ఆలింగనం


    ఒకటి... రెండు... మూడు సెకన్లు గడుస్తున్న కొద్దీ నాకు టెన్షన్ పెరిగిపోతోంది. "హలో..." నిద్రమత్తులో ముద్దగా వినిపించింది విక్కీ కంఠం.

 

    "విక్కీ... నేను ముక్తని. ఇక్కడ నా ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్... డాక్టర్ లేడు. మందులున్నాయి... నర్స్ కూడా వుంది. ప్లీజ్ ఇన్ స్ట్రక్ట్ హర్...ఆ... ఇస్తున్నాను."

 

    నర్స్ కి ఫోనిస్తూ చెప్పాను. "అవతలవైపు వున్నది మా సివిల్ సర్జన్... ఆయన ఇన్ స్ట్రక్షన్స్ ఫాలో అవు..క్విక్!"

 

    ఆమె భయంగా ఫోన్ తీసుకుంది.

 

    "ఎస్ సర్... నమస్తే సర్... చెప్పండి సర్... ఆ వున్నాయి... అది లేదు సబ్ స్టిట్యూట్ చెప్పండి సార్..."

 

    చిత్ర వగురుస్తూ లోపలికి వచ్చింది.

 

    "ముక్తా..టేక్సీ..."

 

    "ష్..." నోటిమీద వేలేసుకుని సైగ చేశాను.

 

    నర్స్ ఫోన్ నాకు ఇస్తూ "సార్ మాట్లాడ్తారట..." అంది.

 

    "ముక్తా... ఎడ్రెస్ చెప్పు... నేను బయల్దేరుతున్నాను" నేను చెప్పాను. నర్స్ ప్రతాప్ కి ఇంజెక్షన్స్ ఇస్తోంది.

 

    బ్లీడింగ్ కట్టింది. అతను కదులుతున్నాడు. "దాహం..." అన్నాడు. నీళ్ళకోసం వైజూ పరుగెత్తింది.

 

    చిత్ర నా భుజం మీద చెయ్యేసి "ఆల్ ఈజ్ వెల్...టైమ్ లో డెసిషన్ తీస్కున్నావు" అంది.

 

    నా మనసంతా విక్కీ పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. ముగ్గురం చలిలో వణుకుతూ బయట చెక్కబెంచీ మీద కూర్చున్నాం.


    
    ఉదయం ఆరు గంటలకి విక్కీ కారొచ్చి ఆగింది.


                                  *  *  *


    "పెద్ద హీరోననుకున్నావా?" అడిగాను ప్రతాప్ ని.

 

    "ఆ నిమిషందాకా అనుకోలేదు!" నవ్వుతూ చెప్పాడు.

 

    "ఇప్పుడు నమ్మకం కుదిరిందా తల్లీ... ఆయన ప్రేమమీద?" వైజూని అడిగాము.

 

    వైజూ ప్రతాప్ చేతిని చెంపకి ఆన్చుకుని 'ఐ లవ్ యూ' అంది. అతను నీరసంగా నవ్వాడు.

 

    విక్కీ ముందు వసారాలో కూర్చుని ప్రతాప్ నానమ్మతో మాట్లాడ్తున్నాడు.

 

    నేను వేడి పాలు కంచుగ్లాసులో తీసుకుని విక్కీ దగ్గరికి వెళ్ళాను.

 

    "నేను సివిల్ సర్జన్ అని ఆ నర్స్ నమ్మబట్టి సరిపోయింది. లేకపోతే చచ్చినా చేసేదికాదు నేను చెప్పినవి. ఎందుకంటే ఒకమనిషి ప్రాణం కంటే ఆమెకి తన ఉద్యోగమే ముఖ్యం!" అన్నాడు.

 

    "ఇండియాలో ఒక అన్నం ముద్దకంటే మనిషి ప్రాణం విలువైనది కాదు" బాధగా అన్నాను.

 

    "థాంక్స్ ముక్తా! నాలాంటి డాక్టర్ అవసరం ఇలాంటి పల్లెటూళ్ళో ఎంతగా ఉందో డేమాన్ స్ట్రేషన్ తో సహా చూపించావు!" అన్నాడు.

 

    నేను నవ్వి "మీకు చాలా రుణపడ్డాం" అన్నాను."ఏవిటో మేము రావడం నువ్వు గాయపడడం జరగడం బాధగా వుంది" ప్రతాప్ తో అంది చిత్ర.

 

    "మీరుండేటాలికే బిడ్డ బతికుండు తల్లీ!" అంది వాళ్ళ అమ్మ.

 

    ఆ పూటకి నేనూ, వైజయంతీ కలిసి వంటచేశాం... పూర్తిగా శాకాహారం. నానమ్మ జొన్నరొట్టెలు చేసింది. వాటిని నిమ్మకాయకారం రాసుకుని తింటూవుంటే ఎంతో రుచిగా అనిపించాయి.

 

    విక్కీ అయితే "ఫైవ్ స్టార్ హోటల్ లో నాన్స్ కంటే బావున్నాయి యివి" అని మెచ్చుకున్నాడు.

 

    "వైజూ...మీ అత్తగారింట్లో ఫుడ్ బావుందే!" చిత్ర ఆట పట్టించింది.

 

    ఆరోజు ప్రతాప్ కి టెంపరేచర్ వస్తే విక్కీ మందులు మార్చాడు. సాయంత్రానికి నార్మల్ కొచ్చింది.

 

    చిత్ర వెడ్డింగ్ కార్డు ఇచ్చి "మ్మా, నానమ్మా మీరంతా ప్రతాప్ తో తప్పక రావాలి" అని పిలిచింది.

 

    "మీ ప్రతాప్ వస్తాడులే!" అంది నానమ్మ.

 

    సాయంత్రం విక్కీ కార్లో బయల్దేరాం.

 

    వైజూ కారుదాకా వచ్చాక "నా వాచీ మరిచిపోయాను..." అని లోపలికి మళ్ళీ పరిగెత్తింది.

 

    "నే చూద్దునా బిడ్డా..." అని వాళ్ళమ్మ లోపలికి వెళ్ళబోతుంటే "ఒద్దులే అమ్మా...జొన్నరొట్టె ఎట్టా చెయ్యాలో చెప్పండి" అని చిత్ర ఆవిడ్ని ఆపేసింది.

 

    లోపల ఏం జరుగుతుందోనని ఊహిస్తూ నిలబడ్డాను నేను.

 

    విక్కీ కారు స్టార్ట్ చేశాడు. అతని పక్కసీట్లో నేను కూర్చున్నాను. ఉషారుగా ఉండే మ్యూజిక్ ఆన్ చేశాడు. వైజయంతి వచ్చి చిత్ర పక్కన వెనక సీట్లో కూర్చుంది. ఆమె కళ్ళూ, మొహం తుడుచుకుంటోంది. ఎందుకో?

 

    విక్కీ మ్యూజిక్ కి అనుగుణంగా స్టీరింగ్ మీద వేళ్ళు కదుపుతున్నాడు. అతని మెడకూడా రిథమిక్ గా కదులుతూంటే, ఆ చెవి జూకా తమాషాగా వూగుతోంది.

 

    అతని పక్కన నేను కూర్చుని ప్రయాణం చెయ్యడం, ఈ చనువూ నేను ఊహించనిది! ఇంకా నమ్మశక్యంగా లేదు. అతను మధ్య మధ్యలో నాతోనూ, వెనక్కి తిరిగి వాళ్ళతోనూ మాట్లాడుతున్నాడు. చిత్రా, వైజూ అతనితో గొప్ప గౌరవభావంతో మాట్లాడుతున్నారు.

 

    వైజూ అయితే అతడ్ని దేవుడ్ని చూసినట్లు చూస్తోంది!

 

    ఒక 'టీ' కొట్టు దగ్గర కారు ఆపాడు. అందరం అక్కడున్న బల్లలమీద కూర్చుని 'టీ' తాగుతున్నాం.