శంకర్‌కి ఈ సారైనా వర్కవుట్ అవుతుందా?
on Apr 16, 2021
దక్షిణాది చిత్ర పరిశ్రమ గర్వించే దర్శకుల్లో శంకర్ ఒకరు. పరిమిత సంఖ్యలోనే సినిమాలు తీసినా.. వెండితెరపై అద్భుతాలు సృష్టించారాయన. ఇప్పటివరకు శంకర్ నుంచి 13 చిత్రాలు రాగా.. వాటిలో సింహభాగం ఒరిజినల్స్ నే. రెండే రెండు చిత్రాలు రీమేక్స్. అందులో ఒకటి తన తమిళ సినిమాని తనే హిందీలో రీమేక్ చేయగా.. మరొకటేమో హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీని తమిళంలో రి-క్రియేట్ చేశారు శంకర్. ఈ రెండు సందర్భాల్లోనూ ఆశించిన ఫలితాలు దక్కలేదు. `ముదలవన్` (ఒకేఒక్కడు)ని `నాయక్` పేరుతో హిందీలో రీమేక్ చేసిన శంకర్ కి.. అక్కడ డిజాస్టరస్ రిజల్ట్ దక్కింది. ఇక హిందీనాట ఘనవిజయం సాధించిన `త్రీ ఇడియట్స్` (రాజ్ కుమార్ హిరాణి దర్శకుడు)ని తమిళంలో `నన్బన్` (స్నేహితుడు) పేరుతో రీమేక్ చేయగా యావరేజ్ మూవీ అయింది.
ఈ నేపథ్యంలో.. దశాబ్దం తరువాత మరో రీమేక్ టచ్ చేస్తున్నారు శంకర్. తన కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీ అయిన `అనియన్` (అపరిచితుడు) ని బాలీవుడ్ యూత్ ఐకాన్ రణ్ వీర్ సింగ్ తో రీమేక్ చేయబోతున్నారాయన. 2022 మధ్యలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. హిందీతో సహా అన్ని భాషల్లోనూ అనువాదమైన `అనియన్`ని రీమేక్ చేయడమంటే సాహసమే. అందులో ఇది పాన్ - ఇండియా మూవీగా రాబోతుండడం గమనార్హం. అసలే.. రీమేక్స్ శంకర్ కి అస్సలు అచ్చిరావు అన్న బ్యాడ్ సెంటిమెంట్ దృష్ట్యా.. `అనియన్` రీమేక్ అయినా ఈ దిగ్గజ దర్శకుడికి వర్కవుట్ అవుతుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. చూద్దాం.. ఏం జరుగుతుందో?