మిల్కీ బ్యూటీ.. మాలీవుడ్ ఎంట్రీ?
on Jun 22, 2021
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన మిల్కీ బ్యూటీ తమన్నా.. హిందీ చిత్ర పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసింది. అలాగే `జాగ్వార్`, `కేజీఎఫ్ ఛాప్టర్ 1` వంటి కన్నడ చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన ఈ స్టన్నింగ్ బ్యూటీ.. త్వరలో `కేజీఎఫ్` స్టార్ యశ్ సరసన ఓ పూర్తిస్థాయి శాండల్ వుడ్ మూవీ చేయబోతోందనే కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తమన్నా త్వరలో ఓ మలయాళ చిత్రంలోనూ నటించబోతోందట. `బెంగళూరు డేస్` ఫేమ్ అంజలీ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని.. ఇదో ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని మాలీవుడ్ బజ్. అంతేకాదు.. ఓ ఉత్తరాది అమ్మాయి చుట్టూ తిరిగే కథాంశంతో ఈ ఫీచర్ ఫిల్మ్ తెరకెక్కనుందని అంటున్నారు. కాగా, ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముందని వినికిడి. మరి.. మిల్కీ బ్యూటీ మాలీవుడ్ ఎంట్రీపై వస్తున్న ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం తమన్నా చేతిలో `ఎఫ్ 3`, `గుర్తుందా శీతాకాలం` చిత్రాలు ఉన్నాయి. మరోవైపు `సీటీమార్`తో పాటు రీమేక్ మూవీస్ అయిన `దటీజ్ మహాలక్ష్మి`, `మాస్ట్రో` విడుదలకు సిద్ధమయ్యాయి. అలాగే `బోలే చుడియాన్` పేరుతో తయారవుతున్న హిందీ సినిమాలోనూ తమన్నా నాయికగా నటిస్తోంది.