ENGLISH | TELUGU  

'ఉప్పెన' మూవీ రివ్యూ

on Feb 12, 2021

 

సిన్మా పేరు: ఉప్పెన‌
తారాగ‌ణం: వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి, విజ‌య్ సేతుప‌తి, సాయిచంద్‌, నాగ‌మ‌హేశ్‌, రామ‌రాజు
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మౌనిక రామ‌కృష్ణ‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌
బ్యాన‌ర్స్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌

గిప్ప‌టికే మ‌స్తు మంది హీరోల‌తో మెగా కాంపౌండ్ ఫుల్ల‌యిపోయింద‌నుకుంటే ఇంగో మెగా హీరో వ‌చ్చేసిండు. గ‌త‌నే మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు పంజా వైష్ణ‌వ్ తేజ్‌. గిత‌ను ఇంగో మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు గూడా. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఇంట్ర‌డ్యూస్ అయిన 'ఉప్పెన' సిన్మా గీరోజునే.. ఫిబ్ర‌‌వ‌రి 12న రిలీజ‌య్యింది. రిలీజ్‌కు ముందుగాల్నే గీ సిన్మాకు మ‌స్తు ప‌బ్లిసిటీ వ‌చ్చేసింది. త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా యాక్ట్ జెయ్య‌డం, రాక్‌స్టార్ డీఎస్పీ మ్యూజిక్ దంచిన పాట‌లు హిట్ట‌వ‌డం, హీరోయిన్‌గా కృతిశెట్టి జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీగా ఉంద‌నే టాక్ రావ‌డంతో ఏం క్రేజ్ తెచ్చుకుందో 'ఉప్పెన‌'! మ‌రి గా సిన్మా ఎట్టుందో ఎరికేనా?

క‌థ‌
పేరు చూసి, ద‌బ్బున ఉప్పెన వ‌చ్చి ఏ ఊరైనా ఆగ‌మాగ‌మ‌య్యే ప‌రిస్థితి వొస్తే, ఆ ఊరోళ్లు ఏదో చేసుంటార‌ని అనుకొనేవారు పందెం క‌డితే చిత్తుగా ఓడిపోతారు. మ‌నం గిప్ప‌టికే ఎన్ని ల‌వ్ స్టోరీలు చూసిన‌మో లెక్క తెలీదు మ‌ల్ల‌. 'ఉప్పెన' గూడా ఒగ‌ ల‌వ్ స్టోరీనే. కోస్తాంధ్ర‌లో స‌ముద్రం ఒడ్డున ఉండే ఉప్పాడలో‌ జ‌రిగే ల‌వ్ స్టోరీ. గా ఊరికి జ‌మీందార్ అసోంటి కోట‌గిరి రాయ‌ణిం అనే ఆయ‌న బిడ్డయిన సంగీత అలియాస్ బేబ‌మ్మ అనే కాలేజీ పోరి, ఇంగో బీద‌ జాల‌రి పిల్ల‌గాడు ఆసి ప్రేమ‌లో ప‌డుతుంద‌న్న మాట‌. మ‌రైతే ప‌రువు ప్ర‌తిష్ఠ‌లే ముఖ్యం.. దాన్త‌ర్వాతే ఇంగేదైనా.. అనుకొనే రాయ‌ణిం ఊరుకుంటడా?  గా ల‌వ‌ర్స్‌ని ఇడ‌గొట్టాల‌ని తెగ ట్రై జేస్త‌డు. ఆ పిల్ల‌గాడి పేణాలు తీయ‌డు కానీ, అంత‌కంటే ఘోర‌మైన ప‌ని జేస్త‌డు. ఆయ‌న ఏం జేసిండు?  గా ప్రేమ‌ప‌క్షుల క‌త ఏ తీరానికి చేరింది? స‌ముద్రంలో మునిగిందా? ఒడ్డుకు జేరిందా?.. గింతే క‌త‌.

విశ్లేష‌ణ‌
చూసుడుకు సిన్మా క‌తే అయినా, ప్ర‌తోడికీ క‌ళ్ల‌లో నీళ్లు తిరిగేలా ఎమోష‌న‌ల్‌గా క్లైమాక్స్‌ను డైరెక్ట‌ర్ తీసిండు. ఆ క్లైమాక్స్‌ను జ‌నం మెచ్చుకుంటే సినిమా ఏడ‌కే వెళ్తుంద‌న్న మాటే. ఒక్క మాట‌లో చెప్పాల్నంటే ఉప్పెన అనేది డైరెక్ట‌ర్స్ మూవీ. మ‌గోడికి సంబంధించిన చానా సెన్సిటివ్ పాయింట్‌ని మంచి మంచి సీన్ల‌తోటీ, బ‌లేగ‌నిపించే స్క్రీన్‌ప్లేతోటి గా డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా సూప‌ర్‌గా చెప్పిండు. సుకుమార్‌కి త‌గిన శిష్యుడ‌నిపించుకున్న‌డు. కాక‌‌పోతే ఆ పాయింట్‌ ఆడియెన్స్‌కు క‌న్విన్స్ అయ్య‌నీకి మెలోడ్రామాని జ‌రంత ఎక్కువ పెట్టేసిండు. గ‌దే కొద్దిగా ఇబ్బంద‌నిపిస్త‌ది. అదొక్క‌టి ఇడిస్తే, సిన్మాని ఇంత చ‌క్కంగా తీసిన డైరెక్ట‌ర్‌ని మెచ్చుకుంట మ‌నం సిన్మా హాలు నుంచి ఇంటికెళ్తాం. గా దారిలో మ‌నం మాటిమాటికీ విజ‌య్ సేతుప‌తి ప‌ర్ఫార్మెన్స్‌నీ, డీఎస్పీ మెస్మ‌రైజింగ్ మ్యూజిక్ ఇచ్చిన పాట‌ల్నీ చెప్పుకుంటం. 

చానా సీన్లు విడివిడిగా సూప‌ర్‌గున్న‌య్‌. వాటిలో డైలాగ్స్ స్టోరీకి త‌గ్గ‌ట్లు చ‌క్కంగ న‌డిచిన‌య్‌. హీరో హీరోయిన్ల ల‌వ్ సీన్లు, మ‌ధ్య‌మ‌ధ్య‌న ఎమోష‌న‌ల్ సీన్లు, స‌క్క‌ని పాట‌ల వ‌ల్ల సిన్మా బోర్ కొట్ట‌కుండా కాల‌క్షేపంగా ఉంది. రాయ‌ణిం నుంచి త‌ప్పించుకొని పారిపోయిన ప్రేమ‌ప‌క్షులు పూరి, క‌ల‌క‌త్తా, గ్యాంగ్‌ట‌క్ లాంటి ప్లేసుల‌కు పిచ్చిపిచ్చిగా తిరిగి, ఎన్ని క‌ష్టాలు, బాధ‌లు ప‌డ‌త‌రో చూస్తా మ‌నం గూడా బాధ‌లు ప‌డ‌తం. అట్లా మెయిన్ క్యారెక్ట‌ర్‌ల ఆనందం మ‌న ఆనందం, వాటి బాధ మ‌న బాధ అయ్యిందంటే క‌త‌ని అట్ట చెప్పిన డైరెక్ట‌ర్ స‌క్సెస్ అయ్యిండ‌న్న మాటే! 

గా సీన్ల‌న్నీ మ‌స్తు చ‌క్క‌గ వ‌చ్చిన‌యంటే రీజ‌న్ షామ్‌ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ. డీఎస్పీ ఈజ్ బ్యాక్ గ‌న్న‌ట్లే ఉంది సిన్మా మ్యూజిక్‌. సాంగ్స్‌కి ట్యూన్స్ మ‌స్తు మంచిగా కొట్టిండులే. "నీ క‌న్ను నీలి స‌ముద్రం'‌, 'జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు' సాంగ్స్‌ యినుడుకు ఎంత హాయిగున్న‌యో, చూడ్డానికి గంతే చ‌క్క‌గున్న‌య్‌. విజువ‌ల్ బ్యూటీ అంటారు గ‌దా.. పాట‌ల‌న్నీ గ‌ట్ల‌నే ఉన్న‌య్‌. వాటిని తీసిన విధానం గూడా కొత్త‌ద‌నంతో ఉంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సిన్మాని ఇంగో లెవ‌ల్‌కి తీసుకెళ్లింది.

ఈ సిన్మాతో బుచ్చిబాబు సానా ఫ్యూచ‌ర్‌ల పెద్ద డైరెక్ట‌ర్ అవుత‌డ‌నే విష‌యంల అనుమానం లేదు. ఫ‌స్ట్ మూవీతోనే ఎంత డేరింగ్ స‌బ్జెక్ట్ డీల్ చేసిండు! అందుకు గాయ‌న్ని మనం మెచ్చుకోవాల‌.

న‌టీన‌టుల అభిన‌యం
హీరోయిన్‌గా డెబ్యూ మూవీ అయినా ఏమాత్రం కెమెరా డ‌ర్ లేకుండా ముచ్చ‌ట‌గా న‌టించిన కృతి శెట్టిని మెచ్చుకుంటం. క‌ళ్ల‌తోటే చూపెట్టిన ఎక్స్‌ప్రెష‌న్స్ చూసి గామెతో మ‌నం ల‌వ్‌లో ప‌డిపోతం. క్లైమాక్స్ సీన్‌లో గా పోరి ప‌ర్ఫార్మెన్స్ ఎంత‌టి రాయ‌సంటోడికైనా క‌న్నీళ్లు తెప్పిస్త‌ది. తండ్రి క్యారెక్ట‌ర్ పోషించిన బెస్ట్ యాక్ట‌ర్‌ విజ‌య్ సేతుప‌తితో చేసిన‌ సీన్‌ల‌ గాయ‌న‌కి ఏమాత్రం త‌గ్గ‌కుండా యాక్ట్ జేయ‌డ‌మే గాక శ‌భాష్ అనిపించుకుంది. కృతి కోసం రెండోసారి కూడా ఈ సిన్మా చూసెటోళ్లు ఉంట‌రుంటే అబ‌ద్దం కాదు.

డెబ్యూ హీరో వైష్ణ‌వ్ తేజ్‌లో హీరో మెటీరియ‌ల్ ఉంద‌ని ఒప్పుకుంటం. మ‌నం ఎక్స్‌పెక్ట్ జేసిన దానికంటే మంచిగ‌నే ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చిండు. త‌న క్యారెక్ట‌ర్‌లోని సంఘ‌ర్ష‌ణ‌ని బాగానే ప‌లికిచ్చిండు. త‌న‌కి సంబంధించిన ఒక విష‌యాన్ని సంగీత‌కు చెప్ప‌లేక‌, ఆమె ప్రేమ‌ని వ‌దులుకోలేక న‌ర‌క‌యాత‌న ప‌డే క్యారెక్ట‌రైజేష‌న్‌కు న్యాయం చేసిండు. ఫ‌స్ట్ ఫిల్మ్‌కి గీమాత్రం యాక్టింగ్ చేసిండంటే మంచి ఫ్యూచ‌ర్ ఉంది.

ఇగ విజ‌య్ సేతుప‌తి యాక్టింగ్ గురించి ఏం జెప్తం! టాలీవుడ్‌లో చానా మంది మంచి ప‌ర్ఫార్మ‌ర్లు ఉండ‌గ, పోయిపోయి గాయ‌న్నే రాయ‌ణిం క్యారెక్ట‌ర్‌కు ఎందుకు తీసుకున్న‌రో సిన్మా చూసినంక అర్థ‌మైపోత‌ది. గాయ‌న ఏం ప‌ర్ఫార్మ‌న్స్ ఇచ్చిండ‌బ్బా! రాయ‌ణిం క్యారెక్టర్‌ని మంచిగా అండ‌ర్‌స్టాండింగ్ జేస్కుని దాని లెక్క‌న మారిపోయిండు. ఇగ మ‌న‌కు విజ‌య్ సేతుప‌తి క‌నిపిస్తే ఒట్టు మ‌ల్ల‌! సూప‌ర్బ్ అంతే!! సిన్మాలో మంచిగా చెప్పుకోవాల్సిన ఇంగో క్యారెక్ట‌ర్ ఉంది. అది సాయిచంద్ జేసిన జాల‌య్య పాత్ర‌. హీరో తండ్రి పాత్ర‌. ఆ క్యారెక్ట‌ర్‌కు గాయ‌న ప్రాణం పోసిండు. ఆ పాత్ర‌పై మ‌న‌కు మ‌స్తు సానుభూతి క‌లుగుత‌ది.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
మొత్తంగా 'ఉప్పెన' ఒగ దృశ్య కావ్యం అంటారు గ‌దా.. గ‌ట్లున్న‌ది. మాస్ ఏరియాల‌ల్ల ఆడియెన్స్‌ని గ‌న‌క ఈ సిన్మా మెప్పిస్తే.. 'రంగ‌స్థ‌లం' లెక్క‌న కాక‌పోయినా పెద్ద హిట్ట‌వుత‌ది. లేదంటే ఏ సెంట‌ర్ల సిన్మాగైనానా పేరు తెచ్చుకుంట‌ది. ఏదేమైనా మూవీ మంచి ఫీల్‌నిస్త‌దనేది నిజం.

రేటింగ్‌: 3/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.