అలీ నా ఫేవరేట్.. పెద్ద హిట్ కొడతారు: సమంత
on Jul 23, 2021
'అందరూ బావుండాలి అందులో నేనుండాలి' సినిమాలోని మూడో పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని సమంత అక్కినేని చెప్పారు. ‘‘ఎందుకంటే నా ఫేవరేట్ అలీగారు ప్రొడ్యూస్ చేస్తున్న మొదటి చిత్రమిది. నాకు ఇలాంటి రియల్ లైప్ స్టోరీలంటే చాలా ఇష్టం. ఇలాంటి సోల్ ఉన్న కథలను నేను చూస్తుంటాను. ఇట్స్ ఏ స్లైస్ ఆఫ్ లైఫ్, ఎందుకంటే రియలిస్టిక్, అండ్ రిలేటబుల్ స్టోరీ. అందుకే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే అలీగారి మీద నమ్మకం ఉంది’’ అని ఆమె అన్నారు.
అలీ, నరేశ్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి ఈ సినిమా రీమేక్‌గా రూపొందింది. ఆలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ కొణతాల, బాబా అలీ, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీపురం కిరణ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎ.ఆర్. రెహమాన్ వద్ద సంగీత శిక్షణ పొందిన రాకేశ్ పళిదం ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా మారారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు మార్కెట్లోకి విడుదలై చక్కని విజయం దక్కించుకున్నాయి.
మొదటి పాటను ప్రభాస్ విడుదల చేసి సినిమా పబ్లిసిటీని ప్రారంభిస్తే, రెండో పాటను సోనూసూద్ విడుదల చేశారు. ఈ చిత్రంలోని పతాక సన్నివేశంలో వచ్చే మూడో పాటను సమంతా అక్కినేని విడుదల చేసి ఆలీకి సినిమా టీమ్‌కి తన అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ‘‘సమంత గారు నేను అడగ్గానే నా సినిమాలోని మూడో పాటను విడుదల చేసినందుకు హ్యాపీగా ఉంది. అలాగే తను చేస్తున్న ‘శాకుంతలం’ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. సమంతా మీ బ్యానర్ పేరు ఏంటి అని అడిగితే ఆ వుడ్, ఈ వుడ్ ఎందుకు అని ఆలీవుడ్ అని బ్యానర్ పేరు పెట్టాను అని చెప్పాను’’ అని నవ్వేశారు.