'మాలిక్' రీమేక్‌పై కన్నేసిన రానా!
on Aug 1, 2021
కథానాయకుడిగా నటించినా, ప్రతినాయకుడిగా కనిపించినా, ప్రత్యేక పాత్రలో అలరించినా.. ఎక్కువగా స్ట్రయిట్ పిక్చర్స్ లోనే సందడి చేశాడు రానా దగ్గుబాటి. తన కెరీర్ లో రీమేక్స్ చాలా తక్కువే. అప్పుడెప్పుడో తమిళంలో `బెంగళూరు నాట్ గళ్` (2016) అనే ఓ రీమేక్ లో నటించాడు. మలయాళంలో ఘనవిజయం సాధించిన `బెంగళూరు డేస్` (2014)కి రీమేక్ వెర్షన్ ఇది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ రీమేక్ తమిళనాట ఆశించిన విజయం సాధించలేదు.
కట్ చేస్తే.. చాన్నాళ్ళ తరువాత ఇప్పుడు మరో మాలీవుడ్ రీమేక్ లో నటిస్తున్నాడు రానా. ఆ సినిమానే `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో ఈ దగ్గుబాటి హ్యాండ్సమ్ స్టార్ దర్శనమివ్వనున్నాడు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు రానా. కాగా, 2022 సంక్రాంతికి ఈ మల్టిస్టారర్ సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ విడుదలయ్యేలోపే మరో మాలీవుడ్ రీమేక్ పై కన్నేశాడట రానా. ఆ చిత్రం మరేదో కాదు.. వెర్సటైల్ స్టార్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించగా అమెజాన్ ప్రైమ్ లో నేరుగా స్ట్రీమ్ అయిన `మాలిక్`. మాతృకలో ఫహద్ చేసిన పాత్ర బాగా నచ్చడంతో.. ఈ రీమేక్ రైట్స్ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడట రానా. మరి.. ఈ రీమేక్ ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కొసమెరుపు ఏంటంటే.. `బెంగళూరు డేస్` రీమేక్ లో ఫహద్ పోషించిన పాత్రలోనే రానా కనిపించాడు. కట్ చేస్తే.. ఐదేళ్ళ తరువాత మరోసారి ఫహద్ ధరించిన వేషంలోనే నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. `బెంగళూరు డేస్` రీమేక్ ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో.. `మాలిక్` అయినా కలిసొస్తుందో లేదో చూడాలి.
Also Read