ఇప్పటికే మూడు పెళ్లిళ్లు విఫలమయ్యాయి.. మళ్లీ పెళ్లి ఫొటోతో అందరికీ షాకిచ్చిన వనిత!
on Jul 23, 2021
కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించిన 'బిగ్ బాస్ 4' రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనడం ద్వారా తిరిగి వెలుగులోకి వచ్చినప్పటి నుండి నటి వనితా విజయకుమార్ ప్రతి అడుగూ వార్తయిపోతూ వస్తోంది. వారం రోజుల క్రితం విజయ్ టీవీలో 'బీబీ జోడిగల్' షో నుండి మధ్యలో నిష్క్రమించి, తను అలా రావడానికి ఆ షో జడ్జిలలో ఒకరైన సీనియర్ నటి రమ్యకృష్ణ కారణమంటూ ఆరోపించారు.
ఈమధ్యలో వనిత జాతకం గురించి పేరుపొందిన జ్యోతిష్కుడు గురూజీ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. త్వరలో వనిత నాలుగో వివాహం చేసుకుంటుందనీ, ఆమె భర్త పేరు 'ఎస్' అక్షరంతో మొదలవుతుందనీ ఆయన జోస్యం చెప్పారు. ఆమె రాజకీయాల్లోకి ప్రవేశిస్తుందనీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత తరహాలో ఆమె ప్రభావం చూపుతుందని కూడా ఆయన తెలిపారు.
ఇప్పుడు వనిత తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో తమిళ కామెడీ యాక్టర్ పవర్‌స్టార్ శ్రీనివాసన్, ఆమె పరస్పరం దండలు మార్చుకుంటూ కనిపిస్తున్నారు. ఆ పోస్ట్‌కు కొన్ని రెడ్ హార్ట్ ఎమోజీలను ఆమె జోడించారు. ఈ పోస్ట్ చూసి, ఆమె ఫ్యాన్స్ షాకైపోయారు. ఆమె మళ్లీ చేసుకున్నారా? అని ఆరాలు తీశారు.
తీరా తెలిసిందేమంటే.. అది వనిత నటిస్తోన్న ఒక సినిమాలోని స్టిల్ అంట. ఆ విషయం చెప్పకుండా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆమె ఆ ఫొటోను షేర్ చేయడం గందరగోళం సృష్టించింది. ఈ తరహా పనులతో తనను తాను ఎప్పుడూ వార్తల్లో ఉండేలా వనిత చూసుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వనిత.. సీనియర్ నటుడు విజయ్‌కుమార్, ఒకప్పటి గ్లామరస్ తార దివంగత మంజుల పెద్ద కుమార్తె. ఆమె చెల్లెలు శ్రీదేవి తెలుగు ప్రేక్షకులకు నటిగా సుపరిచితురాలే. శ్రీదేవి ప్రస్తుతం మా టీవీలో కామెడీ స్టార్స్ షోకు శేఖర్ మాస్టర్‌తో పాటు జడ్జిగా వ్యహరిస్తున్నారు.
Also Read