Read more!

డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4


    ఈ చంద్రం ఏమిటి? తను చొరవతీసుకున్నా మాట్లాడడేం? బహుశా తన ప్రవర్తనలోని మార్పును ఊహించుకోలేకుండా వున్నాడేమో! పార్కులో తనూ - చంద్రం.....

 

    చంద్రం, చక్కగా కత్తిరించి పెంచిన గరికమీద పడుకున్నాడు. తల కుడిచేతిమీద ఆనించి ఎదురుగా కూర్చున్న తన ముఖంలోకి రెప్పవెయ్యకుండా ఎలా చూస్తున్నాడో! తను సిగ్గుతోటి 'టచ్ మి నాట్'లా ముడుచుకుపోతుంది! అలా చూసి చూసి ఒక్కసారిగా తన చెయ్యి పట్టుకొని ముందుకు లాగాడు. తన తల చంద్రం గుండెలమీద పడింది.

 

    హేమ ఉలిక్కిపడింది. పార్కు గేటుముందుకు వచ్చారు. అంతా పగటి కలేనా?

 

    చంద్రం ఒక మూలగావున్న బెంచీవైపుకు నడుస్తున్నాడు హేమకు నిరుత్సాహం అనిపించింది. పలక్కుండా వెళ్ళి బెంచీమీద చంద్రం పక్కగా కూర్చుంది.

 

    "నాలుగు రోజులుగా రాలేదేం?" హేమ ప్రశ్నించింది. చంద్రం ఎన్ని రోజులు రాకపోయినా అతని రాకపోకలు తనకేం పట్టనట్టు నటించే హేమ అలా ప్రశ్నించటంతో చంద్రం ఆశ్చర్యానికి అంతులేదు. చంద్రంలో సంతోషం పాలపొంగులా పొంగుతుంది. కాని, చంద్రానికి మరోవైపు అనుమానంగానే వుంది - తనకు అంత అదృష్టమో అని. "ప్రకాశంవాళ్ళ యూనియన్ వార్షికోత్సవానికి ఒక నృత్య నాటిక రాయమంటే రాశాను. గౌరి అభినయిస్తుంది. నేను ఆ హడావిడిలో వున్నాను."

 

    "గౌరి! ఎవరా గౌరి? ఆ బజారు పిల్లకాని కాదుగదా! గౌరి ఎవరు?"

 

    హేమ ప్రశ్నకు చంద్రం జవాబు ఇవ్వటానికి కొంచెం జంకడం గమనించింది. "ఆ అడవిమల్లేనా?" స్వరంలో హేళన!

 

    హేమ స్వరంలోని అవహేళనకు చంద్రం మనస్సు చివుక్కుమంది. హేమ కళ్ళలో తిరస్కారం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏమిటీ హేమ? చాలా చిత్రమయిన మనిషి!

 

    "ఇవాళే ప్రోగ్రాం! నిన్ను కూడా తీసుకు వెళ్ళటానికి వచ్చాను" అన్నాడు చంద్రం - హేమకు కలిగిన అనుమానాన్ని వెనక్కు నెట్టటానికి ప్రయత్నిస్తూ. అతను తిరిగేది కాకుండా తననుకూడా అలగా జనంలోకి రమ్మంటున్నాడు. హేమకు కోపం వచ్చిందికాని, అణచుకుంది. ఇలా లాభంలేదు. తను చంద్రం మంచి - చెడ్డ విషయంలో జోక్యం కలిగించుకోక తప్పదు అనుకుంది.  

 

    "నువ్వు రాసిన బ్యాలె నాకు కావాలి. మా కాలేజీలో ప్రదర్శిస్తాం" అంది హేమ, మాటల ధోరణిని మరోవైపుకు మరల్చుతూ.

 

    "అయితే, ఇవ్వాళ నువ్వు రావన్నమాట?" అన్నాడు చంద్రం.

 

    "నన్ను బలవంతం చెయ్యకు చంద్రం! ఆ జనంలో నాకు ఊపిరి సలపదు. ఇవ్వాళ నువ్వు ఎక్కడకూ వెళ్ళటానికి వీల్లేదు. మాతో భోజనంచేసి వెళ్ళాలి" అంది హేమ.

 

    నిజంగా హేమ ఇవ్వాళ చాలా చిత్రంగా ప్రవర్తిస్తూంది. హేమ అంత చనువుగా వుంటే తను ఆ అవకాశాన్ని ఎలా జారవిడుచుకోవటం? కాని, ప్రకాశం.... గౌరి.... ఇద్దరూ తను రాకపోతే చాలా బాధపడతారు.   

 

    "ఏమిటో అంత ఆలోచన! వెళ్ళటానికి వీల్లేదు - అంతే!" అతి చనువుగా అధికార యుక్తంగా అంది హేమ. చంద్రం లొంగిపోయాడు.

 

    "నీవు ఆజ్ఞాపిస్తే కాదనేశక్తి నాలోలేదు. అలాగే కానీ."

 

    "కానీలు ఏనాడో పోయాయి. నయాపైసా అను. లే వెళదాం, నాన్న వచ్చివుంటారు" అంటూ హేమ లేచింది.

 

    చంద్రం హేమ చెయ్యిపట్టుకొని లాగి కూర్చోబెట్టాడు. "అప్పుడే ఏం తొందరా? నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో" అన్నాడు చంద్రం.

 

    హేమ కొంచెం గాబరాపడ్డది. "ఏం మాట్లాడతావు?"

 

    ఈ రోజు చంద్రం ఇంటిలో బయలుదేరినప్పుడే అసలు హేమ తనను ప్రేమిస్తున్నదో, లేదో తేల్చుకోవాలని నిర్ణయించుకొని బయలుదేరాడు. ఈ ముసుగులో ఆట ఎంత కాలమో తేల్చుకోదలచుకున్నాడు. అనుకోకుండా హేమకూడా సుముఖంగానే ఉన్నందుకు సంతోషించాడు చంద్రం.

 

    "నేను నీతో మాట్లాడదగినవి ఏమీ లేవా? ఇటు నా ముఖంలోకి చూసి చెప్పు" అంటూ చంద్రం, ఎదురుగా వున్న ఫౌన్ టెన్ వైపుకు చూస్తున్నట్లు నటిస్తున్న హేమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు గోముగా. హేమ విముఖతను చూపించలేదు. చంద్రం ఆమెను దగ్గరకు తీసుకుంటూ "హేమా!" అన్నాడు. స్వర్గద్వారంలో అడుగుపెడుతున్న హేమను ఎవరో ఒక్కసారిగా బలంగా కిందకు తోసేశారు. ఎవరది గౌరి! గౌరి రూపం కళ్ళకు కట్టింది. ఈ చంద్రం ఆ బజారు పిల్లను కూడా ఇలాగే... ఛీ.... శరీరం మీద పాకుతున్న విషపురుగును విదిలించినట్టు హేమ ఒక్కసారిగా చంద్రం పట్టును విడిపించుకుంది. ఆమె ముఖంలో ఏవగింపు, కళ్ళలో ద్వేషం చూసిన చంద్రంకు మతిపోయినట్టయింది.     

 

    ఆకస్మాత్తుగా తనంటే ఆమెకు అంత అసహ్యం కలగటానికి కారణం ఊహించుకోలేకపోయాడు. హేమను ఓ చిత్రమైన వస్తువును చూసినట్లు కొంచెంసేపు చూశాడు. బహుశా ఆమెకు తనంటే ఇష్టం లేకపోవచ్చును. కేవలం చిన్ననాటి స్నేహితునిగానే అభిమానిస్తుందేమో! కాని, అలాకూడా అనిపించదు. చంద్రానికి విసుగూ, కోపం కలిగాయి.    

 

    హేమ ముంజేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు. హేమ లాక్కోవటానికి ప్రయత్నించింది. కాని, చేతిని విడిపించుకోలేకపోయింది. చంద్రం ఆమె చేతినింకా నొక్కాడు. బాధతో హేమ ముఖం కందిపోయింది. చంద్రంలో ఇంత మొరటుతనం, ధైర్యం వుందని వూహించని హేమ విస్తుపోయి చంద్రం ముఖంలోకి చూసింది.  

 

    చంద్రం కళ్ళలో ఉద్రేకం, ముఖంలో గాంభీర్యం. "హేమా చెప్పు! నేనంటే నీకు ఇష్టంలేదా? అలానిచెప్పు. "మళ్లీ నీకు అసహ్యం కలిగించే నా ముఖాన్ని చూపించను" అంటూ హేమ చేతిని విసుగ్గా వదిలేశాడు.

 

    నిజంగానే చంద్రానికి కోపం వచ్చింది. చంద్రం నిజంగా అన్నంతపనీ చేస్తాడేమో!

 

    "ఊఁ చెప్పు! నాకు ఇవ్వాళే, ఈ క్షణంలోనే జవాబు కావాలి?" చంద్రం ఒక్కొక్క మాటకు హేమ హృదయం మీటిన వీణలా మధురకంపనంతో తన్మయం చెందుతున్నది.  

 

    "నువ్వు చెప్పవు - నాకు తెలుసు. నేనంటే నీకు అసహ్యం. అవును. నీ చదువుకూ, అభిరుచులకూ నేను తగను. దొంగతనం చేసి ఇంటినుంచి పారిపోయినవాణ్ణి. ఏదో చిన్నప్పటి స్నేహితుడుగదా అని ఇంతకాలం నన్ను ఆదరించి భరించావు. క్షమించు. ఇప్పటికే నిన్ను చాలా బాధించాను. మళ్ళీ ఇక జన్మలో నిన్ను బాధించను. సెలవు" అంటూ ఉద్రేకంగా లేచి నిల్చున్న చంద్రం చేతిని గాబరాగా పట్టుకుంది హేమ.  

 

    "చంద్రం కోపంలో ఎంత అందంగా వుంటాడు!" అనుకుంది. చంద్రం కోపం చూస్తుంటే హేమకు నవ్వు వస్తుంది. హేమ నవ్వుముఖాన్ని చూసిన చంద్రం తన చేతిని విసురుగా లాక్కున్నాడు.

 

    "నన్ను చూస్తుంటే నీకు నవ్వు వస్తుంది గదూ? అందని పండుకై ఎగిరేవాణ్ణి చూస్తే నవ్వురాక మరేం వస్తుందిలే?" స్వరంలో బాధ ధ్వనించింది. చంద్రం ముఖం రాహుగ్రస్తుడైన చంద్రునిలా వుంది.

 

    "ఏమిటి చంద్రం, మరీ అంత చిన్నపిల్లవాడిలా ప్రవర్తిస్తావు? నేను కాదన్నానా?"

 

    "ఆఁ - అయితే ఒప్పుకుంటున్నావా? నన్ను వివాహం చేసుకుంటావా?" చంద్రం సంతోషంగా హేమ రెండు చేతుల్నీ పట్టుకున్నాడు. హేమ వారించలేదు.

 

    "అలాంటి ప్రశ్నలకు ఆడపిల్లలు అంత త్వరగా జవాబు ఎలా చెవుతారనుకుంటున్నావు?"

 

    "ఐతే పద, ఇప్పుడే నాన్నగారితో మాట్లాడదాం" అన్నాడు చంద్రం.

 

    "అంత తొందరేం వచ్చింది? చంద్రం! వివాహం అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ఒకసారి పొరపాటయితే మళ్ళీ సర్దుకుందాంలే అనుకొనే పనికాదు. వివాహానికి పూర్వం మనం పూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకోవటం అవసరం. నాకు కొంత సమయం ఇవ్వు ఆలోచించుకోవటానికి."

 

    చంద్రం నిరుత్సాహంగా హేమ చేతుల్ని వదిలేశాడు.

 

    "అదుగో, అప్పుడే అలక. అలక ఆడవాళ్ళకే అందం. పద వెళదాం" అంది హేమ చంద్రాన్ని మందలిస్తున్నట్లు.

 

    "సరే, నీ ఇష్టం" అన్నాడు చంద్రం.

 

    ఇద్దరూ బయలుదేరారు. చంద్రానికి, ముఖ్యంగా హేమకు ఇంతకాలంగా పోగొట్టుకున్న అతి ప్రియమైన వస్తువేదో మళ్ళీ లభించినట్లు అనుభూతి కలిగింది. ఇద్దరూ ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ నడుస్తున్నారు. పార్కు సందు మలుపు తిరిగారు.  

 

    "టుబాకో వర్కర్స్ యూనియన్ వర్థిల్లాలి!" "ప్రకాశం బాబు - జిందాబాద్!" అంటూ చెవుల్ని బద్దలుచేసే నినాదాలతో దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. టుబాకో వర్కర్సు ప్రొసెషన్ ఎదురయింది.