తరుణ్, ఉదయ్ కిరణ్‌లతో నన్ను పోల్చకండి!
on Jul 23, 2021
ఆరంభంలో కెరటంలో ఎగసిన వరుణ్ సందేశ్.. ఆ తర్వాత ఒక్కసారిగా కిందకు పడిపోయాడు. 'హ్యాపీడేస్'తో గ్రాండ్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి, అమ్మాయిల కలల రాకుమారుడు అనిపించుకున్న అతను 'కొత్త బంగారులోకం'తో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. 'ఏమైంది ఈవేళ' మూవీ తర్వాత అతని లిస్ట్‌లో మరో హిట్ మూవీ పడలేదు. నిజం చెప్పాలంటే తను ఎంచుకున్న ప్రాజెక్టులే అతని క్రేజ్‌ను, ఇమేజ్ను క్రమేణా తగ్గిస్తూ వచ్చాయి. ఒకానొక దశలో అతని కెరీర్ ముగిసిపోయిందనే అభిప్రాయం ఏర్పడింది.
బిగ్ బాస్ 3లో భార్య వితికా శేరుతో కలిసి పాల్గొనడంతో కొంత కాలం లైమ్‌లైట్‌లో ఉన్నాడు వరుణ్. ఈ షోలో డిగ్నిఫైడ్‌గా వ్యవహరించి వీక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఆ షో నుంచి బయటకు వచ్చాక 'ఇందువదన' అనే సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు వరుణ్. హీరోయిన్ ఫర్నాజ్ శెట్టితో కలిసి అతడిచ్చిన రొమాంటిక్ పోజ్ చాలా పొయెటిక్‌గా ఉందనే పేరొచ్చింది.
కాగా, లేటెస్ట్గా ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ సందేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్‌గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో "తరుణ్, ఉదయ్ కిరణ్‌లకు కెరీర్ మొదట్లో మంచి పేరు సంపాదించుకున్నారు.. ఆ తర్వాత ఆఫర్లకు దూరమయ్యారు.. మీ కెరీర్ కూడా అలాగే అనిపిస్తోంద"నే ప్రశ్న అతడికి ఎదురైంది. ఆ ఇద్దరితో తనను పోల్చవద్దంటూ వరుణ్ ఇచ్చిన ఆన్సర్ అందరి దృష్టినీ ఆకర్షించింది.
"ఉదయ్ కిరణ్ నాకు బాగా తెలుసు. ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగినదానిపై చాలా బాధపడ్డాను. అలాగే తరుణ్ కూడా నాకు తెలుసు. నా చేతుల్లో నుంచి కోల్పోయినదాన్ని తెచ్చుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. బిగ్‌బాస్ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ కు సైన్ చేశాను. కోవిడ్, ఇతర కారణాల వలన ఆ సినిమాలు సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక ఆ తర్వాత యూఎస్ కు వెళ్లి ఐటీ కోర్సు చేశాను." అని చెప్పుకొచ్చాడు వరుణ్. ఏదైనా వ్యాపారంలోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు కూడా అతను వెల్లడించాడు.
యాక్టింగ్ కెరీర్ ఒడిదుడుకుల్లో సాగుతున్నా 2015లో సహనటి వితికను వివాహం చేసుకొని, ఆనందకరమైన దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు వరుణ్. అతను పేరుపొందిన రచయిత దివంగత జీడిగుంట రామచంద్రమూర్తికి స్వయానా మనవడు.
Also Read