Read more!

జీవాత్మ


    "షటప్ డాలీ" కోపంగా అరిచాడతను. యజమాని వేపు కోపంతో చూస్తూ అది అరుపులాపేసి 'గుర్ర్ ర్ర్' మంటూ వుండిపోయింది. దాన్ని స్టోర్ రూంలో కట్టేసి హాల్లోకి నడిచాడతను.
    
    టీవీలో సినిమా బిట్స్ తో తయారయిన ప్రోగ్రామేదో వస్తోంది. చిరాకేసిందతనికి.
    
    "ఎప్పుడూ వెధవ సినిమా బేస్ డ్ ప్రోగ్రాంలే"అనుకుంటూ మరో ఛానల్ తిప్పాడు. అందులో సినిమా పాటలు వస్తున్నాయి. హీరో- హీరోయిన్లు అసహ్యకరమైన భంగిమలలో ఊగిపోతూ చిత్తుగా తాగిన ఆబోతుల్లా గెంతులేస్తున్నారు.
    
    'రేపట్నుంచీ కేబుల్ కనెక్షన్ తీయించేయాలి' అనుకుని ఏదో పుస్తకం పట్టుకుని బెడ్ రూంలోకి నడిచాడు. మంచంమీద పడుకుని పుస్తకం తెరవబోతూ మళ్ళీ చూశాడు. పక్క ఫ్లాట్ లోకి కిటికీలోంచి.
    
    చీకటిగా వుందే తప్ప, దొంగెవారూ పడిన జాడలేమీ తెలియలేదు. భార్య కోసం ఎదురుచూస్తూ పుస్తకం చదువుతుండిపోయాడతను.
    
                                                       *    *    *    *    *
    
    "కంగ్రాట్స్ అభిరాంగారూ! మీ ఫ్రెండ్ హెల్త్ కండిషన్ నార్మల్ కొచ్చింది. బి.పి., పల్స్, హార్ట్ అన్నీ అబ్సల్యూట్లీ నార్మల్ కండిషన్లో పనిచేస్తున్నాయి. పాపం ఉదయం నుంచీ హైరానా పడుతున్నారు. ఇంటి కెళ్ళి రెస్ట్ తీసుకొని ఉదయం రండి. మీ ఫ్రెండ్ ని ఈ రాత్రంతా కేర్ లోనే వుంచి రేపు వేరే రూమ్ కి షిఫ్ట్ చేస్తాం. నౌ హీ ఈజ్ ఆల్ రైట్, డోంట్ వర్రీ ఎబౌట్ హిమ్" షేక్ హేండిస్తూ అన్నాడు డాక్టర్.
    
    అభిరాం కృతజ్ఞతగా అతనివంక చూశాడు. అతని గుండెమీంచి పెద్ద భారం దిగిపోయినట్లయింది. వరప్రసాదం వైపు ఆనందంగా చూశాడు. అతను కూడా గండం గడిచినందుకు ఆనందించాడు.    

    "మీరింటికెళ్ళి రెస్ట్ తీసుకోండి! నాతోపాటు ఉదయం నుంచీ వుండిపోయారు" అన్నాడు అభిరాం.
    
    "అవసరం లేదు అభిరాంగారూ! మీరిద్దరూ ఇంటికెళ్ళచ్చు. పేషెంట్ కేం ఫర్వాలేదు. వెళ్ళిరండి" అభయం ఇచ్చాడు డాక్టర్.
    
    తనకోసం అమ్మమ్మ ఎదురుచూస్తుందనీ ఉదయం వచ్చేసే ముందు కూడా ఏమీ చెప్పలేదని గుర్తొచ్చిందతనికి. అయిష్టంగానే యింటి కెళ్ళాడు.    

    "ఉదయంనుంచీ ఇద్దరూ ఏమైపోయార్రా?" వాళ్ళని చూస్తూనే అడిగింది సుమతమ్మ.
    
    "ఓ అర్జంట్ పనిమీద వెళ్ళాం అమ్మమ్మా" అని స్నానానికి బాత్ రూంలోకి వెళ్ళాడు అభిరాం.        
    
    వరప్రసాదం కూడా స్నానం చేశాక ఇద్దరికీ వడ్డించింది సుమతమ్మ. అభిరాం అన్యమనస్కంగానే భోజనం చేసి లేచాడు.
    
    'వీడి మనసెందుకో బాగాలేదు' అనుకుందామె. వరప్రసాదం కూడా సారిగ్గా తినలేకపోయాడు.
    
    'ఇద్దరికీ ఏమైందీవాళ?' అనుకుందామె.
    
    భోజనాలైపోయాక ఇద్దరూ అభిరాం గదిలోకి నడిచారు. ఇద్దరిలో ఎవరూ మాట్లాడుకోలేదు. మౌన్మగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.    

    'మహదేవ్ ని వదిలేసి రాకుండా వుంటే బాగుణ్ను' అని అనుకున్నాడు అభిరాం.
    
    'నేనైనా అక్కడుంటానంటే సరిపోను, మరీ అనాధలా అతన్ని ఒక్కడ్నీ వదిలేసి వచ్చేశాం' అనుకున్నాడు వరప్రసాదం. చాలాసేపు మానసిక సంఘర్షణ తర్వాత ఇద్దరూ ఒకేసారి "హాస్పిటల్ లో నేనుంటా"నంటే "నేనుంటాను" అని ఒకరు మరొకరితో అన్నారు. వరప్రసాదం తన మాటనే నెగ్గించుకున్నాడు.
    
    "అమ్మమ్మ ఒంటరిగా వుంటుంది కదా! అందుకని నేనే వుంటాను. ఉదయమంతా మీరుండవచ్చు" అని.
    
    "సరే" ననక తప్పలేదు అభిరాంకి.
    
    "మరి నేను వెళ్ళొస్తాను" అన్నాడు వరప్రసాదం.
    
    "దించుతాను" అన్నాడు అభిరాం.
    
    "దగ్గరే కదా! నడుస్తాను. కాస్త వెన్నెల చల్లదనంతో మనస్సుకి ప్రశాంతతయినా వస్తుంది" అన్నాడతను.
    
    మౌనంగా తలవూపాడు అభిరాం. సుమతమ్మకి చెప్పకుండానే బయటపడ్డాడు వరప్రసాదం.
    
    పడుకున్నాడన్న మాటే కానీ అభిరాంకి నిద్రరాలేదు. జూబ్లీహిల్స్ లోని బిల్డింగ్ లు వెన్నెల్లో ఠీవిగా దర్పాలు ఒలకబోస్తూ వున్నట్లున్నాయి. అడపాదడపా కార్లు వస్తూ పోతూ వున్నాయి.
    
    వరప్రసాదం అపోలో ఆస్పత్రికి పదినిమిషాల్లో చేరుకున్నాడు. మహదేవ్ పరిస్థితి తెలుసుకుని-
    
    "అంతా సవ్యంగానే వుంది" డాక్టర్ చెప్పడంతో తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు.
    
                                                                *    *    *    *    *
    
    సమయం ఉదయం ఆరుగంటలవుతోంది.
    
    అప్పటికే అభిరాం స్నానం చేసేసి, అర్జంటు పనుందని అమ్మమ్మతో చెప్పి అపోలో హాస్పటల్ కి చేరుకున్నాడు. అతన్ని గమనించిన వరప్రసాదం ఎదురెళ్ళి అంతా సవ్యంగానే వుందన్నట్టు చిరునవ్వుతో ఆహ్వానం పలికాడు.
    
    అభిరాం మొహం వికసించింది. "మీరింటికెళ్ళి రెస్ట్ తీసుకోండి" అని అతన్ని పంపించేశాడు.
    
    తిన్నగా మహదేవ్ వున్న ఇంటెన్సివ్ కేర్ వైపు నడిచాడు. కానీ అక్కడతను కనిపించలేదు. అతన్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ దగ్గరకు నడిచాడు.
    
    "రండి మీ ఫ్రెండ్ ని ఇంటెన్సివ్ కేర్ నుంచి తరలించాం....ఆయనకి ఫర్వాలేదు" అన్నాడు అతను.
    
    "నేనోసారి తనని చూడచ్చా?"
    
    "వై నాట్... కానీ అతను ప్రస్తుతం స్పృహలో లేడు. తలకి బలంగా గాయమైంది. బహుశా సాయంత్రానికి మెలకువలోకి రావచ్చతను" అంటూ లేచాడు డాక్టర్. మౌనంగా అతన్ని అనుసరించాడు అభిరాం.
    
    డాక్టర్ చకచకా నడుస్తూ ఒక గదిముందాగి డోర్ తీశాడు.
    
    లోపల బెడ్ మీద వున్నాడు మహదేవ్. తలకి కట్లతో, పక్కనున్న స్టాండ్ మీద తలకిందులుగా వేల్లాడుతున్న సెలైన్ బాటిల్స్ చేతికి అమర్చబడి.