Read more!

మేడ్ ఫర్ ఈచ్ అదర్


    గౌతమి రెండు నిమిషాల సేపు అతన్ని పట్టుకుని ఏడ్చింది. ఆ తర్వాత మంచమ్మీద కూర్చుంటూ పైట చెంగుతో కన్నీళ్ళు వత్తుకుని-

 

    "ఉదయం ఫోన్ చేస్తే ఇప్పుడొస్తావా..." సూటిగా అతని ముఖం వేపు చూస్తూ అడిగింది.

 

    "కాలేజీలో లేటైంది... సారీ... డాక్టరేమన్నారు..." ఆత్రంగా అడిగాడు.

 

    "లాభంలేదు... అబార్షన్ చెయ్యడానికి టైం దాటిపోయిందట... ఇప్పుడు చేస్తే... ప్రాణానికి ప్రమాదమట..."

 

    ఆ మాట వినగానే అవినాష్ ముఖం వెలవెలపోయింది. తను ఆ మాట వినడానికి అక్కడకు రాలేదు. ఆ మాట వినగానే అవినాష్ మరోమాట మాట్లాడకుండా అక్కడున్న ఓ కుర్చీలో కూర్చుండిపోయాడు.

 

    అతని కెదురుగా ఆమె...

 

    చేమంతి రంగు చీరలో, అమాయకంగా అతన్ని నమ్మిన గౌతమి... అతని నిర్ణయం కోసం చూస్తున్న గౌతమి.

 

    అవినాష్ షర్టు జేబులోంచి సిగరెట్ పాకెట్ తీసి, అందులోంచి సిగరెట్ తీసుకుని వెలిగించి గాల్లోకి పొగ వదుల్తూ ఆలోచిస్తున్నాడు.

 

    అయిదు నిమిషాలసేపు ఇద్దరి మధ్యా మౌనం.

 

    "ఏమాలోచిస్తున్నావ్..."

 

    "ఏం లేదు..."

 

    "నా ప్రాణానికి ప్రమాదమైనా పర్వాలేదు... నువ్వు ఎబార్షన్ చేయించుకోమంటే చేయించుకుంటాను" కొండంత విషాదాన్ని దిగమింగుతూ అంది.

 

    "అసలు కుదరదా..." బెంగగా అడిగాడు అవినాష్.

 

    తల అడ్డంగా ఊపింది గౌతమి.

 

    "ఇన్నాళ్ళెందుకు లేటు చేసావ్..." ఉక్రోషంగా ప్రశ్నించాడు అవినాష్.

 

    "ఇలా అవుతుందని నాకు తెల్సా..." తలదించుకుని అంది.

 

    "మీ వాళ్ళకెవరికైనా ఈ విషయం తెల్సా..." అడిగాడు అవినాష్.

 

    "ఏమిటిలా ఉన్నావని మా చెల్లి చాలా సార్లడిగింది. కానీ చెప్పలేదు... అందుకే ఊర్నించి మధ్యలో వచ్చేసాను..." చెప్పింది.

 

    అవినాష్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

 

    మరో క్షణంలోనో, ఇంకో క్షణంలోనో గౌతమి తననే ప్రశ్న వేయబోతోందో అతనూహిస్తున్నాడు.

 

    దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో అతనాలోచిస్తున్నాడు. అనుకోకుండా చేసిన ఒక పొరపాటు తన బంగారు దారిలో పెద్ద బండరాయిగా వచ్చి నిలుస్తుందని అతను అనుకోలేదు.

 

    అతను ఆలోచిస్తుండగానే-

 

    ఆమె నోట్లోంచి ఆ ప్రశ్న వచ్చేసింది.

 

    "మనం పెళ్ళి చేసుకుందాం... అవినాష్..." మంచమ్మీంచి లేచి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా అడిగింది ఒకింత ఆందోళనను మిళితం చేస్తూ.

 

    "ఇప్పుడా..." పక్కనున్న గోడమీద బొమ్మవేపు చూస్తూ అన్నాడు అవినాష్.

 

    "మరి...?! ఇద్దరం ఉద్యోగస్తులం... ఇద్దరికీ మైనార్టీ తీరింది... నీ దగ్గరికి వచ్చేడానికి మా వాళ్ళనందర్నీ వదిలేసి వచ్చేమంటే వచ్చేస్తాను... ఏం చేయమంటావ్..."

 

    ఒక్క నిమిషం ఆలోచించాడు అవినాష్.

 

    "ఎబార్షన్ కి అసలు కుదరదా..."

 

    "అంటే... పెళ్ళొద్దంటావా..."

 

    "అది కాదు... మా వాళ్ళు అసలు ఒప్పుకోరు..."

 

    "వాళ్ళని కాదనలేవా..."

 

    "ప్రస్తుతానికి కాదనలేను..."

 

    "మరి ఒప్పించగలవా..."

 

    "ఇప్పట్లో ఒప్పించలేను..."

 

    గౌతమి కళ్ళంట రెండు కన్నీరు చుక్కలు రాలాయి టప్పున.

 

    "అవినాష్ ఒక్కసారి ఆలోచించు... ఇప్పటికీ ఆలస్యమైనా ఎబార్షన్ చేయించుకోడానికి నేను సిద్ధమే... కానీ...ఇంకా చదువు పూర్తి గాని నాచెల్లి, నేనే అన్నీ అయిన నా తల్లీ...నేను చచ్చిపోతే...వాళ్ళు వీధినపడతారు... నా ఒక్క తప్పువల్ల జీవితాంతం వాళ్ళని, చస్తూ బతకమంటావా..." ఆమె గొంతులో ఒకింత తీవ్రత.

 

    "అయితే గర్భం ఉంచుకో..."

 

    "ఉంచుకుంటే...ఆర్నెల్ల తర్వాత నా పరిస్థితేం అవుతుందో ఊహించావా...కాలేజీలో...వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో...మా ఊళ్లో ఈ విషయం అందరికీ తెలుస్తుంది... అప్పుడు నువ్వు తలెత్తుకొని తిరగ్గలవేమోగానీ... నేనూ పుట్టినబిడ్డ కల్సి...ఏ సముద్రంలోనో దూకాలి..." ఏడుస్తూ అంది.

 

    "నిన్ను నమ్మడం నాదే తప్పు...నీ మీద నమ్మకంతో నాకు నేను ద్రోహం చేసుకోవడం నాదే తప్పు..."

 

    ఆ మాటకి అవినాష్ కి చాలా కోపం వచ్చింది.

 

    "అయితే నిన్ను నేను మోసం చేశానంటావా..."

 

    "నే నన్నానా?..." ప్రశ్నించింది.

 

    అవినాష్ ఏం మాట్లాడలేదు.

 

    "మిస్టర్ అవినాష్...నువ్వు పిరికితనం వల్ల ఆలోచిస్తున్నావో, పరిస్థితులు అనుకూలించక ఆలోచిస్తున్నావో, నామీద మోజుపోయి ఆలోచిస్తున్నావో...నా కనవసరం...నేను తల్లిని కావడానికి నువ్వు కారణం కనుక, నువ్వు నాకు కలిగించిన నమ్మకం కారణం కనుక నిన్ను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాను...కానీ...ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు నీకూ నాకూ ఏం సంబంధం లేదని అన్నావనుకో...ఆ మాటతో నేను పిరిగ్గా చచ్చిపోతాననుకున్నావా... చావను...ధైర్యంగా బతగ్గలను...ఆ మాత్రం సాహసం నాకుంది...అవినాష్...తన ఉనికిని తను రక్షించుకోడానికి మోసపోయిన ఏ ఆడదైనా సమాజాన్ని కాలిగోటితో తిరస్కరిస్తుంది తెల్సా..."