'బీస్ట్' టైటిల్ పై వివాదం.. రజనీని చూసి నేర్చుకోవయ్యా!!
on Jun 25, 2021
తమిళనాడులో మాతృ భాషకి పెద్దపీట వేస్తుంటారు. తమిళ భాషాభివృద్ధిలో భాగంగా కోలీవుడ్ లో రూపొందే సినిమాలకు తమిళ టైటిల్స్ పెడితే.. ఆ సినిమాలకు అక్కడి ప్రభుత్వం రాయితీలు కూడా కల్పిస్తోంది. దీంతో కోలీవుడ్ ఫిలిం మేకర్స్ తమ సినిమాలకు ఎక్కువగా తమిళ టైటిల్ పెట్టడానికే మొగ్గుచూపుతుంటారు. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన 'రోబో' మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసినా.. తమిళ వెర్షన్ కి మాత్రం 'ఎంథిరన్' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు కోలీవుడ్ లో ఇంగ్లీష్ టైటిల్స్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ వరుసగా తన సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి 'మాస్టర్' అంటూ ఇంగ్లీష్ టైటిల్ తో సినిమాని విడుదల చేసిన విజయ్.. తన లేటెస్ట్ మూవీకి కూడా 'బీస్ట్' అనే ఇంగ్లీష్ టైటిల్ నే పెట్టాడు. దీంతో తమిళ భాషాభిమానులు విజయ్ సినిమాల టైటిల్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా రెండు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడంతో.. తమిళ టైటిల్స్ కు విజయ్ వ్యతిరేకమా? విజయ్ కు తమిళ భాషపై అభిమానం లేదా? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విజయ్ తన 65వ సినిమాకి 'బీస్ట్' అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టడంపై భాషా పండితులు, పలువురు రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. రజనీకాంత్ దాదాపు తన సినిమాలన్నింటికి కూడా తమిళంలోనే టైటిల్స్ పెడతారు. కానీ విజయ్ మాత్రం తమిళ భాషాభివృద్ధికి కృషి చేయకుండా ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రజనీని చూసి నేర్చుకోవాలని మండిపడుతున్నారు. మరి ఈ ఇంగ్లీష్ టైటిల్స్ వివాదంపై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read