2022 సంక్రాంతి.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్?
on Jul 28, 2021
తెలుగునాట సంక్రాంతి సీజన్ లో రిలీజయ్యే సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అలాంటి ఈ సీజన్ లో ఒక్కో సారి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కథానాయకులు వేర్వేరు చిత్రాలతో బరిలోకి దిగిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే.. 2022 సంక్రాంతికి కూడా ఇలాంటి ముచ్చట చోటుచేసుకోనుందని సమాచారం. ఈ సారి.. రెండు వేర్వేరు కుటుంబాలకి చెందిన బాబాయ్, అబ్బాయ్ లు పొంగల్ బరిలోకి దిగే అవకాశముందని సమాచారం. అది కూడా.. మల్టిస్టారర్ మూవీస్ తో.
ఆ వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇక అదే సీజన్ లో మరో మల్టిస్టారర్ రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ సినిమానే.. `ఎఫ్ 3`. విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించగా 2019 సంక్రాంతి సీజన్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన `ఎఫ్ 2` మూవీకి సీక్వెల్ ఇది. ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ కూడా 2022 పెద్ద పండక్కి రాబోతోందని టాలీవుడ్ బజ్.
సో.. వచ్చే సంక్రాంతికి కొణిదెల వారి బాబాయ్ తో దగ్గుబాటి అబ్బాయ్ కలిసి నటించిన సినిమా, దగ్గుబాటి బాబాయ్ తో కొణిదెల వారి అబ్బాయ్ జట్టుకట్టిన చిత్రం పోటీపడనున్నాయన్నమాట. అలాగే.. వెంకీ వర్సెస్ రానా, పవన్ వర్సెస్ వరుణ్ అన్న వాతావరణం ఉండబోతోందన్నమాట. మరి.. రెండు వేర్వేరు కుటుంబాల `బాబాయ్ వర్సెస్ అబ్బాయ్` ముచ్చట ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. అంతకంటే ముందు.. `ఎఫ్ 3` విడుదల తేదిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.