జీవాత్మ


    చీకటి మరింత చిక్కనవుతోంది. అయినా నడుస్తూనే వున్నాడు అతను. గజగజ వణికిస్తున్న చలి కళ్ళకి అడ్డంగా ఏమీ కనిపించనివ్వ కుండా తెరల్లాపరుచుకుంటున్న కాటుకలాంటి చీకటి.
    
    "బాబా! అఘోరీబాబా.... కాపాడు... అర్ధాయుష్కున్ని చేయకు. నీ శక్తి ముందు ఎవరూ నిలవలేరు. కాపాడు..... మహదేవ్ ని కా....పా....డు బా....బా..."
    
    కొండవాలు నుంచి పడిన పెద్ద మంచు తిప్ప వరప్రసాదాన్ని విసురుగా ఢీకొంది.
    
    అతని మనసులో మాట పూర్తికాకుండానే అతను కోరుకున్నది జరగకుండానే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
    
                                                    *    *    *    *    *
    
    ఆ గుహలో అఘోరీ ధ్యానం చేస్తున్నాడు. కొన్ని క్షణాల్లోనే అతనికి అంతరాయం కలిగింది.
    
    కళ్ళు విప్పి చూశాడతను. ఏమీ లేదు. మళ్ళీ ధ్యానం మొదలుపెట్టి కనులు మూసుకున్నాడు.
    
    అదే పరిస్థితి మరుక్షణం అతని కళ్ళు మూసుకున్నాయి. మనోనేత్రం తెరుచుకుందా అన్నట్టు తన కోసం వరప్రసాదం రావటం, మార్గ మధ్యలో అతను చనిపోవటం అంతా స్పష్టంగా తెలిసిపోయింది. అన్నట్లు ధ్యానం ముగించి లేచి నించున్నాడు.
    
    ఒక్క ఉదుటున గుహ బయటికి నడిచాడతను. వరప్రసాదం అతన్ని చూసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే వున్నాడు కాలాన్నీ, ప్రకృతినీ జయించిన దివ్య పురుషుడిలా.
    
    గాలి, మంచు స్వైరవిహారం చేస్తున్నాయ్. అతను తిన్నగా ముందుకు సాగిపోతున్నాడు. క్రమక్రమంగా గాలీహోరూ తగ్గిపోయి ప్రశాంతత నెలకొంది.
    
    ఆకాశానికి చెమ్కీలద్దినట్లు మిలమిలలాడుతున్న నక్షత్రాలు వేగంగా నడుస్తున్న అఘోరీ పాదముద్రలు చాలా పెద్దగా మంచుపై ప్రత్యక్షమై యతిని గుర్తుకు తెస్తున్నాయి.

    తెల్లని మంచులోంచి నల్లగా బైటికి కనిపిస్తూన్న వరప్రసాదం కుడికాలి బూటు చీకటిలో కూడా గుర్తుపట్టి ఆగాడు అఘోరీ.
    
    గబగబా మంచునంతటినీ చేతులతో తీసేశాడు. అప్పుడు పూర్తిగా బయటపడింది వరప్రసాదం శవం! ఏదో చెబుతున్నట్లు నోరు తెరుచుకుని వుంది. నోరు చెబుతుంది చెయ్యమన్నట్టు ఆశగా చూస్తున్న కళ్ళు... మంచుని తిరిగి కప్పేసి లేచి నిలబడ్డాడు. ఒకసారి ఆకాశంలోకి చూశాడు. ఏదో అర్ధమైనట్లు తల పంకించి కుడివైపుకి తిరిగి చీకట్లో కలసిపోయాడు.
    
                                                        *    *    *    *    *
    
    గబగబా వెళ్ళి పరీక్షగా చూశాడు.
    
    'మహదేవ్ పక్క తడుస్తుంది.... అంటే మూత్ర విసర్జన నార్మల్ గానే జరుగుతుంది..... కిడ్నీలు పనిచేస్తున్నాయ్'

    నిశ్శబ్దంగా బయటికి నడిచాడు. అతనికి ఎనిమిదో ప్రపంచ వింతని చూసినంత ఆశ్చర్యం కలిగింది. 'బ్లడ్ టెస్ట్ లో క్లియర్ గా తెలిసింది కదా కిడ్నీస్ ఫెయిల్యూర్ అని మరిదేమిటి?' అనుకున్నాడతను.
    
    మళ్ళీ నర్సుతో పాటు అక్కడికి వచ్చి ఆమెకేదో చెప్పాడు. ఆమె మహదేవ్ చేతిలోంచి సిరెంజి ద్వారా బ్లడ్ తీసుకుని లాబ్ వైపు నడిచింది.
    
    డాక్టర్ మహదేవ్ వంక ఓ వింత జీవిని చూస్తున్నట్లు చూసి బయటకు నడిచాడు.
    
    చీఫ్ గదిలోకి నడిచి ఆ విషయమే చెప్పాడు. అతను విభ్రాంతిగా నోరు తెరిచాడు.
    
    "బాడీలో ఎక్కడో ఏదో లోపముంది. ఇదీ అని చెప్పలేని వైరస్ లాంటిదా? లేక ఆర్గాన్స్ ఫంక్షనింగ్ లోనా?" నుదురు మీద చిన్నగా కొట్టుకుంటూ అన్నాడు డాక్టర్.
    
                                                          *    *    *    *    *    
    
    మహదేవ్ లో క్రమక్రమంగా జీవచ్చాయ తగ్గిపోతూ ప్రేతకళ వచ్చేసింది. చిన్నగా శ్వాసతీసుకోవడం తప్ప శరీరంలో మరే ఇతర కదలికలూ లేవు.
    
    మనస్విని వైపు చూశాడు అభిరాం. ఆకాశంలో ఏదో కనిపిస్తున్నట్లు కిటికీలోంచి అటే చూస్తోందామె.
    
    'ఈమెకి పిచ్చి వచ్చేస్తుందేమో  మరికొన్ని రోజులకి' అనుకున్నాడు. తిరుపతి ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.
    
    'వరప్రసాదం ఏమయిపోయాడు? ఎందుకు ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైపోయాడు? ఇక్కడి పరిస్థితులకి తట్టుకోలేకా?
    
    ఎవరి లోకంలో వాళ్ళుండగా మహదేవ్ శరీరం క్రమంగా నీలం రంగులోకి మారిపోతోంది.
    
    అదేక్షణంలో నర్స్ అందించిన బ్లడ్ రిపోర్ట్ చూస్తున్నాడు డాక్టర్. కిడ్నీలు బాగానే పనిచేస్తున్నాయనేది దాని సారాంశం.
    
    గబగబా మహదేవ్ దగ్గరికి నడిచాడతను. అతన్ని చూడగానే క్షణకాలం బిత్తరపోయాడు.
    
    అతని శరీరంలో రక్తమంతా విరిగిపోయినట్లు నీలవర్ణంలోకి మారిపోయింది బాడీ.
    
    'ఎందుకిలా జరుగుతుంది? ఎందుకని జబ్బుని తెలుసుకోలేక పోతున్నాను?' దీర్ఘంగా నిట్టూర్చాడు.
    
                                                    *    *    *    *    *
    
    ప్రళయం రాబోతుంది అన్నదానికి సూకానగా నల్లటి మేఘాలు కమ్ముకొస్తున్నాయ్. గుండెలవిసిపోయేలా తీతువు అరుస్తోంది.
    
    గాలి ఉదృతం పెరిగింది. పుర్రెలలోకి గాలి దూరి పిశాచాలు రోదిస్తున్నట్లుంది. ఎవరో ఏడుస్తున్నట్లూ- అంతలోనే నవ్వుతున్నట్లు పరస్పర విరుద్దమైన ధ్వని తరంగాలు.
    
    పక్షులు భయంతో టపటప రెక్కలాడిస్తూ తమ గూళ్ళు విడిచి ఎగిరిపోయాయి. చితిలో కాలుతున్న శవంలోని కనుగ్రుడ్లు 'ధన్'మని పేలిన శబ్దం. గుడ్లగూబ గుడ్లురిమి చూస్తోంది.