Home » Dwadasha Rasulu Karakatwalu » మేషరాశి
మేషరాశి

బేసిరాసి, చరరాశి మరియు అగ్నితత్త్వరాశి, రాశి చిహ్నం గొర్రె, తీవ్రత శక్తి, దృఢత్వం, అచంచలమైన నిశ్చయం, సాహసం వీరి లక్షణములు. తీవ్రతే కాక మూర్ఖత్వం కూడా ఉండును. ఆవేశంగా ముక్కుసూటిగా ప్రవర్తించుటయే గాని ఆలోచించుట ఉండదు. పది మందిని కూడగట్టుకుని నాయకత్వం వహించుట వీరి ముఖ్య లక్షణం. లక్ష్యసాధనలో వీరెంతటి త్యాగమునకైన వెనుదీయరు.

 

వీరి శరీరము శక్తివంతమైనది. యుద్ధరంగమున ఎక్కువగా రాణించెదరు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహించుట వీరికి చాలా సులభము. చక్కటి సంభాషణా చాతుర్యం వాగ్ధాటి ఉంటాయి. వీరు తమ సంభాషణా చాతుర్యంతో వేలాదిప్రజలను కూడగట్టుకుని ఉన్నతమైన కార్యములు సాధించగలరు. వీరిని అనుసరించువారు వీరికి విధేయులై ఎంతటి దుష్కర, కష్టతర కార్యములకైననూ సిద్ధపడుదురు.

 

వీరు స్వతంత్ర అభిప్రాయాలు కలవారు. వీరు స్వాతంత్ర్యమునకు ఎవరైనను ఆటంకము కల్గించిన, ఆ పనిని పూర్తిగా వదిలేయుదురు.. వీరిని స్వతంత్రముగా వదిలినచో, నిర్దుష్టమైన పథకములతో దేనినైననూ సాధించగలరు. ఇట్టి విజయం వీరిలో అహంకారం, నిర్లక్ష్యం, మూర్ఖత్వాలను పెంచి వీరి పతనమునకు కారణమగును. ఇవే కాక వీరు పొగడ్తలకు లొంగే స్వభావం కలవారు. పొగడ్తలకు వీరు లోనుకాకుండా జాగ్రత్తగా వున్న జీవితములో రాణించెదరు.

 

వీరిలోని నిత్యనూతన శక్తి నిర్మాణాత్మకపథకములుత్పన్నమగును. కాని వీరి నిర్లక్ష్యము వీరి శత్రువు. ఇతరుల ప్రవర్తనకు తగినట్లుగా ప్రవర్తించు లౌక్యము లేకపోవుట వలన అతి సులభముగా మోసపోవు అవకాశము కలదు. వీరు కార్యవదులు. ఆలోచన చేయుట వీరికి అయిష్టము. మనస్సులో తట్టిన ఏ భావమునైననూ కార్యరూపమున పెట్టనిదే విడిచిపెట్టరు. క్రమశిక్షణ అమలులో కఠినముగా ఉండెదరు. అందువల్ల, వీరిక్రింద పనిచేయువారు వీరి యెడల భయముతో ప్రవర్తించెదరే గాని నిజమైన అభిమానముతో ప్రవర్తింపరు. వేరు కుటుంబములో కూడా ఇదే విధంగా ప్రవర్తించుట వలన వీరి పిల్లలు వీరి వృద్ధాప్యమున వీరినెదిరించెదరు. నాయకత్వమజు వహించుట, ఇతరులను నడిపించుట వీరి ముఖ్య లక్షణం.

 

వీరి హృదయము దయ, కరుణాపూరితము, ఎవరి యందైననూ విపరీతమైన ప్రేమ లేక కోపము ఉండును గాని మధ్యేమార్గము ఉండదు. ఇతరులను ఎంత గాఢముగా ప్రేమింతురో, అంతే ప్రేమ వారు చూపనప్పుడు అంత ఎక్కువగానే బాధపడుదురు. అందువలణ అనారోగ్యమునకు మానసిక ఆందోళనకు గురి అగుదురు.

 

నిర్ణయములు చేయుట యందు వీరి ఆవేశమే ప్రాధాన్యత వహించును గాని వివేకము కాదు. దీనివలన అనేక అపజయములు (ఓటములు) ఎదుర్కొన వలసి ఉండును. వీరు నాస్తికులు కాకపోయినను, చాందసత్వము, ఆచారములు, నచ్చవు. ఈ రాశిలో పుట్టినవారికి నీచగ్రహ వీక్షణ ఉన్నచో మొరటుగా ప్రవర్తించుట, హత్యలు చేయుట, యుద్ధకాంక్ష మొదలగు అసుర (రాక్షస) లక్షణములుండును. ఇటువంటి వారు నాయకులైనచో దేశములో రక్తపాతము, ఘోర యుద్ధములు తప్పవు.

 

వీరు శారీరకంగా, మానసికంగా శక్తివంతులు, ఉత్సాహవంతులు, అందువలన ఎల్లప్పుడు స్త్రీ సాంగత్యము అవసరం. దీనివలననే వృద్ధాప్యమున జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ కాగలరు. యవ్వనమందు పురుషులు స్త్రీలనర్ధం చేసుకోనుటలో పొరపాటున మోసపోవుదురు. వీరికి ప్రేమ వివాహములు మంచిది కాదు. వృద్ధాప్యమున కూడా వీరికన్న చాలా చిన్నవయసు యువతి వ్యామోహములో పడి జీవితముణ పెద్ద మార్పు తెచ్చుకొను అవకాశం .స్త్రీళ విషయమున నియమము, క్రమశిక్షణతో ప్రవర్తించకపోయినచో అనేక మంచి అవకాశములను పోగొట్టుకొందురు.

 

జన్మతః (పుట్టుకతో) వీరు నాయకులు. పోలీసు, యుద్ధ శాఖలలో రాణింతురు. యంత్రములు, ఫ్యాక్టరీలు నిర్వహణ, నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి సులభము. ఖనిజములు, వస్తుసామాగ్రి, శాస్త్రచికిత్సా పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకము. రాజకీయములందు సమర్ధులై వ్యవహరించగలరు. వీరియొక్క విపరీత ప్రజ్ఞా పాటవములు వీరికి శత్రువులను ఏర్పరచి, ప్రాణహాని కూడా కలిగించు అవకాశమున్నది. క్రీడలయందు కూడా వీరు రాణింతురు. వీరికి చక్కని దర్శనజ్ఞానముండును. ఇతరుల కొరకై విపరీతముగా అర్జింతురు. అది తన సొంతమునకైనచో విఫలమగు సూచన.

 

వీరి వివాహ జీవితమున క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. ఆవేశమున చేసిన నిర్ణయముల వలన జీవితాంతం వీరు బాధపడుసూచనలున్నవి. చిన్న వయస్సున వివాహం చేసుకొని భార్య యెడల వ్యామోహముతో ప్రవర్తించడం జరుగగలదు.

 

వీరి ఆందోళన, ఆవేశము, ఆస్థిమితము, అసహనము మొదలైనవి అనారోగ్యమునకు కారణము కాగలదు. వయసు దాటిన తరువాత రక్తపోటు (బి.పి) రక్తనాళములు పగులుట, మెదడుకు సంబంధించిన పక్షవాతము కలుగు సూచన. శాస్త్ర చికిత్స తప్పదు.

 వీరిలో సహనం, ఓర్పు, వినయం, లౌకికజ్ఞానము వీరు అలవరచుకొన్నచో జీవితమున అపజయమనేది వీరికుండదు.


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.