగ్ ఏర్పాటు చేసి దానికి డాక్టరు గారిని ఆహ్వానించాము.

 

    "డాక్టరు గారొచ్చాక మనందరం ఇంత కఠినమయిన నిబంధనలు పాటించడానికి సిద్ధంగా లేమని తెలియజేద్దాం" అంది రాజేశ్వరి.

 

    "అవును. ఉప్పు, కారం, కాయగూరలు లేని భోజనం తినడం మా వల్లకాదు" అంది పద్మావతి గారు.

 

    "ఎప్పుడో ఏవో జబ్బులొస్తాయని జీవితమంతా ఇలాంటి రుచి పచీలేని ఆహారం తినమంటే ఎలా?" అంది జయప్రదాదేవి.

 

    శాయిరామ్ మైకు ముందుకొచ్చాడు.

 

    "అలా తొందరపడకండి. డాక్టరుగారు ఇవన్నీ చిన్నప్పట్నుంచి ఆచరించబట్టే అంత ఆరోగ్యంగా ఉన్నారన్న విషయం మనం ఇప్పుడు గుర్తుంచుకోవాలి. కనుక మనకి కూడా అంత మంచి ఆరోగ్యం కావాలంటే అవన్నీ అవలంబించక తప్పదు మరి."

 

    ఈ లోగా డాక్టరుగారి ప్యూన్ హడావుడిగా సైకిల్ మీద వచ్చాడక్కడికి.

 

    వాడితో జనార్థన్, శాయిరామ్ కలసి చాలాసేపు ఏదో విషయం మాట్లాడి మైకు దగ్గరకొచ్చాడు. మళ్ళీ.

 

    "సోదర సోదరీమణులారా! మీకో దుర్వార్త తెలియజేయడానికి ఎంతో విచారిస్తున్నాను. మన కాలనీ డాక్టరు గారు ఇవాళ మధ్యాహ్నం పౌష్టికాహార లోపంవల్ల, హఠాత్తుగా కొలాప్స్ అయి శాశ్వతంగా మనల్ని వదిలిపోయారట. కనుక మనందరం ఓ నిముషం పాటు లేచి నిలబడి ఆయన ఆత్మకు శాంతి కలగటం కోసం మౌనం పాటిద్దాం-"

 

    అంతా లేచి మౌనం పాటించారు ఎంతో శ్రద్ధతో.

 

    ఆ తరువాత పెద్ద ఎత్తున కోలాహలం చెలరేగింది.

 

    "ఇంకానయం- ఇంకొన్నాళ్ళు ఆయన చెప్పినట్లు చేస్తే మనమూ అలాగే ఎగిరిపోయేవాళ్ళం-"

 

    అంటోందొకావిడ.


                                                         *  *  *  *  *