13 ఏళ్ళ రామ్ `రెడీ`
on Jun 19, 2021
అగ్ర దర్శకుడు శ్రీను వైట్ల సినిమాలంటేనే వినోదానికి చిరునామా. యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఇలా ఈ మూడు అంశాలను సమపాళ్ళలో రంగరిస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను రూపొందించే శ్రీను వైట్ల నుంచి వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో `రెడీ` ఒకటి. ఎనర్జిటిక్ స్టార్ రామ్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, నాజర్, చంద్రమోహన్, సునీల్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, సుప్రీత్, షఫీ, ప్రగతి, సుధ, రజిత, శ్రీనివాస రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, సత్య కృష్ణన్, సురేఖా వాణి, మాస్టర్ భరత్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వగా.. తమన్నా, నవదీప్ అతిథి పాత్రల్లో మెరిశారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``గెట్ రెడీ``, ``మేరీ సజ్నా``, ``ఓం నమస్తే బోలో``, ``నా పెదవులు నీవైతే``, ``నిన్నే పెళ్ళాడుకుని``, ``అయ్యో అయ్యో దానయ్య``.. ఇలా ఇందులోని గీతాలన్ని యువతరాన్ని ఉర్రూతలూగించాయి. స్రవంతి మూవీస్ పతాకంపై `స్రవంతి` రవికిశోర్ నిర్మించిన `రెడీ` తెలుగునాట ఘనవిజయం సాధించడమే కాకుండా.. కన్నడలో `రామ్` (పునీత్ రాజ్ కుమార్, ప్రియమణి), తమిళంలో `ఉత్తమ పుత్రన్` (ధనుష్, జెనీలియా), హిందీలో `రెడీ` (సల్మాన్ ఖాన్, అసిన్) పేర్లతో రీమేక్ అయి అన్ని చోట్లా కాసుల వర్షం కురిపించింది. అలాగే, `బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిల్మ్`, `బెస్ట్ మేల్ కమెడీయన్` (బ్రహ్మానందం), `బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్` (మాస్టర్ భరత్) విభాగాల్లో `నంది` అవార్డులను పొందింది. 2008 జూన్ 19న విడుదలైన `రెడీ`.. నేటితో 13 వసంతాలను పూర్తిచేసుకుంది.