'నాకు నువ్వే కావాలి'.. సుమతో రాఘవేంద్రరావు!
on Aug 17, 2022
'వాంటెడ్ పండుగాడ్' మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అనసూయ కూడా ఈ ప్రమోషన్స్ లో ఫుల్ ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ మూవీ టీం క్యాష్ షోలో సందడి చేసింది. ఎపిసోడ్ మొత్తం కూడా నవ్వులతో నిండిపోయింది. గ్లామరస్ యాంకర్ అనసూయ, దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు, యాంకర్ సుమ మధ్య జరిగిన కామెడీ బిట్ మాత్రం ఫుల్ నవ్వు తెప్పించేస్తుంది. ఇక ఈ షోలో అనసూయ చేతిలో చెయ్యేసుకుని మరీ స్టేజి మీదకు వచ్చి సుమకి సెల్యూట్ చేశారు రాఘవేంద్రరావు. సుమ కూడా సెల్యూట్ చేసింది.
ఈ సందర్భంలో సుమని రాఘవేంద్రరావు ఒక ప్రశ్న అడిగారు.. "మేమిద్దరం ఇలా చేతిలో చెయ్యేసుకుని ఎందుకు వచ్చి ఉంటాం?" అని అడిగారు. "అక్కడ మెట్లు ఉన్నాయి.. అనసూయ ఎక్కలేదు కాబట్టి జాగ్రత్తగా మీరు తీసుకొచ్చారు" అంది సుమ. "కాదు.. నేను కాలేజీ చదువుకునేటప్పుడు అనసూయ అనే అమ్మాయి ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఈ అనసూయ దొరికింది. ఇలా నడుస్తూ వచ్చి అలా ఫ్లాష్ బ్యాక్ కి వెళదామని వచ్చా" అని చెప్పారు. అనసూయ, సుమ ఆ మాటకు షాక్ ఐపోయారు.
"లక్కీగా సుమ అనే అమ్మాయి మీ లైఫ్ లో రాలేదు" అనేసరికి, "సుమ లేని లైఫ్ ఉందా అసలు. నా వల్లే కదా నీకు పెళ్లయింది" అంటారు దర్శకేంద్రుడు. "ఆ పాపం మీదే సర్" అంది సుమ. "ఇప్పుడు ఈ షో నుంచి కనీసం పది కోట్లైనా గెలుచుకుని తీసుకెళ్లాల"ని చెప్పేసరికి "పది కోట్లకైతే అనసూయని, వంద కోట్లకైతే నన్ను తీసుకెళ్లండి" అని చెబుతుంది. "అలా అయితే నాకు నువ్వే కావాలి" అని రాఘవేంద్రరావు చెప్పేసరికి సుమ షాక్ ఐపోయి అలా నిలబడిపోయింది.
తర్వాత "నవమన్మథుడా.. అతి సుందరుడా.." అంటూ అనసూయ, సుమ కలిసి ఓ డ్యూయెట్ పాడుకుని డాన్స్ చేశారు. సుమ అమ్మాయిగా, అనసూయ అబ్బాయిగా చేశారు. ఇది చూసిన రాఘవేంద్రరావు "ఎవరే అతగాడు అనే లైన్ వచ్చినప్పుడు నన్ను చూపించండే" అంటూ పంచ్ వేయడంతో స్టేజి మొత్తం అదిరిపోయింది నవ్వులతో.