`బంగార్రాజు`తో సోనాక్షి?
on May 7, 2021
కింగ్ నాగార్జున కెరీర్ లో చివరి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా`. ఆ సినిమా విడుదలై ఐదేళ్ళు దాటినా.. మరో హిట్ బొమ్మ నాగ్ ఖాతాలో పడలేదు. ఈ నేపథ్యంలో.. త్వరలో `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్ `బంగార్రాజు`ని పట్టాలెక్కించబోతున్నారీ అక్కినేని స్టార్. `సోగ్గాడే..`ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే `బంగార్రాజు` కూడా రూపొందనుంది. అన్నీ కుదిరితే జూలైలో ఈ క్రేజీ సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారట.
ఇదిలా ఉంటే.. `సోగ్గాడే చిన్ని నాయనా`లో తండ్రీకొడుకులుగా నాగ్ ద్విపాత్రాభినయం చేయగా.. తండ్రి పాత్రకి జోడీగా రమ్యకృష్ణ, కొడుకు క్యారెక్టర్ కి జంటగా లావణ్య త్రిపాఠి సందడి చేశారు. ఇక `బంగార్రాజు` విషయానికి వస్తే.. రమ్యకృష్ణ ఇందులోనూ కొనసాగనున్నారు. ఇక మరో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. హిందీనాట స్టార్ హీరోయిన్ అనిపించుకున్న సోనాక్షి.. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తమిళ చిత్రం `లింగ` (2014)లో ఓ నాయికగా నటించింది. తెలుగులో నేరుగా నటించని సోనాక్షికి.. `బంగార్రాజు` మొదటి ప్రయత్నం కాబోతోంది. త్వరలోనే `బంగార్రాజు`లో సోనాక్షి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.