15 ఏళ్ళ జింతాక్ తాక్ `విక్రమార్కుడు`!
on Jun 23, 2021
`విక్రమార్కుడు`.. కథానాయకుడిగా మాస్ మహారాజా రవితేజ స్థాయిని మరింత పెంచిన చిత్రం.
`విక్రమార్కుడు`.. దర్శకధీరుడు రాజమౌళి తొలిసారి తన కథానాయకుడిని డ్యూయెల్ రోల్ లో చూపిన సినిమా. అంతేకాదు.. తన హీరోని ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్ గా ప్రెజెంట్ చేసింది కూడా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తోనే.
`విక్రమార్కుడు`.. నేటి స్టార్ హీరోయిన్, `బొమ్మాళి` అనుష్కా శెట్టికి కెరీర్ లో తొలి విజయాన్ని అందించిన బ్లాక్ బస్టర్ బొమ్మ.
`విక్రమార్కుడు`.. 2006 హయ్యస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన సక్సెస్ ఫుల్ వెంచర్. అలాగే తమిళ - కన్నడ - హిందీ- ఇండియన్ బెంగాలీ - బంగ్లాదేశీ బెంగాలీ.. ఇలా పలు భాషల్లో రీమేక్ అయిన బాక్సాఫీస్ సెన్సేషన్.
ఇలా.. చెప్పుకుంటే ఎన్నో - ఎన్నెన్నో విశేషాలకు చిరునామా.. `విక్రమార్కుడు`.
సాధారణంగా కథానాయకుల ద్విపాత్రాభినయంతో రూపొందిన సినిమాలంటే ఏదో ఒక పాత్ర మాత్రమే హైలైట్ అవుతుంది. `విక్రమార్కుడు` మాత్రం అందుకు భిన్నం. ఇందులో టైటిల్ రోల్ అయిన ASP విక్రమ్ సింగ్ రాథోడ్ భూమిక ఎంత శక్తిమంతంగా ఉంటుందో.. దొంగ నుంచి పోలీస్ అవతారమెత్తే అత్తిలి సత్తిబాబు వేషం కూడా అంతే హాస్యభరితంగానూ, వీరోచితంగానూ ఉంటుంది. ఈ రెండు పాత్రల్లోనూ రవితేజ ఒదిగిపోయిన తీరు.. మాస్ ఆడియన్స్ ని భలేగా ఎంటర్టైన్ చేసింది. ఫలితమే.. టికెట్ విండోస్ దగ్గర కాసుల `జింతాక్ తాక్`. టెక్నీకల్ గానూ ఈ సినిమా ఉన్నత స్థాయిలోనే ఉంటుంది. స్వరవాణి కీరవాణి పాటలు - నేపథ్యసంగీతం, సర్వేష్ మురారి ఛాయాగ్రాహణం `విక్రమార్కుడు`కి ప్రధాన బలాలు.
శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మించిన `విక్రమార్కుడు`.. 2006 జూన్ 23న విడుదలై మాస్ ఎంటర్టైనర్స్ లో సరికొత్త బెంచ్ మార్క్ గా నిలిచింది. నేటితో ఈ సంచలన చిత్రం 15 వసంతాలు పూర్తిచేసుకుంది.