Read more!

డెత్ సెంటెన్స్


    ఆవేశం కట్టలు తెగినట్లు ఆమె నోటి వెంట మాటలు దూకాయి. బాధ తట్టుకోలేనట్లు కంఠం కంపించింది. అన్నం కంచంలో చేయి కడిగేసుకొని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది.

 

    అచేతనంగా చూస్తుండిపోయాడు కిరణ్. ఆమె అంతగా రియాక్టవుతుందని అతనూహించలేదు. మనసులోని ఈర్ష్యని తొందరపడి అలా బయట పడేసుకున్నందుకు నాలుక్కరుచుకున్నాడు.

 

    ఆ పూట రవళి అతనితో మాట్లాడలేదు. మరునాడు ఉదయం హాస్పిటల్ కి వెళ్ళేప్పుడు కూడా పొడిపొడిగా మాట్లాడింది.

 

    ఆ మధ్యాహ్నం రవళి వార్డులో కెళ్ళేసరికి, శరత్ చంద్రని కదలనీయకుండా నిలబెట్టి పొగడ్తలతో ముంచేస్తోంది రాజ్యం.

 

    లోపలికి వస్తూన్న రవళిని చూసి,

 

    "నాదేముంది రాజ్యం, మన కిరణ్ ఇంకెంత ముందుకెళతాడో చూస్తావుగా! తలుచుకోవాలేగానీ సైన్స్ ని తిరిగి రాయగల మేధావి" అన్నాడు.

 

    ఆ మటలు వింటూ వాళ్ళకి దగ్గరైంది రవళి.

 

    "కిరణ్ గారా....?" అంటూ వచ్చేసింది రాజ్యం. తలచుకొంటే మీరన్నట్లే అవుతారు లెండి. కానీ, తలచుకోడానికే భయంకదా? అంది.

 

    "అలా అనకు. అతను నా ప్రియమైన శిష్యుడు. నన్ను మించి ఎంతో సాధిస్తాడు. చూస్తూండండి. అతడు నా శిష్యుడని గర్వంగా చెప్పుకొనే రోజొస్తుంది" అవును కదూ అన్నట్లు రవళి వైపు చూస్తూ మనస్ఫూర్తిగా అన్నాడు.

 

    కిరణ్ మీద ఈగైనా వాలకూడదన్నట్లు కాపాడుకొస్తున్న అతన్ని చూసి రాత్రి కిరణ్ తో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది రవళికి. మనసు చివుక్కుమంది.

 

    తోటి సిస్టర్ పిలవడంతో అప్పుడే పక్కకి వెళ్ళింది రాజ్యం.

 

    "అతన్నంతగా నెత్తిన పెట్టుకుంటున్నారు మీరు. మీ గురించి అతను ఏమన్నాడో తెలుసా...." అంటూ అనుకోకుండా అంతా చెప్పేసింది.

 

    ముందు ఆశ్చర్యపోయాడు శరత్ చంద్ర. కిరణ్ నుండి అటువంటి అభిప్రాయాలని అతను ఊహించలేదు. మనసు బాధతో మూలిగింది. రెండు నిమిషాలు ఆలోచించి అన్నాడు.

 

    "రవళీ, అతనినా ఆత్మవిశ్వాసం ఉండటం మంచిదే! అతన్ని మీరేం అనకండి."

 

    "అది ఆత్మవిశ్వాసం కాదు సార్ అహంకారం" అంది.

 

    "తప్పదు రవళీ! ఎంతోకాలం న్యూనతలో వుండి, ఆక్మవిశ్వాసాన్ని సంతరించుకుంటున్న వ్యక్తులు మనస్తత్వాలు అలాగే వుంటాయి. దానివల్ల మనకేం నష్టంలేదు. ఎలాగయితేనేం అతని మేధ ప్రజలకి ఉపయోగపడాలి!

 

    కిరణ్ నా తర్వాతి తరంవాడు. అతను నాకన్నా ఎప్పుడూ ముందుండవలసిందే! అదే నాకు కావాల్సింది.

 

    గోపాలకృష్ణగారు చేసినవే నేనూ చేస్తుంటే ఇవాళ పిల్లల సర్జరీ వుండేది కాదు. నేను చేస్తున్న ఈ పిల్లల సర్జరీనే చేస్తుంటే రేపు మరో కొత్తది సాధించలేడు. పిల్లల సర్జరీ ఇవాళ కొత్తది కాబట్టి సెన్సేషన్ అయింది.

 

    కొన్నాళ్ళుపోతే ఇది 'రొటీన్' అవుతుంది. కిరణ్ లాంటి వాళ్ళు రొటీన్ నుండి బయటపడాలి. మరో కొత్త ఆపరేషన్ని ప్రవేశపెట్టాలి! అతని ఆలోచనలని ఆ వైపు మరల్చడం మీ బాధ్యత! మీది మరో తరం!

 

    మాకన్నా ముందుకెళ్ళాలి! అతన్ని హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ వైపు ఎదిగేలా చూడండి" అన్నాడు.

 

    "హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషనా? ఇక్కడ అదెలా సాధ్యం? బ్రెయిన్ డెత్ మనకి లీగల్ కాదుగా" అంది.

 

    కిరణ్ పట్ల అతను స్పందించిన తీరు, అతనిపట్ల ఆమెకున్న గౌరవాన్ని ఇనుమడింపజేసింది.

 

    ఏ కారణం వల్లనయినా మెదడులోని జీవకణాలు చచ్చిపోయి, మెదడు పూర్తిగా పనిచేయకుండా పోయినప్పుడు, పాశ్చాత్య దేశాల్లో దాన్ని 'బ్రెయిన్ డెత్'గా పరిగణిస్తారు. శరీరంలో గుండె, ఊపిరితిత్తుల ప్రక్రియ, రక్తప్రసరణ అంతా వీరిలో మామూలుగానే వుంటుంది. చూపు, స్పర్శ, హృదయ స్పందనలాంటివేం లేకుండా, గుండె ఆరోగ్యముగా వున్నంతకాలం వాళ్ళు జీవించే వుంటారు. అయితే బ్రతికివున్న శవాల్లా మంచాల్లో పజి వుంటారు. వాళ్ళ మెదడు ఎప్పటికీ, మరెప్పటికీ కోలుకునే అవకాశం లేకుండా చచ్చుబడిపోయి వుంటుంది. అటువంటి రోగులు ఆయా దేశాల్లో చట్టపరంగా మరణించినట్లేననీ, అవసరమైన అవయవాలు వారినుండి తీసుకోవడం చట్టసమ్మతమేనని వారి న్యాయశాస్త్రం చెబుతోంది. ఈ వెసులుబాటువల్ల మెదడు పరంగా మరణించిన వారి గుండెని తీసి, హార్ట్ ఎటాక్ వల్ల పూర్తిగా చచ్చుబడిపోయిన వారికి అమర్చడం జరుగుతుంది.

 

    అదే హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ - గుండె మార్పిడి లేక గుండెని తీసి గుండెని పొదగడం!

 

    అయితే, మనదేశంలో 'బ్రెయిన్ డెత్' చట్టసమ్మతమైన మరణం కాదు. గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడే మరణించినట్లు అని మన చట్టం చేసింది. అందువల్ల బ్రెయిన్ డెడ్ అయినా, గుండె ఆగిపోయే వరకూ అది మరణం కాదు.

 

    ఆగిపోయిన గుండెతో గుండె మార్పిడి అసాధ్యం. బ్రెయిన్ డెత్ మనకి లీగల్ కాదు గనక - "హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఇక్కడ ఎలా సాధ్యం?" అని అడిగింది రవళి.

 

    "ఎందుకు సాధ్యం కాదు? ప్రయత్నిస్తే అసాధ్యం ఏదీ కాదు!" అన్నాడు స్థిరంగా శరత్ చంద్ర.

 

    "బ్రెయిన్ డెత్ మనకి లీగల్ కాదుగా! మనం సర్జరీ చెయ్యడానికి ఆలోచిస్తున్నామని తెలిస్తే జైల్లో తోస్తారు!" నవ్వుతూ అంది రవళి.

 

    "అందుకే..... మనం మొదటి అడుగు వేయవలసింది కూడా అక్కడే! చట్టాన్ని మార్పించడంకోసం పోరాడాలి!

 

    "ఆ పని కూడా మనమే చేయాలా? జనం ఏం చేస్తున్నారు?" కాస్త విసుగ్గా మొహం పెట్టి అంది రవళి.

 

    "అసలు విషయమేమిటో వాళ్ళకి తెలిస్తేగా కదిలి రావడానికి. విషయమేమిటో బయిటికొస్తే, జనం సపోర్టు మనకే వుంటుంది. మన ప్రభుత్వం కూడా ఈ విషయమై సీరియస్ గా ఆలోచించినట్లు లేదు. ఇప్పుడా అవసరాన్ని మనం కలిగించాలి! అడుగు ముందుకు వెయ్యకపోతే అభివృద్ధీ లేదు - శోధించి సాధించిన సైన్స్ కి సార్ధకమూ లేదు!" అన్నాడు సాలోచనగా.

 

    ఆ తర్వాత కిరణ్ ని ఎలా కదిలించిందో రవళి - చట్టాన్ని సవరించాలనీ - బ్రెయిన్ డెత్ ని భారతీయ చట్టం అంగీకరించాలనీ - సవాల్ చేస్తూ డాక్టర్ కిరణ్ కుమార్ పేరున కోర్టులో కేసు దాఖలైంది!

 

    గుండె మార్పిడి గురించిన ఆధునిక సమాచారాన్ని విదేశాల నుంచి డాక్టర్ కిరణ్ తెప్పించుకునే ప్రయత్నమూ మొదలైంది.

 

    అతను, మహావృక్షం ప్రారంభం కూడా చిన్న బీజంలోని సన్నని కదలిక నుండే మొదలవుతుంది.


                                                *    *    *    *